Friday, April 26, 2024

300 దాటిన కరోనా మరణాలు

- Advertisement -
- Advertisement -

Corona

 

300 దాటిన కరోనా మరణాలు
ఒక్క రోజే 51 మంది మృతి
9,352కు పెరిగిన పాజిటివ్ కేసులు
మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులలో భారీగా పెరిగిన బాధితులు
ముంబయిలో భయపెడుతున్న ధారవి మురికి వాడ
పరిస్థితి అదుపులోనే ఉందన్న కేంద్రం

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకు పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశంలో కరోనా బారిన పడి 51 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 324కి చేరుకుంది. కాగా సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 9,352కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరిలో 8000 మందికి పైగా చికిత్స పొందుతుండగా 865 మంది డిశ్చార్జి అయ్యారు. డిశ్చార్జి అయిన వారిలో 72 మంది విదేశీయులు కూడా ఉన్నారు. దేశంలోని కరోనా మరణాల్లో సగం మహారాష్ట్రలోనే చోటు చేసుకున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 50 మందికి పైగా చనిపోతే వీరిలో 22 మంది మహారాష్ట్రకు చెందిన వారే అంటే వైరస్ తీవ్రత ఆ రాష్ట్రంలో ఎంతగా ఉందో అర్థమవుతుంది. తాజా మరణాలతో కలుపుకొని రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 149కి చేరుకుంది. గత రెండు రోజుల్లోనే రాష్ట్రంలో 400కు పైగా పాజిటివ్ కేసులు నమోదైనాయంటే వైరస్ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

దేశ ఆర్థిక రాజధాని ముంబయితో పాటుగా, పుణెలోను కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ముంబయిలోని ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారవిలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడం అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ధారవిలో నాలుగు కొత్త కేసులు నమోదు కాగా ఒకరు చనిపోయారు. దీంతో ఇక్కడ ఇప్పటివరకు 47 పాజిటివ్ కేసులు నమోదౌఐనాయి. యుపిలోని ఆగ్రా జిల్లాలో ఒక్క రోజే 30 కొత్త కేసులు నమోదైనాయి. వీరిలో పరాస్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ కూడా ఉన్నారు. కాగా మహారాష్ట్ర తర్వాత వైరస్ తీవ్రత అధికంగా ఉన్న తమిళనాడు, ఢిల్లీలోను కేసుల సంఖ్య వెయ్యి దాటింది. నిజాముద్దీన్ ఘటన తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటివరకు 1154 పాజిటివ్ కేసులు నమోదు కాగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు.

రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి ప్రజలను ఇళ్లలోంచి బైటికి రావద్దని హెచ్చరించారు. కూరగాయలు, పండ్లు లాంటి వాటి విక్రయానికి కూడా సరిబేసి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఇక తమిళనాడులోను కోవిడ్19 విజృంభణ కొనసాగుతోంది. మర్కజ్ సమావేశం తర్వాత రాష్ట్రంలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల పాజిటివ్ సంఖ్య 1043కు చేరుకోగా,11 మంది మృత్యువాత పడ్డారు. మహారాష్ట్ర తర్వాత కరోనా మరణాల సంఖ్య మధ్యప్రదేశ్, గుజరాత్‌లోనే ఎక్కువగా ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు కరోనా కారణంగా 36 మంది చనిపోగా, గుజరాత్‌లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 564 కేసులు నమోదు కాగా ఒక్కరు కూడా కోలుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏడుగురు చొప్పున చనిపోగా, కర్నాటకలో ఆరుగురు, యుపిలో ఐదుగురు చనిపోయారు. గత 24 గంటల్లో ఢిల్లీలో అయిదుగురు, గుజరాత్‌లో ముగ్గురు, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో ఇద్దరేసి చనిపోగా, జార్ఖండ్, ఎపిలలో ఒక్కొక్కరు మృతి చెందారు. కేంద్రం ఇప్పటివరకు 140 జిల్లాలను హాట్‌స్పాట్‌గా గుర్తించింది.

పరిస్థితి అదుపులోనే ఉంది: కేంద్రం
ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 9000కు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా మరణాల సంఖ్య 300 దాటింది. అంటే మరణాల రేటు 3 శాతానికి చేరకుంది. అయితే ఇప్పటికీ మనం తారస్థాయికి చేరుకోలేదని ప్రభుత్వం చెప్తోంది. మరణాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వైరస్ నియంత్రణలోనే ఉందని సోమవారం మీడియా సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు. ఆ పరిస్థితి రాకుండా చూడడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. కాగా చైనానుంచి తొలి విడత కోవిడ్19 టెస్టింగ్ కిట్లు ఈ నెల 15కల్లా దేశానికి చేరుకుంటాయని ఐసిఎంఆర్ ప్రధాన శాస్త్రవేత్త రామన్ ఆర్ గంగాఖేడ్కర్ చెప్పారు. ఇప్పటివరకు తాము 2,06,212 శాంపిల్స్‌ను పరీక్షించామని ఆయన చెప్పారు. తాము ఇప్పుడు నిర్వహిస్తున్న టెస్టుల వేగాన్ని బట్టి చూస్తే మరో ఆరు వారాలు పాటు పరీక్షలు నిర్వహించడానికి తగినన్ని టెస్టింగ్ కిట్లు ఉన్నాయని ఆయన చెప్పారు.

Corona casualties beyond 300
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News