Saturday, April 27, 2024

కొవిడ్‌లో ముంబైకి మంచి సారథ్యం

- Advertisement -
- Advertisement -

Corona control following the Mumbai model

భారత దేశం మొత్తం మీద కరోనా మహమ్మారి తీవ్ర కల్లోలం రేపింది ప్రధానంగా రెండు నగరాలలో. ఒకటి దేశ ఆర్ధిక రాజధాని ముంబై అయితే, మరొకటి దేశ రాజకీయ రాజధాని ఢిల్లీ. అయితే ఈ రెండు నగరాలలో ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి చేసిన ప్రయత్నాలు భిన్నంగా ఉన్నాయి. సంక్షోభ సమయంలో అసమానమైన నాయకత్వం ముంబైకి లభించింది. అది రాజకీయ నాయకత్వం కావచ్చు. పరిపాలనాపరమైన నాయకత్వం కావచ్చు. అదే ఢిల్లీలో లోపించిందని చెప్పవచ్చు. అందుకనే దేశమంతటా సెకండ్ వేవ్ దారుణమైన ఆందోళనను కలిగిస్తుంటే ముంబై నగరంలో మాత్రం కేసులు తగ్గుముఖం పట్టాయి.

‘ముంబై నమూనా’ అన్నది ఇప్పుడు మన దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా ప్రాముఖ్యత సంతరింప చేసుకొంటున్నది. స్వయంగా సుప్రీంకోర్టు ‘ముంబై నమూనా’ అనుసరించి కరోనా కట్టడి చేయమని ఢిల్లీ ప్రభుత్వానికి హితవు చెపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కరోనా కట్టడికి అనుసరించిన విలక్షణమైన పద్ధతులను అభినందిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేని ప్రశంసించారు. థాకరేకి పరిపాలన అనుభవం లేకపోవచ్చు. అయిష్టంగా అధికారం చేపట్టి ఉండవచ్చు. ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుండి ఎక్కువగా ఇంటి నుండి కార్యకలాపాలు సాగిస్తున్నారు. రాష్ట్రంలో, నగరంలో ఆయన పెద్దగా పర్యటనలు జరుపుతున్నట్లు కూడా లేదు. పైగా ఆయనను నడిపిస్తున్నది ఎన్‌సిపి అధినేత శరద్ పవర్ అనే ప్రచారం కూడా సాగుతున్నది. అధికారం చేపట్టినప్పటి నుండి ఆయన ఎక్కువగా కరోనాతోనే సతమతం కావలసి వచ్చింది.

ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించవలసి ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రి డా. హర్షవర్ధన్ స్వయం గా ఢిల్లీ నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పాలనా పరంగా హోమ్ మంత్రి అమిత్ షా కు బాధ్యతలు ఉన్నాయి. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అమిత్ షా, హర్షవర్ధన్ కలసి ఉమ్మడిగా ప్రయత్నం చేసి ఉంటే నేటి వలే దారుణమైన పరిస్థితులు అక్కడి ఉండి ఉండేవి కావు. అక్కడ ప్రధాన సమస్య ‘అధికార కేంద్రీకరణ’. ఢిల్లీ ప్రభుత్వంలో ప్రతి అంశం ముఖ్యమంత్రి, లేకపోతే మనీష్ సిసోడియా నిర్ణయం తీసుకొననిదే జరగదు. కేంద్ర ప్రభుత్వం సహితం అందుకు భిన్నంగా లేదు. వారికి ప్రచారంపై ఉన్న శ్రద్ధ మౌలిక అంశాల పట్ల ఉన్నట్లు కనిపించదు. ప్రతి అంశం ప్రధాన మంత్రి కార్యాలయం వైపు చూడవలసిందే. అందుకనే జవాబుదారీతనం, బాధ్యతాయుత ప్రవర్తన అక్కడ లోపించినట్లు చెప్పవచ్చు.

కానీ అందుకు భిన్నంగా ముంబైలో జరిగింది. థాకరే అధికారాలు అన్నింటిని తన వద్ద కేంద్రీకరించుకోలేదు. తన మంత్రులను, అధికారులకు బదలాయించారు. వారికి నిర్దుష్టమైన బాధ్యతలు అప్పచెప్పారు. బ్రిహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిబిఎంసి) మునిసిపల్ కమిషనర్ గా ఇక్బాల్ సింగ్ చాహల్‌ను నియమిస్తూ ఒకే మాట చెప్పారు. ‘కరోనా కట్టడిలో మీరు విజయం సాధిస్తే ఆ కీర్తిప్రతిష్ఠలు అన్ని మీరె తీసుకొని, మీరు విఫలమైతే ఆ అపనిందలు నేను స్వీకరిస్తాను’. ఈ విధంగా చెప్పడం ద్వారా అసమానమైన నాయకత్వ ప్రతిభను థాకరే ప్రదర్శించారు. ఆ వైఖరే అధికార యంత్రాంగంలో మంచి ఉత్సా హం కలిగించడమే కాదు, జవాబుదారీతనం తీసుకు వచ్చింది. బాధ్యతాయుతంగా పని చేశారు. ముంబై నగరంలో అన్ని వ్యవహారాలను సెంట్రల్ వార్ రూమ్‌లో కేంద్రీకరించకుండా చాహల్ నగరాన్ని ప్రత్యేక వార్డులుగా విభజించి, ఒకొక్క అధికారికి నిర్దిష్ట బాధ్యతలు అప్పగించారు.

ఎవ్వరికీ ఆసుపత్రిలో పడక అవసరమైనా ప్రతి అపార్ట్‌మెంట్ నుండి విజ్ఞప్తి రాగానే వెంటనే కల్పించే ఏర్పాటు చేశారు. దేశంలో మరెక్కడా లేని సమన్వయంతో అవసరమైన వారికి వైద్య సేవలు అందించే ప్రయత్నం చేశారు. అనారోగ్యం గురించి చెప్పగానే వారికి వెంటనే ఒక ఆసుపత్రి లేదా వైద్య కేంద్రం కేటాయించడం, ఒక గంట లోపు వారి ఇంటి వద్దకు అంబులెన్సు చేరుకోవడం, వారిని తీసుకు వెళ్లడం జరిగే విధంగా ఏర్పాట్లు జరిగాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ప్రొటోకాల్‌ను పాటిస్తూ టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్‌ను ముమ్మరం చేయడమే కాకుండా ప్రజలు ఆందోళన చెందకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.

24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారు కొవిడ్ బెడ్ల కోసం ఉరుకులూ పరుగులూ పెట్టకుండా సింగిల్ విండో వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ ఢిల్లీలో ఏమి జరిగింది? అక్కడ ప్రతి అధికారి, శాస్త్రవేత్త ఆదేశాల కోసం పైకి చూడవలసి వస్తున్నది. ఢిల్లీలో రెండో వేవ్ రాగానే బాధితులకు ఉపశమనం కలిగించడం కోసం ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ డిస్పెన్సర్లు, మందులు మొదలైన వాటి ఏర్పాట్లు చేయడంలో గురుద్వారాలు, ఎన్‌జిఒలు, స్వచ్ఛంద సేవకుల బృందా లు, రెసిడెంట్ కాలనీ అసోసియేషన్లు ముందుకు వచ్చాయి. ప్రభుత్వ యంత్రాంగం కాదని గమనించాలి.

గత అర్ధ శతాబ్ద కాలంగా ఒక జర్నలిస్ట్‌గా ఢిల్లీలో తాను ఎన్నో హృదయ విదారకర సంఘటనలు చూశానని ప్రముఖ జర్నలిస్ట్ కూమి కపూర్ చెబుతూ సిక్కుల ఊచకోత, ఉగ్రవాద దాడులు, మత కల్లోలాలను ప్రస్తావించారు. అయితే ఇటీవల కొవిడ్ -19 కేసుల విజృంభణ నేపథ్యంలో నెలకొన్న గందరగోళం, హృదయ స్పందన గతంలోని విషాదాలకు అన్నింటికీ భిన్నంగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రతి రెండవ ఇల్లు ఈ ఉపద్రవానికి గురైనట్లు చెప్పుకొచ్చారు. రాత్రంతా అంబులెన్స్ సైరన్ల నిరంతర ఏడ్పు, వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో ఆసుపత్రి పథకాలు, ఆక్సిజన్ సిలిండర్లు, రెమెడిసివిర్, ప్లాస్మా, ఇతర అవసరాల కోసం అరణ్య రోదనలతో గతంలో ఎన్నడూ ఎరుగని తీవ్ర సంక్షోభాన్ని ఢిల్లీ ప్రజలు ఎదుర్కొన్నారు. ప్రతి రోజు ఎవ్వరో బంధువు, స్నేహితుడు ఈ మహమ్మారికి బలైన్నట్లు వినవలసి వస్తుందనే ఆందోళనతో ప్రజలు గడుపుతున్నారు. ఢిల్లీ ఆరోగ్యశాఖ అధికారులు జనాన్ని సముద్రంలోకి నెట్టివేసారా అనే అనుమానాలు కలుగక మానవు.

కొవిడ్ శతాబ్ద కాలంలో ఏర్పడిన పెను సంక్షోభం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. ఇంతటి సంక్షోభకర పరిస్థితిలో ఒక జాతీయ విపత్తుగా తీసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా కృషి చేసి ప్రజలను ఆదుకోవలసిన పరిస్థితి. అయితే రెండో వేవ్ వస్తుందని ప్రపంచంలో శాస్త్రవేత్తలు ఎవ్వరూ ఊహించలేదని అంటూ తమ నిర్లక్ష్య ధోరణిని కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

వాస్తవానికి గత ఏడాది మధ్య నుండి ఇసిఎంఆర్ వంటి కీలక సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. ‘ముంబై నమూనా’ చెప్పే ప్రధాన గుణపాఠం ఏమిటంటే ‘అధికార కేంద్రీకరణ’ చాలా ప్రమాదకరమని. నేడు దేశంలో కరోనా కట్టడి పట్ల సత్వరం స్పందించకపోవడం, అవసరమైన చర్యలను త్వరితగతిన తీసుకోలేక పోవడంపై అదే ప్రధాన కారణమని గమనించాలి. మరోవంక, ప్రభుత్వంలో జవాబుదారీతనం ఉండా లి. నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలి. నిజాయితీతో పని చేస్తున్న వారిని ప్రోత్సహించాలి. ఆ విధంగా కాకుండా ‘భజనపరుల’ తో ఇటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదని గ్రహించాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News