Saturday, May 4, 2024

అసోం కొత్త ముఖ్యమంత్రి

- Advertisement -
- Advertisement -

Himanta Biswa Sarma takes oath as Assam chief minister

 

అసోంలో ఎట్టకేలకు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సోమవారం నాడు జరిగింది. ముఖ్యమంత్రి పదవిని హిమంత విశ్వాస్ శర్మ చేపట్టారు. ఆయనతో పాటు 13 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తిరిగి బిజెపి కూటమే గెలుపొందినప్పటికీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఇంత ఆలస్యం కావడమే ఆశ్చర్యం కలిగించింది. శాసన సభలోని మొత్తం 126 స్థానాలలో బిజెపి కూటమి 75 సీట్లను గెలుచుకున్నది. బిజెపికి సొంతంగా 60 స్థానాలు వచ్చాయి. కూటమిలో భాగస్వామ్యపక్షాలైన అసోం గణపరిషత్ (ఎజిపి) తొమ్మిదింటిని, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యుపిపిఎల్) ఆరు స్థానాలను సాధించుకున్నాయి. ఆ విధంగా స్పష్టమైన, ఎదురులేని ఆధిక్యతను పొందినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటులో ఎందుకింత ఆలస్యం జరిగింది? రోజుకి 5000 కొత్త కొవిడ్ కేసులతో తీవ్ర ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దశలో వెంటనే స్థిరమైన ప్రభుత్వాన్ని ఎందుకు నెలకొల్పలేకపోయారు అనేది ముఖ్యమైన ప్రశ్న. బిజెపిలో ఇరువురి నాయకుల మధ్య ముఖ్యమంత్రి పీఠం కోసం తలెత్తిన పోటీయే ఇందుకు కారణమని స్పష్టపడుతున్నది.

ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిలలో వెనువెంటనే ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా, ఒక్క అసోంలోనే ఇంత జాప్యం జరిగింది. కేరళలో మళ్లీ వామపక్ష కూటమే అధికారంలోకి వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆ రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత దృష్టా ప్రమాణ స్వీకారాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టు సమాచారం. అసోం ముఖ్యమంత్రిగా హిమంత విశ్వాస్ శర్మ ప్రమాణ స్వీకారానికి ముందు చాలా రాజకీయ మథనం, తర్జనభర్జన జరిగాయి. నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సర్వానంద్ సోనోవాల్‌కు తిరిగి అధికార దండం అప్పగించబోవడం పట్ల శర్మ అభ్యంతరం లేవదీశారు. దాదాపు పేచీ వంటి వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారిద్దరినీ ఢిల్లీకి పిలిచి నచ్చజెప్పి కిరీటాన్ని శర్మకే తగిలించడానికి నిర్ణయించారు. సోనోవాల్‌కు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించడం ఖాయమంటున్నారు.

ఆయన 2014 నుంచి 2016 వరకు ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. 2016 అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలుపొందిన తర్వాత సోనోవాల్‌ను ముఖ్యమంత్రిని చేశారు. అయితే 2015లో కాంగ్రెస్‌ను విడిచి బిజెపిలో చేరిన హిమంత్ విశ్వాస్ శర్మ ఆ పార్టీని అసోంలోనే గాక మొత్తం ఈశాన్యం ప్రాంతంలో పైకి తీసుకురావడంలో విశేషంగా ఉపయోగపడ్డారు. కాంగ్రెస్‌ను తుడిచిపెట్టి ఈశాన్య రాష్ట్రాల్లో కమలం పార్టీ వికసించడానికి దన్నుగా నిలిచారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపిలో తలెత్తిన అసమ్మతిని రూపుమాపడంలో బాగా పని చేశారు. ఎన్నికైన కొత్త ఎంఎల్‌ఎలలో శర్మ వర్గమే ఆధిక్యంలో ఉన్నట్టు స్పష్టపడుతున్నది. హిమంత్ విశ్వాస్ శర్మ మొదట అసోం గణపరిషత్ లో ఉండి ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి బిజెపిలోకి వచ్చారు. ఆయనను అపర చాణక్యుడుగా పరిగణిస్తారు. ఎటువంటి క్లిష్టమైన రాజకీయ వ్యవహారాన్నైనా చాకచక్యంగా పరిష్కరిస్తారని పేరు గడించుకున్నారు.

మొన్నటి ఎన్నికల్లో ఒక సిట్టింగ్ ఎంఎల్‌ఎకి బిజెపి టికెట్ లభించకపోవడంతో అతడు అధికార అభ్యర్థి మీద ఇండిపెండెంటుగా పోటీ చేస్తానని తీర్మానించుకున్నాడు. అప్పుడు హిమంత శర్మ రంగప్రవేశం చేసి అతనిని బుజ్జగించి ఆ సంకల్పం నుంచి విరమింప చేయించారు. అలాగే అసోం జాతీయ పరిషత్ (ఎజెపి), రాజ్‌జోర్ దళ్ (ఆర్‌డి) అనే రెండు ప్రాంతీయ పార్టీల ఫ్రంట్‌ను ప్రోత్సహించడం ద్వారా కాంగ్రెస్ ఓట్లు చీలిపోయేటట్టు చేసి దానిని ఓడించడంలో పావులు బలంగా ప్రయోగించా రని ప్రచారంలో ఉంది. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు తరుణ్ గొగోయ్‌ని తొలగించి తనను ముఖ్యమంత్రిని చేయాలని శర్మ పట్టుపట్టగా రాహుల్ గాంధీ అందుకు నిరాకరించడంతో బిజెపిలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి సోనోవాల్‌కు ప్రధాని మోడీ మద్దతు దండిగా ఉందని, శర్మకు అమిత్ షా ఆశీసులున్నాయని భావిస్తారు. అమిత్ షా ప్రధానిని ఒప్పించి శర్మకు దారిని సుగమం చేశారు. అయితే బిజెపి కేంద్ర నాయకత్వం అభీష్టానికి విరుద్ధంగా శర్మను ముఖ్యమంత్రి పదవిలో కూచోబెట్టడానికి, ఈ ప్రమాణ స్వీకారం ఇంత ఆలస్యం కావడానికి బెంగాల్‌లో అది పొందిన ఘోర పరాజయం కూడా ఒక కారణమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

బెంగాల్‌లో గనుక కమలం వికసించి ఉంటే సోనోవాల్‌నే అసోంలో మళ్లీ ముఖ్యమంత్రిని చేసి ఉండేవారని, అసలే పార్టీ పరిస్థితి బాగులేనప్పుడు శర్మను పక్కన పెట్టడం శ్రేయస్కరం కాదని భావించి కేంద్ర నాయకత్వం ఆయనకు దారి కల్పించిందని అనుకుంటున్నారు. ఎంతటి బలమైన శక్తి అయినా కెరటం ఉవ్వెత్తున దూసుకు వచ్చినప్పుడు తలవంచక తప్పదు. పట్టువిడుపుల రాజకీయాల్లో తలపండిన వారే పడి లేవగలరు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News