Friday, April 26, 2024

జోరుగా టెస్టులు..

- Advertisement -
- Advertisement -

ఐసిఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారమే వెళ్తున్నాం

రాబోయే రోజుల్లో రెండింతల కొవిడ్ పరీక్షలు

వైరస్ వ్యాప్తి తక్కువున్నందునే రాష్ట్రంలో టెస్టుల సంఖ్య తక్కువగా కనిపిస్తోంది
సెప్టెంబర్ వరకు కేసులు తగ్గుముఖం
పట్టే అవకాశం వైద్యనిపుణులు, అధికారుల భావన

Corona tests increased in Telangana

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టులు వేగంగా పెరుగుతున్నాయి. మార్చి 1వ తేది నుంచి ఆగస్టు 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,43,489 టెస్టులు చేసినట్లు హెల్త్ బులెటెన్‌లో పేర్కొన్నారు. దీంతో సుమారు 4 కోట్లు జనాభా ఉన్న తెలంగాణలో ఇప్పటి వరకు ప్రతి పది లక్షల్లో 13,872 మందికి పరీక్షలు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అతి త్వరలోనే ప్రతి పది లక్షల్లో 25వేల మందికి టెస్టులు చేసేలా వైద్యశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఒక రోజులో ప్రతి 10 లక్షల్లో కనీసం 140 మందికి పరీక్షలు చేయాలని నిబంధన ఉంది. అంటే సగటున ప్రతి రోజు 5600 శాంపిల్స్ నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. కానీ వైరస్ లక్షణాలు ఉన్న వారికి మాత్రమే టెస్టులు చేయాలని ఐసిఎంఆర్ మార్గదర్శకాలు ఉన్న నేపథ్యంలో తాము అదే విధానాన్ని పాటిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ పేర్కొంటున్నారు. దీంతో పాటు కంటైన్‌మెంట్ జోన్లలో ఉన్న గర్బిణీ స్త్రీలు, చిన్నారులు, వృద్ధులకు లక్షణాలు లేకపోయినా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
వైరస్ వ్యాప్తి లేనందు వలనే ఇతర రాష్ట్రాల కంటే తక్కువ టెస్టులు..
ఇతర రాష్ట్రాలతో పోల్చీతే మన దగ్గర వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉందని హెల్త్ డైరెక్టర్ మరోసారి తెలిపారు. ఈక్రమంలోనే ఇతర రాష్ట్రాలతో పోల్చీతే టెస్టుల సంఖ్య కాస్త తక్కువగా కనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తెలంగాణలో టెస్టులు ప్రక్రియ ఐసిఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారమే వెళ్తుందని ఆయన చెప్పుకొచ్చారు. కేవలం లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. అన్‌లాక్ పీరియడ్‌లో వైరస్ వ్యాప్తి కాస్త పెరగడం వలన ప్రస్తుతం టెస్టుల సంఖ్యను కూడా పెంచామని ఆయన అన్నారు. మొదట్లో కేవలం ఆర్‌టిపిసిఆర్‌ను మాత్రమే చేసేవాళ్లమని, కానీ ప్రస్తుతం వాటికి తోడు యాంటీజెన్ కిట్లతో కరోనా టెస్టులను వేగంగా చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వ పరంగా 16, ప్రైవేట్‌లో 23 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ నిర్వహిస్తుండగా, 350 సెంటర్లలో యాంటీజెన్ పరీక్షలు చేస్తున్నామని అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి రోజు నిర్వహించే కరోనా టెస్టుల్లో 4వేలు ఆర్‌టిపిసిఆర్ టెస్టులు చేస్తుండగా, మిగతావి యాంటీజెన్ కిట్లతో చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి రోజు ఏకంగా 40వేల పరీక్షలు చేసేందుకు వైద్యశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుందని ఆయన వెల్లడించారు.
సెప్టెంబర్ వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది..
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి సెప్టెంబర్ వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వైద్యశాఖ భావిస్తుంది. జూన్ నెలలో గ్రేటర్ హైదరాబాద్‌లో పతాక స్థాయిలోకి వెళ్లిన కేసులు ప్రస్తుతం సగానికి పడిపోయాయి. కానీ జిల్లాల్లో మాత్రం వ్యాప్తిస్తున్నట్లు అధికారులు లెక్కలు ప్రకటిస్తున్నారు. అయితే దీంతో ఎలాంటి గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేదని, సెప్టెంబర్ నెల వరకు జిల్లాల్లో కూడా కేసులు తగ్గుముఖం పడతాయని వైద్యశాఖ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కరోనా వ్యాప్తి ఒక్కసారిగా పెరిగి, మళ్లీ తగ్గిపోతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అనేక దేశాల్లో కూడా ఇతే జరిగిందని వైద్యశాఖ చెబుతుంది. అయితే ఎన్ని కేసులు వచ్చినా ఎదుర్కోనేందుకు తాము అన్ని ఏర్పాట్లు చేశామని డిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.
గత వారం రోజులుగా రాష్ట్రంలో చేసిన టెస్టుల సంఖ్య
తేది       టెస్టుల సంఖ్య
1/8      19,202
2/8      9443
3/8      13,787
4/8      21,118
5/8      21,346

Corona tests increased in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News