Saturday, May 4, 2024

ఏకంగా బ్రెయిన్‌పైనే ఎటాక్

- Advertisement -
- Advertisement -

Coronavirus may infect respiratory centre of brain

శ్వాస కేంద్రంపై ప్రభావం చూపి మరణాలకు దారి తీస్తుంది
బ్రెయిన్‌కు చేరడం వలన వాసన, రుచి తెలియడం లేదు
సిఎస్‌ఐఆర్, ఐఐసిబి శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి
కెనడియన్ జర్నల్ ఆఫ్ ఆఫ్తాల్మాలజీలో ప్రచురణ
రాష్ట్రంలో35 మరణాలు ఇదే తీరులో సంభవించి ఉండొచ్చని నిపుణుల అభిప్రాయం

హైదరాబాద్: కరోనా వైరస్ ప్రభావంపై విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఉన్న వైరస్ కేవలం శ్వాసవ్యవస్థపై మాత్రమే దాడి చేస్తుందని నిపుణులు, వైద్యులు సూచించారు. కానీ కోవిడ్ 19 వైరస్ మెదడులోకి కూడా ప్రవేశిస్తుందని సిఎస్‌ఐఆర్, ఐఐసిబి శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. వైరస్ మానవ మెదడులోకి ప్రవేశించి శ్వాసకేంద్రానికి సోకుతుందని తెలియడంతో ప్రజల్లో కలవరం ప్రారంభమైంది. ఈ పరిశోధన వివరాలను సిఎస్‌ఐఆర్, ఐఐసిబి శాస్త్రవేత్తల బృందం ఎసిఎస్ కెమికల్ న్యూరో సైన్స్‌లో ప్రచురించారు. ఈ మహమ్మారి ముక్కు ద్వారనే మస్తిష్కంలోని ఓల్ ఫ్యాక్టరీ బల్బ్‌కు చేరుతోందని వారు గుర్తించారు. ఓల్ ఫ్యాక్టరీ బల్బ్ నుంచి ప్రిబాట్‌జింగర్ కాంప్లెక్స్(పిబిసి)కు వైరస్ చేరుతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వాస్తవంగా ఈ పిబిసి వ్యవస్థే శ్వాసలయను నియంత్రించడం గమనార్హం.

దీంతో మెదడులోని శ్వాస కేంద్రం పనితీరు మందగించి కోవిడ్ 19 రోగుల మరణిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు మానవ దేహంలో ఇతర అంగాలతో పాటు ఊపిరితిత్తులకు వైరస్ ఎక్కువ సోకుతుందన్న సంగతి తెలిసిందే. అయితే మస్తిష్కంలోని మూల కణాలకూ వైరస్ సోకుతుందని వైద్యులు ప్రేమ్ త్రిపాఠి, ఉపాసనారే, అమిత్ శ్రీ వాస్తవ, సోను గాంధీతో కూడిన పరిశోధనా బృందం పేర్కొంది. కోవిడ్ 19 రోగుల సెరిబ్రోస్పైనల్ ద్రవంను, (మెదడులో ఉంటుంది), వ్యాధితో మృతి చెందిన వారి మెదడును పోస్ట్‌మార్టం చేస్తే అక్కడికి వైరస్ ఎలా ప్రవేశిస్తుందో?, శ్వాస కేంద్రానికి ఎలా వ్యాపిస్తుందో, మరిన్ని వివరాలు తెలుస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సార్స్ కోవ్ 2 జాతి వైరస్‌లు మెదడులోని శ్వాసకేంద్రాన్ని విఫలం చేసి శ్వాస అడకపోవడం, మెదడులోని పిబిసి మూల కణాలు నాశనం చేస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

అయితే దీనిపి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని వారు తెలిపారు. ఇదిలా ఉండగా, కరోనా సోకిన వారు వాసన చూసే గుణం కోల్పోయే సంగతి తెలిసిందే. ముక్కులోంచి మెదడుకు వైరస్ చేరుకోవడంతోనే ఇలా జరుగుతుందని కింగ్స్ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు సైతం భావిస్తున్నారు. కోవిడ్ 19 రోగుల మరణాలకు ప్రాథమిక లేదా ద్వితీయ కారణం మెదడు కాకపోయినప్పటికీ పోస్ట్‌మార్టం చేస్తే వైరస్ ఎలా ప్రవేశిస్తుందో తెలుస్తుందని పేర్కొన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో సంభవించిన 35 మందికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకున్నా చనిపోయారని వైద్యారోగ్యశాఖ ఈనెల 17వ తేదిన ప్రకటించింది. అయితే వీరికి మెదడులోకి వైరస్ ప్రవేశించి మరణాలకు దారీ తీసి ఉంటుందని నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కండ్ల కలక కూడా కరోనా కావచ్చు!

ఇప్పటి వరకు దగ్గు, జ్వరం, శాసతీసుకోవడంలో ఇబ్బందులు ఇలాంటి లక్షణాలే కరోనా సోకిన వారిలో గుర్తిస్తున్నాం. కానీ కండ్లకలయికతో కూడా కరోనా వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కెనడియన్ జర్నల్ ఆఫ్ ఆప్తాల్మాలజీలో ప్రచురించిన ఓ అధ్యయనంలో ఈ మేరకు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.మార్చిలో 29 ఏళ్ల ఓ మహిళ తీవ్రమైన కండ్లకలయిక సమస్యతో రాయల్ అలెక్సాండ్రా ఆస్పత్రికి చెందిన ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అల్బెర్టాకి వచ్చింది. కండ్లకలయికతో పాటు ఆమెకు కొద్దిమేర ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉంది. వైద్యులు కొద్ది రోజుల పాటు చికిత్స అందించిన తర్వాత కూడా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. అయితే ఆమె ఇటీవల ఆసియా నుంచి తిరిగి వచ్చినట్టు చెప్పడంతో ఓ వైద్యుడు అనుమానం వచ్చి కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించగా, కరోనా వైరస్ పాజిటివ్ అని తెలింది.

ఈ కేసులో మరో ఆసక్తికర విషయం ఏమిటి అంటే, ఆమె అస్వస్థతకు గత ప్రధాన లక్షణాల్లో శ్వాసకోశ సమస్య అంతగా కనిపించలేదు. కళ్లకలయిక ప్రధాన లక్షణంగా ఉన్నట్టు గుర్తించినట్లు ఆ జర్నల్‌లో ప్రచురించారు. కనీసం జ్వరం, దగ్గులాంటి లక్షణాలు ఏవీ లేకపోవడంతో కోవిడ్ అన్న సందేహం మాకు రాలేదని వారి కుటుంబ సభ్యులు తెలిపినట్లు రాశారు. ఊపిరితిత్తుల్లోని ప్రాధమిక సమస్య లేకుండా కళ్ల సమస్య ద్వారా దీన్ని ఎలా గుర్తించాలో తమకు అర్థం కాలేదని కెనడా అల్బెర్టా యూనివర్సిటీ ప్రోఫెసర్ కార్లోస్ సోలార్టే పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై ఇటీవల వెలువడిన పలు అధ్యయనాల్లో దాదాపు 10 నుంచి 15% మంది కోవిడ్ రోగుల్లో కండ్లకలయిక ద్వితీయ ప్రాథమిక లక్షణంగా ఉన్నట్లు తేలిందని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News