Monday, April 29, 2024

‘మేకిన్ ఇండియా’యే శరణ్యం

- Advertisement -
- Advertisement -

Chinese products should be expelled from India

 

తూర్పు లడఖ్ గాల్వాన్ లోయలో చైనా దురాక్రమణ దాడి, దాని వల్ల 20 మంది భారత సైనికులు చిత్రవధకు గురై అమరులు కావడం భారతీయులందరినీ కలచివేసింది. ఒకవైపు శాంతి సంభాషణలు జరుపుతూనే మరో వైపు దొంగ దెబ్బ తీసిన పొరుగు దేశం విద్రోహానికి ప్రతి ఒక్కరి గుండె భగభగ మండుతున్నది. చైనా ఉత్పత్తులను, దేశంలోని చైనీస్ హోటళ్లను బహిష్కరించాలని కేంద్ర మంత్రులు రామ్ విలాశ్ పాశ్వాన్, రామదాస్ అథవాలే పిలుపు ఇచ్చారు. చైనా వస్తువులకు వ్యతిరేకంగా దేశంలోని వ్యాపారులందరినీ సమీకరిస్తామని, వాటికి బదులుగా దేశీయోత్పత్తులను ప్రోత్సహించడానికి వ్యాపార వాణిజ్య వర్గాల మద్దతును కూడగడతామని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య ప్రకటించింది. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న 500 రకాల ఉత్పత్తులను దేశంలోనే తయారు చేసుకోవచ్చని ఈ సమాఖ్య ఒక జాబితా విడుదల చేసింది. ఇదంతా ప్రధాని నరేంద్ర మోడీ తరచుగా ఇస్తున్న స్వదేశీ వస్తువులను ప్రేమించండి, దేశీయోత్పత్తుల వినియోగ అవసరాన్ని ప్రచారం చేయండి, ఆత్మనిర్భర్ వంటి నినాదాలకు అనుగుణంగా ఉంది.

ఆయనకు ప్రీతిపాత్రమైన మేకిన్ ఇండియా వ్యూహానికి తోడ్పడేదిగా ఉంది. చైనా నుంచి ఎదురైన దారుణమైన నమ్మక ద్రోహానికి మన సువిశాల మార్కెట్‌కు దూరం చేయడం ద్వారా దానికి బుద్ధి చెప్పడం ముమ్మాటికీ తగిన చర్య. దాని పట్ల జాతిలో గూడుకట్టుకున్న పగను సంతృప్తి పరిచే మార్గమదే. అయితే తక్షణ ఆవేశంలో బలంగా వినిపిస్తున్న చైనా వస్తు బహిష్కరణ పిలుపు ఆచరణలో ఎంత వరకు సాధ్యమనే విషయాన్ని కూడా ఇక్కడ ఆలోచించాలి. భారత, చైనాల మధ్య జరుగుతున్న వ్యాపారం కిమ్మత్తు 88 బిలియన్ డాలర్లు. ఇందులో 53.5 బిలియన్ల డాలర్ల మేరకు మనకంటే చైనాదే పైచేయిగా ఉంది. మనం చైనాకు ఎగుమతి చేస్తున్న సరకుల కంటే అంత కిమ్మత్తు అధికంగా దాని నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఇందులో భారీ యంత్ర పరికరాలు, సెల్‌ఫోన్లు, ఇతర ఎలెక్ట్రానిక్ సామాగ్రి, మందుల తయారీలో అనివార్యమైన ముడిసరకులు వంటివి అధికంగా ఉన్నాయి.

2017లో మనం దిగుమతి చేసుకున్న ఎలెక్ట్రిక్, ఎలెక్ట్రానిక్ సామాగ్రిలో 60 శాతం చైనా నుంచి తెచ్చుకున్నవే. 50 శాతం సైకిళ్లు, 30 శాతం ఆటోమొబైల్స్ అక్కడి నుంచి వచ్చినవే. వీటిని స్థానికంగా ఉత్పత్తి చేసుకోడం తక్షణమే సాధ్యం కాదు. దశాబ్దాల నిర్విరామ కృషితో చైనా నేడు ప్రపంచానికే ప్రధానమైన వస్తూత్పత్తి కర్మాగారంగా తయారయింది. అనేక దేశాలు చైనా వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అమెరికా అత్యధికంగా దాని పైనే ఆధారపడి ఉంది. జర్మనీ మాత్రం తన కార్లు, విశిష్టమైన సాంకేతిక నైపుణ్యంతో చైనా వినియోగదార్లను విశేషంగా ఆకట్టుకోగలుగుతున్నది. అదే సమయంలో చైనా వస్తువులకు బదులు తూర్పు యూరప్ దేశాల తయారీలను దిగుమతి చేసుకుంటున్నది. ఆ విధంగా జర్మనీ, చైనా ఆకర్షణకు వీలైనంత దూరంగా ఉండగలిగింది. జర్మనీ పరిశ్రమల్లో ఉన్న వికేంద్రీకృత నిర్ణయ విధానం నాణ్యమైన వస్తువుల ఉత్పత్తికి తోడ్పడుతున్నది. కింది స్థాయి కార్మికులకు విశేషంగా ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా అది అందులో విజయవంతమైంది.

సకల వస్తూత్పత్తిలో స్వావలంబన సాధించడం ఏ దేశ ప్రగతికైనా ఎంతో ఉపయోగపడే అంశం. కేవలం దేశభక్తి పూనకంతో దేశీయోత్పత్తులను విరివిగా కొనిపించడం ఎల్ల కాలం సాధ్యం కాదు. మన వస్తువుల నాణ్యతను బాగా మెరుగుపర్చి అంతర్జాతీయ పోటీలో తట్టుకునేలా చేయగలిగినప్పుడే దేశంలోనూ వాటికి విశేషమైన గిరాకీ ఏర్పడుతుంది. ఇందులో, తక్కువ వ్యయంతో నాణ్యమైన ఉత్పత్తులను చేయగలగడం ప్రధానం. ఇది విజ్ఞతతో కూడిన సమగ్ర వ్యూహ రచన, అమలులో చిత్తశుద్ధి ద్వారానే సుసాధ్యమవుతుంది. ఈ స్థితిని ఒక్క రోజులోనో, ఒక్క సంవత్సరంలోనో సాధించుకోలేము. పిల్లల బొమ్మల నుంచి భారీ యంత్ర పరికరాల వరకు చైనా ఉత్పత్తులపై ఆధారపడడానికి పూర్తిగా తెర దించాలన్న ప్రస్తుత దృఢ సంకల్పాన్ని ఆచరణలో రుజువు చేయగలగడానికి ఒక ముందడుగు గట్టిగా పడవలసిందే. అయితే అందుకు కేవలం ఆవేశం ఒక్కటే పనికి రాదు. వాణిజ్యపరంగా భారత్, చైనా బాగా పెనవేసుకొని ఉన్నాయి.

ఎగుమతులు, దిగుమతుల విషయంలోనే కాదు అక్కడి వారిక్కడా, ఇక్కడి వారక్కడా భారీగా పెట్టుబడులు కూడా పెట్టి ఉన్నారు. మన రెడ్డి ల్యాబ్స్ వంటివి అక్కడ స్థిరపడ్డాయి. ఎలెక్ట్రానిక్స్, ఇంటర్‌నెట్ తదితర రంగాలకు చెందిన చైనీస్ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి. ఇటీవలే పుణెలో భారీ ఆటోమొబైల్ పరిశ్రమ నెలకొల్పడానికి చైనా కంపెనీ ఒకటి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. మొత్తం 4 చైనా కంపెనీలు ఆ రాష్ట్రంతో ఎంఒయులపై సంతకాలు చేశాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆలోచించి నిర్ణయాలు సావధానంగా తీసుకోవాలి. ఆవేశంతో పొదుగు కోసుకోడం మంచిది కాదు. చైనాకు తగిన గుణపాఠం చెప్పాలి. అది మన ప్రయోజనాలను దెబ్బ తీసుకోడం ద్వారా కాకూడదు. మేకిన్ ఇండియాను పటిష్ఠంగా తీర్చిదిద్దుకోవాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News