Monday, April 29, 2024

వైద్యులే ప్రాణ రక్షకులు

- Advertisement -
- Advertisement -

Doctors are lifeguards

 

లాక్‌డౌన్‌తో దేశంలో వేల మంది నిరుద్యోగులయ్యారు. లక్షల కార్మికులకు, శ్రమ జీవులకు ఉపాధి లేకుండాపోయింది. ఉద్యోగులకు జీతం సగం కోత పడింది. సీనియర్ సిటిజన్లయిన పెన్షనర్లకు కూడా సగం పెన్షన్ కోత పడింది. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు, సేవింగ్ అకౌంట్ వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గిపోయా యి. ధరలు అదుపులో లేవు. రైతు దగ్గర 1015 రూపాయలకు కొన్న సరుకు మార్కెట్‌లో మధ్యవర్తులు 7080 రూపాయలకు అమ్ముతారు. ప్రభుత్వం చర్యలు తీసుకోదు. ఇక ఉద్యోగుల విషయానికొస్తే, ‘9 రోజుల లాక్‌డౌన్‌కు సగం జీతం హుళక్కి’ అనే విమర్శలు వచ్చాయి. స్వచ్ఛందంగా ఇమ్మని అడిగితే ఇంకా ఎక్కువే ఇచ్చేవారేమో! ఇక ఫోన్ నెంబరో, ఇ మెయిల్ ఐడినో ఇచ్చి ఇవ్వదలుచుకున్న వారు స్పందించండి అని అడగాల్సింది. అప్పుడు ఆరు నెలల జీతమో/ సంవత్సరపు పెన్షనో ఇచ్చేవారుంటే ముందు కొచ్చేవారు.

ఏమో మానవతా వాదులైన ధనికులు ఉద్యోగుల్లో, పెన్షనర్లోలో ఉండకూడదా? ఇవ్వదల్చుకున్న వారు ఇవ్వకూడదా? అయినా బడుగు జీవుల మీద పడకపోతే దేశాన్ని నిలువునా దోచుకుంటున్న అంబానీ, ఆదానీ లేమయ్యారూ? బ్యాంకులు ఖాళీ చేసిపోయిన విజయ్ మాల్యా బాపతుగాళ్లంతా ఏమయ్యారు? బ్లాక్‌మనీ వెనక్కి తెస్తానన్న కేంద్ర ప్రభుత్వం, ప్రతి పౌరుడి ఎకౌంట్‌లో పది హేను లక్షలు వేస్తామన్న ప్రభుత్వం సిగ్గుగా సగటు జీవుల బతుకులతో ఆడుకుంటుందా? అయినా ప్రతి ఎకౌంట్‌లో వేస్తామన్న ఆ డబ్బు ఇప్పుడు ప్రజలు అడగడం లేదు కాబట్టి, మొత్తానికి మొత్తంగా దాన్ని ప్రజలు ప్రభుత్వ ఖజానాకు ఇస్తున్నట్లుగా భావించాలి. ఆ నిధుల్ని ఉపయోగించి కోవిడ్ 19ని కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోవాలి. అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆ నిధుల్లోంచి తమ రాష్ట్రాల వాటా తెచ్చుకోవాలి. ఇకపోతే, దేశంలో ఎన్ని ఆలయాలున్నాయి. వాటిలో ఎన్నింటికి నేల మాళిగలున్నాయి.

అందులో ఎంత సంపద ఉంది? ఎన్ని గుప్త నిధులున్నాయి? ఇప్పుడైనా లెక్కలు తీయాలి. ఇలాంటి సంక్షోభ సమయంలో వాటిని వెలికి తీసి ప్రజల ప్రాణాలు నిలపడానికి, అన్నార్తుల ఆకలి తీర్చడానికి ఉపయోగించాలి. ఆలయాలనే కాదు, ఇతర అన్ని మత సంస్థలకు, ప్రార్థనా స్థలాలకూ ఉన్న ఆస్తులు నిలువలు ప్రజల ఉపయోగానికి తేవాలి. ఆ సంపద అంతా ఏ మతానికి సంబంధించిన ఏ దేవుడూ సంపాదించలేదు. అదంతా ప్రజలిచ్చిందే. అంటే ప్రజల సొమ్మే. పూర్వీకులు కూడ బెట్టిందే. వారసులుగా ఇప్పటి ప్రజలు వాడుకుంటారు? అప్పుడైనా ఇప్పుడైనా అది ప్రజల ఆస్తే! ఇప్పటి ప్రభుత్వ ట్రెజరీల్లాగానే ఒకప్పటి ప్రార్థనా మందిరాలన్న మాట! ఇక రాబోయే కాలంలో అన్ని మతాల ప్రార్థనా కేంద్రాలు వాటి ప్రాబల్యం కోల్పోనున్నాయి. వాటి నిధుల్ని మళ్లించి, వైజ్ఞానిక పరిశోధనా శాలలకు ఉపయోగించాలి.

అలాగే దేశంలో వైరస్ కన్నా వేగంగా ప్రబలుతున్న మూర్ఖత్వాన్ని కట్టడి చేయడానికి, వైజ్ఞానిక స్పృహను పెంచడానికి రాజ్యాంగంలో పొందుపరుచుకున్న ఈ అంశానికి ప్రాధాన్యతనిచ్చి అలాంటి నిధుల ఖర్చు చేయడం మంచిది. అప్పుడు మనం ఈ విషయంలో ప్రపంచ దేశాల క్కూడా ఆదర్శంగా నిలువగలం. అప్పనంగా భారత రత్న బిరుదు తీసుకుపోయిన క్రికెటర్ ఏమయ్యాడో మరి? ఈజీ మనీతో మిలియనీర్లయిన సినీ స్టార్లకు తాము ఈ దేశానికి, ఉపయోగడపే సమయం వచ్చిందని అనిపించడం లేదా? ఉల్లిగడ్డలు, బంగాళా దుంపలు అని అరిచి అరిచి రోడ్ల మీద బండ్లు తోసుకుంటూ అమ్ముకునే వారి కన్నా అధ్వాన్నంగా నిమిషానికోసారి టివి వ్యాపార ప్రకటనల్లో కనిపించే సినీ బిగ్ బీలు అంతా ఏమయ్యారూ? ఇంట్లో అందరికందరూ కోట్లలో పారితోషికం తీసుకునే సినీ కుటుంబాలున్నాయి కదా అవి ఏం చేస్తున్నాయి? స్పందించి, కోవిడ్ 19 నివారణకు ఉదారంగా విరాళాలు అందించిన కొద్ది మంది సినీ ప్రముఖులను అభినందించాల్సిందే!

కానీ, మిగతా సూపర్ స్టార్లూ, స్టైలిష్ స్టార్లూ తమకు తామే బిరుదులు ప్రకటించుకున్న వారంతా ఏం చేస్తున్నారూ? చెక్‌బుక్‌లు ఎక్కడ పెట్టారో మరిచిపోయారా?అందుకే ఇంట్లో భార్యలకు బ్రేక్ ఫాస్ట్ చేసిపెట్టి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంలో తీరిక లేకుండా ఉన్నారా? ఉద్యోగుల, పెన్షనర్ల జీతాల్లో కోత విధించినట్టు బడా పారిశ్రామిక వేత్తల ఆదాయం నుండి ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోని వారి ఆదాయం నుండి ప్రభుత్వం ఎందుకు బలవంతంగా పర్సెంటేజ్ వసూలు చేయలేదూ? కనీసం ఎలక్ట్రిసిటీ బిల్లులు సరిగా కట్టని ఫ్యాక్టరీలు ఎన్నో ఉన్నాయి. ఆదాయపు పన్ను ఎగవేతదార్లున్నారు. వీళ్లంతా ప్రభుత్వం దృష్టికి రారు.

ఠంచనుగా అన్ని టాక్సులు కడుతూ ఉండే ఉద్యోగులు మాత్రం ఎదురుగా కనబడతారు. సామాన్య పౌరులకు ఉన్నట్లే ప్రభుత్వాలక్కూడా హక్కులు, విధులు ఉంటాయి. అధికారం ఉంది కదా అని హక్కులు ఉపయోగించుకోవడం తప్పించి, ప్రభుత్వాలు తమ విధులు తాము సరిగా నిర్వర్తిస్తున్నాయా? సామాన్యుడు అన్ని బేరీజు వేసుకుంటూనే ఉన్నాడు. భారత దేశం పేద దేశం కాదు. ఇక్కడి సంపద అంతా కొంత మంది దగ్గర పేరుకుపోయి ఉండడం వల్ల, మిగతా జనమంతా పేదరికంలో మగ్గిపోతున్నారు. ఆ కొద్ది మందికే వత్తాసు పలికే ప్రభుత్వాధినేతలు ఉన్నంత కాలం మార్పు రావడం కష్టం. అయితే వారు ఎప్పుడూ మార్పు కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు.

ఇకపోతే కరోనా గురించి ప్రజల్లో చైతన్యం తీసుకు రావడానికి పోలీసులు యమ ధర్మరాజు, యమ కింకరుల వేషాలు వేసుకుని రోడ్ల మీద తిరగడమంటే జనంలో పాతుకుపోయి ఉన్న మూఢ నమ్మకాల్ని మరింతగా పెంచి పోషించడమే కదా? లాక్‌డౌన్ సమయంలో వివిధ మతాల మత పెద్దలు యాగాలు నమాజులు ప్రేయర్లు చేయడానికి ప్రయత్నించారు. అసలు విషయమేమంటే తమతమ మత సామ్రాజ్యాలు ఎక్కడ కూలిపోతాయోనని వారి భయం! లాక్‌డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు, భౌతిక దూరం పాటించనందుకు వారినందరినీ క్వారంటైన్‌లోకి పంపించాలి కదా? కోవిడ్ 19 టెస్టులు జరిపించాలి కదా? వైద్యంతో పాటు మానసిక చికిత్సను కూడా అందించాల్సింది కదా? మరి మన ప్రభుత్వాలు ఆ పని చేశాయా? మత బోధకులు ఏమైనా ఎమర్జన్సీ సర్వీసులో ఉన్నవారా? బైకులతో రోడ్ల మీద కనబడ్డ యువకులకు కఠిన శిక్షలు వేయడం సరైందే. కాని, ఇలాంటి వారిని వదిలేయడం సరైన పని కాదు.

“దేవుని దయ ఉంటే ఈ కరోనా నుండి బయట పడతామనడం, రామ బాణం, లక్ష్మణ రేఖ లాంటి మాటలు ఉపయోగించి జన్మాన్ని ఇంకా మూఢత్వంలోకి తీసుకుపోవడం ప్రజా నాయకులు మానుకోవాలి. ఏ దేవుడూ, ఏ రామ బాణమూ కరోనాను కట్టడి చేయలేదు అని రుజువు అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆ మాట లెందుకూ? ఆ మత పెద్దలూ, ఈ నాయకులూ అంతా కలిసి కరోనా వ్యాక్సిన్‌ను కనిపెడతారా? మానవాళిని ఈ విపత్తు నుంచి కాపాడతారా? ఆ పని చేయడం చేతకానప్పుడు వైజ్ఞానికులు, డాక్టర్లు, సాంకేతిక నిపుణులు, విజ్ఞులు చెప్పింది వింటూ కేవలం పరిపాలన మీద దృష్టి పెట్టాలి. మరో మార్గం లేదు. ఒక ఉద్యోగి తన ఉద్యోగ ధర్మం నిర్వర్తించినట్టె ఎన్నికైన నాయకులు కూడా తము అధికారంలో ఉన్న సమయంలో ఎదురయ్యే అన్ని సమస్యల్ని పరిష్కరిస్తూ వెళ్లాలి. తమ విధి నిర్వహణను దేశోద్ధరణగా తప్పుగా అర్థం చేసుకోనవసరం లేదు. ఏ ఒక్కడి తెలివితోనో జిల్లాగాని, రాష్ట్రం గాని, దేశంగాని నడవడం లేదు. ప్రకృతి తనను తాను సరిచేసుకుంటుంది. అలాగే సమాజం కూడా తనను తాను పునరుద్ధరించుకుంటుంది.

అమెరికా అధ్యక్షుడయినా, అంగోలా అధ్యక్షుడయినా ప్రజాభీష్టం ముందు తలవంచుకుని నిలబడాల్సిందే! అందుబాటులో ఉన్న అన్ని వసతుల్ని, శక్తుల్ని ఆలోచనల్ని తీసుకుని వాటన్నిటి సమన్వయంతో మేలైన నిర్ణయాలు తీసుకునేవాడే ప్రజా నాయకుడవుతాడు. లేనివాడు చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు. కరోనా ప్రచారానికి దేశ వ్యాప్తంగా పోలీసు వ్యవస్థ గణనీయమైన కృషి చేసింది. ముఖ్యంగా కేరళ పోలీసుల చొరవ చెప్పుకోదగ్గది. కరోనా వైరస్ ఆకారాన్ని పోలిన హెల్మెట్ తయారు చేసుకుని పెట్టుకున్నారు. చేతులు ఎలా కడుక్కోవాలో డాన్సు స్టెప్పులేసి ప్రకటించారు. గుర్రం మీద కరోనా బొమ్మలేసి, ఆ గుర్రమెక్కి ప్రచారం చేశారు. నిబంధనల్ని ఉల్లంఘించిన యువకుల్ని కప్పల్లా గెంతించారు. పొర్లు దండాలు పెట్టించారు. ట్రాఫిక్ నియంత్రణకు రాత్రింబవళ్లు కృషి చేశారు. పారిశుద్ధ కార్మికుల సేవలు ఇంకా ఎక్కువగా గుర్తించాల్సి ఉంది. ఎప్పటి కప్పుడు వీధుల్ని శుభ్రం చేయడమే కాకుండా, అవసరమైన ప్రాంతాల్లో రసాయనాలు చల్లారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు వీరికి కావల్సిన మాస్క్‌లు, చేతొడుగులు అందించాయి.

ఉత్తరప్రదేశ్‌లో అత్యవసర వైద్య సర్వీసులో పని చేసే పారా మెడికల్ సిబ్బంది 102/104 బస్సు డ్రైవర్లు, సాంకేతిక నిపుణులకు ప్రభుత్వం కనీసం మాస్క్‌లు కూడా ఇవ్వలేదు. తమకు అందే జీతాలు అతి స్వల్పం గనుక, తాము స్వయంగా రక్షణ పరికరాలు కొనుక్కోలేమని వెంటనే ప్రభుత్వం వారు గాని, ఆ వ్యవస్థల్ని నిర్వహిస్తున్న కంపెనీలుగాని, తమకు వాటిని సమకూర్చాలని డిమాండు చేశారు. మందులా? మంత్రాలా? ఏది బెటర్? అని ఏ టెలివిజన్ ఛానలూ బిగ్ డిబేట్ పెట్టలేదు ఎందుకో మరి? ఒకవేళ పెట్టినా ఒక హేతువాదిని, ఓ సిద్ధాంతిని, ఓ పూజారిని, ఓ డాక్టర్నీ పిలిచి పోట్లాడుకోమంటారు. ఎవరినీ పూర్తిగా మాట్లాడనీయకుండా ఏంకర్ మహాశయుడు మధ్యమధ్యలో దూరుతూ, మహా గొప్ప చచ్చు ప్రశ్నల్ని జొప్పిస్తుంటాడు. దానితో తాము అన్ని రకాల వాదనలకు వేదిక కల్పించామని ఛానల్ వారు ప్రకటించుకున్నట్లవుతుంది. కాని సంధిగ్ధంలో ఉన్న జనాన్ని మరింత అయోమయంలో పడదోస్తున్నామని వారు గ్రహించరు.

తమ జీవితం ముగింపుకి వచ్చింది గనుక, తమకు వెంటిలేటర్లు అవసరం లేదని, ఇంకా ఎక్కువ కాలం బతక గలిగే యువతీ యువకులకు వాటిని ఉపయోగించాలని చాలా మంది వయో వృద్ధులు ప్రకటిస్తున్నారు. చరమాంకంలో ఉన్నవారు తమ ప్రాణాల్ని ఫణంగా పెట్టి తమ పెద్ద మనసును చాటుకుంటున్నారు. ఇక్కడ మనం రెండు ముఖ్యమైన సంఘటల్ని గమనించాలి.! 1. కరోనా కంటే దేవుడు గొప్ప అన్న పాస్టర్ కరోనాతోనే మరణించడం. 2. వైద్యులే ప్రాణ రక్షకులు అన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. అమెరికా వర్జీనియాలోని న్యూ డెలివరెన్స్ ఇవాంజలికల్ చర్చ్ వ్యవస్థాపక బిషప్ గెరాల్డ్ గ్లెన్, మార్చి 22న తన చర్చ్‌లో పెద్ద ఎత్తున ప్రార్థనలు నిర్వహించాడు.

ప్రపంచం ఎదుర్కొంటున్న విపత్తును పరిగణనలోకి తీసుకోకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా అలా చేయడం వల్ల ఆయనకు కరోనా సోకింది. మరి ఆయన దేవుడు ఆయనను రక్షించలేకపోయాడు. ఏప్రిల్ 16న ఆయన మరణించాడు. ఇకపోతే బ్రిటన్ ప్రధాని రోగులను పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లి, జాగ్రత్తలేవీ పాటించకుండా తిరిగి కరోనా బారినపడ్డారు. ట్రీట్‌మెంట్ తీసుకుని బతికి బయటపడ్డారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయి బయటికి రాగానే ఆయన అన్న మాటలు “వైద్యులే నా ప్రాణ రక్షకులు” అని ! ఈ రెండు సంఘటనల మీద పెద్దగా వ్యాఖ్యానం అక్కర లేదు. దేవుడి మీద నమ్మకం పని చేస్తుందా? లేక మనిషి కృషి పని చేస్తుందా? అనేది తెలిసిపోతూనే ఉంది కదా?

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News