Wednesday, May 1, 2024

రోడ్లు, పంటలు వరదపాలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేని వానలు
వరదతాకిడికి కోతకు గురైన రహదారులు, కొట్టుకపోయిన వంతెనలు, నీట మునిగిన పంటలు
లోతట్టు ప్రాంతాలు జలమయం, జనజీవనానికి ఆటంకం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వందల ఎకరాల్లో పంట నష్టం

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రమంతటా పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. రాకపోకలు స్తంభించాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతు న్నాయి. పంటలు దెబ్బతిన్నాయి. ఎడతెరపిలేని వర్షంతో నాగర్ కర్నూలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అచ్చంపేట మండలంలో బ్రిడ్జిపైకి వరదనీరు వచ్చింది. దీంతో బ్రిడ్జి కుంగిపోయింది. రోడ్డు కొట్టుకుపోయింది. రాకపోకలు కూడా నిలిచిపోయాయి. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కుంటలు,చెరువులు నిండి.. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయ. ఉడుముల వాగు, పెద్ద వాగు ప్రవాహానికి రోడ్డు కొట్టుకుపోయి.. ఇతర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు తాడు సాయంతో అవతలి ఒడ్డుకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగర్‌కర్నూలు జిల్లా కోడేరు మండలం పసుపుల వాగులో ట్రాక్టర్ మునిగిపోయింది. కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం, ఉడుముల వాగు, నార్లాపూర్ గ్రామ పరిధిలోని పెద్దవాగు వరద నీటి ప్రవాహంతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగు ప్రవాహ వేగానికి పలుచోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. పెంట్లవెల్లి మండలంలోని మాడవస్వామి నగర్ వెళ్లే దారిలో వాగు ప్రవాహానికి రాకపోకలు నిలిచిపోయాయి. వీపనగండ్ల మండల కేంద్రంలో చెరువు నిండి పొలాల్లోకి వరదనీరు చేరింది. మండలంలోని చౌట చెరువు పూర్తిగా నిండి రోడ్లపై పారుతోంది. నియోజకవర్గంలోని పలు రోడ్లు కోతకు గురయ్యాయి. కొల్లాపూర్‌లో చుక్కాయిపల్లి చెరువు నిండి అలుగు పారుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సూర్యాపేట జిల్లా, ఆత్మకూరు మండలం, నశింపేట వాగు దాటే క్రమంలో గొర్రెలు తరలించే బొలెరో వాహనం కొట్టుకుపోయింది. సంతకు వెళుతున్న మహబూబాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురిని స్థానికులు కాపాడారు. సూర్యాపేట జిల్లా, మోతే మండలం, మామిళ్లగూడెం నుంచి విభాళాపురం వెళ్లే మార్గంలో వాగులో ఓ కారు కొట్టుకుపోయింది.

వాగు ఉద్దృతంగా ప్రవహిస్తుండటంతో ఆ మార్గంలో వెళ్లేవారు.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని స్థానికులు సూచించారు. సూర్యాపేట శ్రీనివాస కాలనీ, వెంకటేశ్వర కాలనీ, ఇందిరమ్మ కాలనీ, నల్గొండలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. సోమవారం రాత్రి కురిసిన వర్షాలతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వందల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. వాగులు మత్తడి దుంకుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం, సూరారంలో ఇళ్లల్లోకి నీళ్లు వచ్చాయి. భారీ వర్షానికి కుంట కట్టతెగి రామన్నపేట నుంచి అమ్మనబోలుకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పంటలు నీటమునిగాయి. నిజామాబాద్ జిల్లా పిట్లం మండలంలో వాగులు పొంగిపోర్లుతున్నాయి. పంట పొలాలు నీట మునిగాయి. కామారెడ్డి జిల్లా బిచ్‌కుంద మండలంలో మంగళవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లు దెబ్బతిన్నాయి. భద్రాది కొత్తగూడెం జిల్లా దమ్ముగూడెం మండలంలో పాత నారాయణరావు పేటలో పశువులు మృతి చెందాయి. జగిత్యాల పట్టణంలో వరదనీరు ఇళ్లల్లోకి చేరింది. గోవిందుపల్లి కాలనీ జలమయమైంది. పెంబట్ల, కోనాపూర్ రోడ్డుపై వరదనీరు ప్రవహిస్తోంది. జగిత్యాల నుండి ఆదిలాబాద్ వెళ్లే ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండ లంలోని ఖాజీపూర్‌లో పిడుగుపాటుతో పది గొర్రెలు మృతి చెందాయి. మెదక్ జిల్లా చిన్న శంకరపేటలో చందాపూర్ మత్తడి పొంగి పొర్లుతోంది.
అలుగు దూకిన కొత్త చెరువు.. నీట మునిగిన రోడ్లు…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు నిండి అలుగు దూకి రోడ్లపైకి ప్రవహిస్తున్నాయి. సిరిసిల్ల పట్టణ శివారులోని కొత్త చెరువుకు భారీగా వరదనీరు చేరడం వల్ల పూర్తిగి నిండి రోడ్లపైకి ప్రవహిస్తోంది. వేములవాడ, సిరిసిల్ల ప్రధాన రహదారి మీదకు కొత్తచెరువు అలుగు దూకడం వల్ల వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారింది. భారీస్థాయిలో వరదనీరు రోడ్డుపైకి రావడం వల్ల శాంతినగర్‌లోని పలు ఇండ్లు జలమయమయ్యాయి. చాలా ఏళ్ల తర్వాత కొత్త చెరువు పూర్తిగా నిండి అలుగు దూకుతుండటం వల్ల ప్రజలు ఓ వైపు భయపడుతూనే.. చెరువు అందాలను తిలకిస్తున్నారు. రహదారిపైకి చేరిన వరదనీరు రోడ్డుకు ఆనుకుని ఉన్న పలు దుకాణాల్లో చేరగా వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. చెరువు, నాలాలు ఆక్రమించడం వల్లే వరద నీరు నివాస, వ్యాపారప్రాంతాల వైపు ప్రవహించిందని.. అధికారులు ఇప్పటికైనా స్పందించి నాలాలు మరమ్మత్తు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
కొట్టుకుపోయిన బ్రిడ్జి
వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని తాండూరుహైదరాబాద్ మార్గంలోని మన్సన్ పల్లీ గ్రామం దగ్గరలోని బ్రిడ్జి కొట్టుకుపోయింది. భారీగా కురుస్తున్న వర్షాలతో ఈ దుస్థితి నెలకొంది. అలాగే తాండూరు పట్టణ సమీపంలోని కాగ్న నదికి కూడా ముప్పు వాటిల్లుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Crops and Roads damaged due to heavy rain in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News