Saturday, May 4, 2024

ఉత్కంఠ పోరులో చెన్నై విజయం

- Advertisement -
- Advertisement -

చివరి బంతికి కోల్‌కతాపై ధోనీ సేన గెలుపు
మ్యాచ్‌ని మలుపు తిప్పిన జడేజా ఇన్నింగ్స్

అబూధాబి: చెన్నై సూపర్ కింగ్స్ వరస విజయాలతో దూసుకు వెళ్తోంది. ఐపిఎల్ సీజన్14 రెండో దశలో ఇప్పటికే రెండు విజయాలు నమోదు చేసి జోరు మీదున్న ఆ జట్టు ఆదివారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లోను విజయం సాధించి అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. దీంతో ఆ జట్టు దాదాపుగా నాకౌట్ దశకు చేరుకున్నట్లే. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40), డుప్లెసిస్ (30 బంతుల్లో 7 ఫోర్లతో43)తో రాణించడంతో కోల్‌కతా నిర్దేశించిన 172 పరుగుల లక్షాన్ని 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వీరితో పాటుగా మొయిన్ అలీ (28 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 35 పరుగులు) కూడా రాణించడంతో సిఎస్‌కె సునాయాసంగా విజయం సాధిస్తుందనిపించింది. అయితే వీరు అవుటయిన తర్వాత ధోనీ, రైనా, అంబటి రాయుడు వరసగా విఫలం కావడంతో ఆ జట్టు లక్ష ఛేదనలో తడబడింది. ఒక దశలో కోల్‌కతా విజయం సాధిస్తుందేమోననిపించింది కూడా. అయితే చివర్లో అజయ్ జడేజా మెరుపు ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ని చెన్నై వైపు మళ్లించాడు. చివరి రెండు ఓవర్లలో విజయానికి 26 పరుగులు అవసరమైన దశలో ప్రసిధ్ కృష్ణ వేసిన 19వ ఓవర్‌లో జడేజా రెండు సిక్స్‌లు, మరో రెండు ఫోర్లు బాది మ్యాచ్‌ని చెన్నై వైపు మళ్లించాడు. అయితే మ్యాచ్ అంతటితో ముగిసి పోలేదు. సునిల్ నరైన్ వేసిన చివరి ఓవర్ మ్యాచ్ ఉత్కంఠను నరాలు తెగే స్థాయికి తీసుకెళ్లింది. ఆ ఓవర్‌లో సామ్ కరణ్, జడేజాలు ఔటవడంతో చివరి బంతికి ఒక పరుగు చేయాల్సి వచ్చింది. ఆ దశలో మ్యాచ్ ఫలితం ఎటైనా మళ్లే అవకాశం కనిపించింది. అయితే చివరి బంతికి దీపక్ చాహర్ ఒక పరుగు సాధించడంతో విజయం సిఎస్‌కెను వరించింది.
ఓపెనర్ల శుభారంభం
సిఎస్‌కెకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. ప్రసిధ్ కృష్ణ వేసిన మూడో ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన డుప్లెసిస్ తర్వాత వరుణ్ చక్రవర్తి ఓవర్‌లోను అదే సీన్‌ను రిపీట్ చేశాడు. మరో వైపు సునిల్ నరైన్ వేసిన అయిదో ఓవర్‌లో గైక్వాడ్ ఓ ఫోర్, మరో సిక్స్ బాదాడు. అయితే దూకుడుగా ఆడుతున్న రుతురాజ్‌ను రసెల్ 9వ ఓవర్‌లో పెవిలియన్‌కు పంపాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన మొయిన్ అలీ కూడా తన వంతు పాత్ర పోషించాడు. ప్రసిధ్ కృష్ణ వేసిన 12వ ఓవర్‌లో డుప్లెసిస్ కూడా అవుటయ్యాడు. ఈ దశలో సిఎస్‌కె వరసగా వికెట్లు కోల్పోవడంతో ఉత్కంఠ నెలకొంది. అంబటి రాయుడు(10)సునిల్ నరైన్ పెలియన్‌కు పంపగా ఫెర్గూసన్ వేసిన 17వ ఓవర్‌లో మొయిన్ అలీ వెంకటేశ్ అయ్యర్ చేతికి చిక్కాడు. రైనా 11 పరుగులు చేసి ఔటవగా, ధోనీ ఒక పరుగుకే రనౌట్ అయ్యాడు. దీంతో చివరి రెండు ఓవర్లలో ఉత్కంఠ నెలకొంది. అయితే జడేజా మెరుపు ఇన్నింగ్స్ మ్యాచ్‌ని మలుపు తిప్పింది. జడేజా కేవలం 8 బంతుల్లో రెండు సిక్స్‌లు, మరో రెండు ఫోర్లతో 22 పరుగులు చేయడంతో చివరి ఓవర్లో విజయానికి నాలుగు పరుగులు కావలసి వచ్చింది. నిజానికి టి20 మ్యాచ్‌లో ఇది సాధించలేని దేమీ కాదు. అయితే సునిల్ నరైన్ మ్యాచ్‌ని చివరి బంతి దాకా తీసుకెళ్లాడు. అయిదు బంతుల్లో మూడు పరుగులు మాత్రమే ఇచ్చి సామ్ కరణ్, జడేజాలను అవుట్ చేయడంతో చివరి బంతికి ఒక పరుగు అవసరమైంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య దీపక్ చాహర్ ఆ బంతికి ఒక పరుగు సాధించడంతో విజయం సిఎస్‌కె పరమైంది. కోల్‌కతా బౌలర్లలో నరైన్ 3, రసెల్, ఫెర్గూసన్, ప్రసిధ్ కృష్ణ, చక్రవర్తి తలో వికెట్ తీశారు.
రాణించిన త్రిపాఠీ, రాణా
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతాకు ఆదిలోనే దురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ర్ శుభ్‌మన్ గిల్(9)ను రాయుడు రనౌట్ చేశాడు. ఆతర్వాత వెంకటేశ్ అయ్యర్(18)తో కలిసి మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. సామ్‌కరన్ వేసిన నాలుగో ఓవర్‌లో త్రిపాఠీఓ సిక్స్, మరో ఫోర్ బాదాడు. హేజిల్‌వుడ్ వేసిన తర్వాతి ఓవర్‌లో అయ్యర్ మరో రెండు ఫోర్లు కొట్టాడు. అయితే ఆరో ఓవర్‌లో శార్దూల్ ఠాకూర్ వెంకటేశ్ అయ్యర్‌ను ఔట్ చేయడమే కాకుండా ఒక్క పరుగు కూడా ఇవ్వకపోవడంతో స్కోరు వేగం మందగించింది. తర్వాత వచ్చిన మోర్గాన్(8) నిరాశపర్చగా, జడేజా వేసిన 13వ ఓవర్‌లో త్రిపాఠీ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. త్రిపాఠీ 33 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 45 పరుగులు చేశాడు. మరో వైపు రసెల్ స్కోరు వేగాన్ని పెంచడానికి ప్రయత్నించి ఔటయ్యాడు. 15 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 20 పరుగులు చేసిన రసెల్ 17వ ఓవర్లో ఔటయ్యాడు. అయితే చివర్లో దినేశ్ రాణా, కెప్టెన్ దినేశ్ కార్తీక్‌లు దూకుడుగా ఆడారు. కార్తీక్ 11 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 26 పరుగులు చేయగా, రాణా 27 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 36 పరుగులు చేశాడు. హేజిల్‌వుడ్ వేసిన చివరి ఓవర్లో కార్తీక్ ఔటయ్యాడు. సిఎస్‌కె బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు పడగొట్టగా జడేజా ఒక వికెట్ సాధించాడు. ఈ విజయంతో పది మ్యాచ్‌లు ఆడిన సిఎస్‌కు 8 విజయాలు, రెండో ఓటములతో 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరో వైపు అన్నే మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా 6 ఓటములు, నాలుగు విజయాలతో 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.

CSK Beat KKR by 2 Wickets in IPL 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News