Friday, April 26, 2024

ధోనీ సేనకు సవాలు వంటిదే!

- Advertisement -
- Advertisement -

దుబాయి: యుఎఇ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సవాలుగా తయారైందనే చెప్పాలి. సీనియర్ క్రికెటర్లు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ అర్ధాంతరంగా టోర్నీ నుంచి తప్పుకోవడం జట్టుకు ప్రతికూలంగా మారింది. అంతేగాక యుఎఇలో అడుగు పెట్టినప్పటి నుంచి చెన్నైకు ఏదీ కలిసి రావడం లేదు. దుబాయి వచ్చిన వెంటనే నిర్వహించిన వైద్య పరీక్షల్లో 13 మంది జట్టు సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది. ఇందులో ఇద్దరు క్రికెటర్లు కూడా ఉన్నారు. కీలక బౌలర్ దీపక్ చాహర్‌తో పాటు యువ బ్యాట్స్‌మన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో చెన్నై ఇతర జట్లతో పోల్చితే చాలా ఆలస్యంగా ప్రాక్టీస్‌ను మొదలు పెట్టక తప్పలేదు. ఇదే సమయంలో సీనియర్లు ఇద్దరు మధ్యలోనే తప్పుకోవడం సమస్యలు మరింత పెరిగాయి. గతంతో పోల్చితే ఈసారి ఐపిఎల్ చాలా భిన్నమైన పరిస్థితుల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా అన్ని దేశాల క్రికెటర్లు చాలా కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉండక తప్పలేదు. ఇందులో భారత ఆటగాళ్లు అయితే కనీసం దేశవాళి క్రికెట్ కూడా ఆడలేదు. సుదీర్ఘ విరామం తర్వాత వారందరూ నేరుగా ఐపిఎల్‌లోనే బరిలోకి దిగుతన్నారు. ఇక చెన్నై జట్టులో అత్యంత కీలక ఆటగాడిగా పేరున్న మహేంద్ర సింగ్ ధోనీ అయితే ఏడాదికి పైగా అసలు ఎలాంటి క్రికెట్‌ను ఆడనలేదు. కిందటి ఏడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత ధోనీ మళ్లీ క్రికెట్ బరిలోకి దిగలేదు. రైనా, హర్భజన్ వంటి సీనియర్లు దూరమైన సమయంలో ధోనీ పాత్ర మరింత కీలకంగా తయారైంది. ధోనీ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్న రైనా అర్ధాంతరంగా తప్పుకోవడం మాత్రం చెన్నైకి చాలా పెద్ద లోటుగా విశ్లేషకులు సయితం అభివర్ణిస్తున్నారు. వైస్ కెప్టెన్‌గా రైనా అందించే సలహాలు, సూచనలు ధోనీకి ఎంతో కలిసి వచ్చేవి. అతని లేని లోటు ఈసారిధోనీకి స్పష్టంగా కనిపించవచ్చు. మరోవైపు ఐపిఎల్‌లో అపార అనుభవం ఉన్న సీనియర్ బౌలర్ హర్భజన్ కూడా దూరం కావడం ఇబ్బందికర పరిణామంగానే చెప్పక తప్పదు.
ఆశలన్నీ ధోనీపైనే
ఇదిలావుంటే సీనియర్లు లేకున్నా చెన్నై మాత్రం మెరుగైన ప్రదర్శన చేయడం ఖాయమని అభిమానులు ధీమాతో ఉన్నారు. అపార అనుభవజ్ఞుడైన ధోనీపైనే జట్టు సభ్యులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అతని సారథ్య ప్రతిభ జట్టుకు పెద్ద ఊరటనిచ్చే అంశమని వారు పేర్కొంటున్నారు. ఉన్న వనరులను ఎలా వినియోగించుకోవాలో ధోనీకి బాగా తెలుసని, కొంత మంది కీలక ఆటగాళ్లు దూరమైనా జట్టుకు వచ్చే నష్టమేమీ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక జట్టు యాజమాన్యం కూడా ధోనీపైనే ఆశలు పెట్టుకుంది. జట్టును ముందుండి నడిపిస్తాడనే నమ్మకంతో యాజమాన్యం ఉంది. ఇక రవీంద్ర జడేజా, షేన్ వాట్సన్, డ్వేన్ బ్రావో వంటి అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు జట్టులో ఉండడం కూడా కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఇక అంబటి రాయుడు వంటి విధ్వంసక ఆటగాడు ఉండనే ఉన్నాడు. శామ్ కరన్ వంటి ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ కూడా జట్టుకు అదనపు బలమని చెప్పాలి. కేదార్ జాదవ్, గైక్వాడ్, మురళీ విజయ్, డుప్లెసిస్ వంటి బ్యాట్స్‌మన్ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి స్థితిలో చెన్నైను తక్కువ అంచన వేయకూడదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

CSK faced many problems before start IPL 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News