Friday, May 3, 2024

సమర్థ సారథ్యంలో సమృద్ధ రాష్ట్రం

- Advertisement -
- Advertisement -

Cultivated sector

 

ఆ రేళ్ల అనతికాలంలోనే పుష్కల సుజల రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ సమర్థ రాజకీయ నాయకత్వంలో సాగు రంగంలో వినూత్న ఆలోచనతో దేశానికే కొత్త బాట చూపించే దిశగా అడుగులు వేస్తున్నది. ప్రపంచంలోనే గణనీయమైన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి బృహత్ ప్రాజెక్టును మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే నిర్మించుకొని కోటి 40 లక్షల ఎకరాల సుక్షేత్రంగా రూపొందుతున్న నవరాష్ట్రం రైతు కన్నీటి జాడలేని సుభిక్ష భూమిగా రూపు దిద్దుకుంటున్నది. ప్రజల శ్రేయస్సును కాంక్షించే చేతనైన ముందు చూపున్న నాయకుడుంటే ఇటువంటి అపురూప దృశ్యం సుసాధ్యమే. ఏ సీజనులో, ఏ భూమిలో, ఏ పంట ఎంత మేరకు వేయాలి, ప్రజల ఆహార అవసరాలను, మార్కెట్‌లో గిరాకీని దృష్టిలో ఉంచుకొని, ఆయా చోట్ల ఉండే వాతావరణ పరిస్థితులను బట్టి సాగు లక్షాలను నిర్ధారించి రైతులు తప్పనిసరిగా దానిని పాటించేలా చేయడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించుకున్నారు. అందుకోసం ప్రణాళికాబద్ధమైన పద్ధతిని రూపొందింప చేస్తున్నారు. ఇందుకు నాందిగా ఆదివారం నాడు ప్రగతి భవన్ నుంచి మండల వ్యవసాయ విస్తరణాధికారులతో, రైతు బంధు సమితి ప్రతినిధులతో, కాకలుదీరిన వ్యవసాయ నిపుణులతో విడియో సదస్సు ద్వారా ముఖ్యమంత్రి జరిపిన సమాలోచన దేశ చరిత్రలోనే అపూర్వమైనది.

వ్యవసాయ రంగస్థలం మీదనే కనీవినీ ఎరుగని అపురూప ఘట్టం. రాష్ట్రంలో పంట సాగును రైతు ఇంట కనక వర్షంగా మార్చే కృషిలో పౌర సరఫరాల వ్యవస్థను కూడా భాగస్వామిని చేయాలని కెసిఆర్ ఇంతకు ముందే సంకల్పించిన సంగతి విదితమే. రైతు వద్ద తగిన మద్దతు ధరకు పంటను కొనుగోలు చేసి, ప్రజల వినియోగానికి అనువైనట్టుగా దానికి అదనపు విలువను కలిగించే బాధ్యతను పౌర సరఫరాల సంస్థ చేపట్టేలా చూడాలని ఆదివారం నాటి సదస్సులో నిపుణులు చేసిన సూచన కెసిఆర్ మేధా సృష్టే. ఇందువల్ల రైతు శ్రమకు తగిన విలువను మార్కెట్ నుంచి నేరుగా రాబట్టే మహత్తర అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం సూచించే పంటను కాదని ఇష్టావిలాసంగా సాగు చేసే రైతులకు ఎటువంటి సాయం అందించరాదని, వారు పండించే దానిని మద్దతు ధరకు కొనుగోలు చేయరాదని కూడా నిపుణులు సూచించారు. పసి బిడ్డను రోగాల బారి నుంచి కాపాడేందుకు చేదు మందు తాగించడం అనివార్యమైనట్టే రాష్ట్రంలోని రైతుల హితం కోసం ఇటువంటి అదుపాజ్ఞల విధానం ఎంతైనా అవసరం.

ఈ సమగ్ర ప్రణాళికను పకడ్బందీగా అమలు పర్చడం ద్వారా తెలంగాణను వ్యవసాయ సాఫల్య దిశగా దేశానికే అగ్రగామిని చేయడం సుసాధ్యమవుతుంది. రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ వంటి వినూత్న విప్లవాత్మక పథకాలతో దేశమంతా తనవైపు చూసేలా చేసుకున్న కెసిఆర్ మణిమకుటంలో ఈ నూతన సాగు విధానం కలికితురాయి కాగలుగుతుంది. ఆరేళ్ల అతి పిన్న వయసులోని రాష్ట్రం సాధిస్తున్న అమోఘ విజయ పరంపరలో మరో అతులిత లక్ష సాధన వచ్చి చేరుతుంది. సరైన దిశానిర్దేశంతో వ్యవసాయాన్ని రైతులకు అత్యంత ప్రయోజనకరంగా మార్చవచ్చని ముఖ్యమంత్రి గత నెలాఖరులో ప్రగతి భవన్‌లో నిర్వహించిన రెండు రోజుల ఉన్నత స్థాయి సమావేశంలో అభిప్రాయపడ్డారు. వరి మినహా వ్యవసాయదారుకు ప్రయోజనకరమైన ఇతర పంటలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. త్వరగా పండే ముతక బియ్యంతో పాటు ప్రజలు ఎక్కువగా ఆదరించే సన్న బియ్యాన్ని కూడా విరివిగా పండించాలని రైతులకు హితవు చెప్పారు. పంటల ఎంపిక, ఎరువుల వినియోగం, దిగుబడిని సవ్యంగా విక్రయించగలగడం ఈ మూడింటి సమన్వయంతోనే వ్యవసాయాన్ని లాభసాటి చేయవచ్చని అన్నారు.

అధిక దిగుబడులిచ్చి, మంచి ఆదాయం సమకూర్చే తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్నిచ్చే పంటలనే ఎంచుకోవాలని ఉద్బోధించారు. ఇప్పటికే 22.5 లక్షల టన్నుల నిల్వ సామర్థమున్న గోదాములున్నాయని, అదనంగా మరి 40 లక్షల టన్నుల కెపాసిటి గోడౌన్లను నిర్మించదలచామని చెప్పారు. అన్నింటిలోనూ శీతల నిల్వ సదుపాయాలను అంతర్భాగం చేయదలచినట్టు వెల్లడించారు. ఈ ప్రణాళికాబద్ధ సమగ్ర వ్యవసాయ విధాన వ్యవస్థను అమల్లోకి తీసుకురాదలచడానికి ముందు సాగు నీటి దాహంతో ఏ ఒక్క పంట గింజా చావునోట్లోకి వెళ్లకుండా చూశారు. ఇరిగేషన్ సౌకర్యాన్ని ఆఘమేఘాల మీద కల్పించారు.

మరోవైపు నిరంతర ఉచిత విద్యుత్తు సరఫరా ద్వారా భూగర్భ జలాలను పైకి ఉబికిస్తున్నారు. గోదావరి నదిపై 3 బ్యారేజీలు, 1500 పైచిలుకు కి.మీ కాలువలు, 20 రిజర్వాయర్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కెసిఆర్ జలగణమన దీక్షాదక్షతకు తిరుగులేని తార్కాణం. అమెరికాలోని అతిపెద్ద కొలరాడో ఎత్తిపోతలకు మించిన ఈ బృహత్ బహుళార్థ సాధక సాగునీటి ప్రాజెక్టును రూ. లక్ష కోట్ల వ్యయంతో మూడేళ్ల అతిస్వల్ప వ్యవధిలో నిర్మింపచేయడమే కెసిఆర్ సాటిలేని మేటితనానికి నిదర్శనం. అదే మాదిరిగా ఆయన తలపెట్టిన శాస్త్రీయ పంటల ఎంపిక, సాగు, నిల్వలు, మార్కెటింగ్ విధానం ప్రపంచానికే ఆదర్శవంతమవుతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News