Sunday, April 28, 2024

20 లక్షల కోట్లు

- Advertisement -
- Advertisement -

Modi

లాక్‌డౌన్ 4.0
‘స్వయం సమృద్ధ భారత్ అభియాన్’ పేరిట భారీ ఆర్థిక ప్యాకేజీ
దేశ జిడిపిలో ఇది 10 శాతం
కొత్త రూపురేఖలతో నాలుగో దశ లాక్‌డౌన్
ప్యాకేజీతో నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దోహదం, భారత పారిశ్రామిక రంగానికి మరింత బలం
మేకిన్ ఇండియా కోణంలో ఆర్థిక పరిపుష్టి,
స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించండి
ప్యాకేజీ వివరాలు నేడు ఆర్థిక మంత్రి వెల్లడిస్తారు
జాతినుద్దేశించి ప్రధాని మోడీ కీలక ప్రసంగం

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు రూ 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.

ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ యోజన పేరిట ఈ ప్యాకేజీని తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 17తో ముగిసే లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు, లాక్‌డౌన్ 4, దీని సరికొత్త రూపం వివరాలను 18వ తేదీ లోపు వెల్లడిస్తామని ప్రకటించారు. కరోనా లాక్‌డౌన్‌తో దేశ ఆర్థిక పరిస్థితి, ప్రజల సమస్యల నేపథ్యంలో మంగళవారం రాత్రి ప్రధాని జాతి నుద్ధేశించి ప్రసంగించారు. ప్రపంచం ఇంతవరకూ ఎ ప్పుడూ చూడని తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ప్రధాని చెప్పారు. దేశం అసాధారణ రీతిలో సమస్యలను ఎదుర్కొందన్నారు. ఈ దశలో భారతదేశం ఆత్మస్థయిర్యంతో కరోనా సవాలును సమర్థవంతంగా ఎదుర్కొంటోందన్నారు.ప్రజలు ధైర్యం వీడరాదని, సమాజంలోని అన్ని వర్గాలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ఈ కష్టకాలంలో 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తో ందని ప్రధాని తమ ప్రసంగంలో వెల్లడించారు.

ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట ఈ ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు, దీనిని దేశవ్యాప్తంగా బుధవారం ( 13 వ తేదీ నుంచి) అమలు చేయనున్నట్లు ప్రధాని తెలిపారు. ప్యాకేజీని ల్యాండ్, లేబర్, లిక్విడిటి, లాను దృష్టిలో పెట్టుకుని రూ పొందించినట్లు తెలిపారు. వ్యవసాయం, కార్మికులు, కూలీలు, ఆదాయ వనరులు, చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్యాకేజీ ఉంటుందని తెలిపారు. వైరస్ నుంచి మనను మనం కాపాడుకోవాలి, ఇదే సమయంలో ఆర్థిక ఒడుదుడుకులు లేకుండా ముందుకు సాగాలి, ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లు తెలిపారు. వైరస్ సవాలు, ప్రజల మనుగను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 18వ తేదీ నుంచి అమలు అయ్యే లాక్‌డౌన్ సరికొత్త రూపంలో ఉంటుందని, ఇది ఇంతకు ముందటి మూడు లాక్‌డౌన్‌లకు భిన్నంగా ఉంటుందని తెలిపారు. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీతో ప్రస్తుత కరోనా సంక్షోభ దశలో ఆర్థిక స్థిరత్వానికి, ఇదే తరుణంలో మేకిన్ ఇండియా పరిపుష్టికి వీలేర్పడుతుందని ప్రధాని తెలిపారు. రూ 20 లక్షల కోట్ల ప్యాకేజీ దేశ జిడిపిలో దాదాపు 10 శాతంగా ఉంటుంది. ప్యాకేజీపై పూర్తి వివరాలను ఆర్థిక మంత్రి వివరిస్తారని తెలిపారు. ఈ నెల 17వ తేదీన జాతీయ స్థాయి లాక్‌డౌన్ గడువు ముగియనున్న దశలో ప్రధాని మోడీ ప్రజలను ఉద్ధేశించి టీవీల ద్వారా చేసిన ప్రసంగంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అంతటా జనం టీవీలకు అతుక్కుపొయ్యారు.

పరిశ్రమలకు వెన్నుదన్నుగా ప్యాకేజీ

తాము ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ చిన్న మధ్య తరహా పరిశ్రమలన్నింటికీ మేలు చేస్తుందని ప్రధాని భరోసా ఇచ్చా రు. దేశంలోని ప్రతి పారిశ్రామికుడిని, దానిలో పనిచేసే వారందరిని భాగస్వామ్యం చేసుకుంటూ వారి సంక్షేమం కోసం ఈ ప్యాకేజీని రూపొందించినట్లు తెలిపారు.

దేశంలో లాక్‌డౌన్4.. 18 లోపున వివరాలు

దేశంలో ఇప్పటి లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు, దీనికి సంబంధించి వివరాలు, ఇది ఎప్పటివరకూ ఉంటుంది? సడలింపులు, ఆంక్షలు, జోన్లు, ప్రజా రవాణా ఇతర అన్ని ముఖ్యాంశాలను ఈ నెల 18వ తేదీలోపునే ప్రకటిస్తారని ప్రధాని తెలిపారు. ఒక్కరోజు క్రితమే లాక్‌డౌన్, ప్రజా రవాణా, దేశ ఆర్థిక వ్యవస్థ పునః ప్రారంభం, వలస కార్మికులు, కూలీల సమస్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో సమావేశం నిర్వహించారు. సిఎంల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇప్పటివరకూ సాగిన మూడు దశల లాక్‌డౌన్లకు నాలుగో లాక్‌డౌన్‌కు తేడా ఉంటుందని, ఇది సరికొత్త రూపంలో ఉంటుందని ప్రధాని తెలిపారు. మాస్కులు కట్టుకుందాం, రెండడుగుల దూరం పాటిద్దాం అని, ఇతరత్రా అన్ని ఆంక్షలను ఆచరించాలని కోరారు.

లాక్‌డౌన్ పొడిగింపు అయినా, ప్యాకేజీ ప్రకటన అయినా, సడలింపులు అయినా ఇతరత్రా చర్యలు అయినా అన్నీ కూడా దేశ ప్రజలలో మరింత స్థయిర్యాన్ని పెంపొందింపచేసేందుకు అనుగుణంగా ఉంటాయని ప్రధాని స్పష్ఠం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ తమ ఉద్ధేశం, జాతికి ఇచ్చే పిలుపు అని, ఇందుకు వెన్నుదన్నులు అందించే విధంగానే ఆర్థిక ప్యాకేజీని రూపొందించినట్లు ప్రధాని వెల్లడించారు. భారత్ ప్రభుత్వం ఇచ్చే ప్రతి పైసా లబ్ధిదారులకు చెందుతుందని ప్రధాని స్పష్టం చేశారు. మనం మన ధైర్యం మన ఆత్మ మన జీవన విధానం అన్ని కూడా భయం జంకూ గొంకూ లేకుండా సాగాలి. కరోనా ఇతర సవాళ్లు ఎదురైనా మనం చెక్కుచెదరకుండా ఉండటమే తాము తలపెట్టిన ఆత్మనిర్భర్ యోజన లక్షం అని ప్రధాని తెలిపారు.

కీలక సంస్కరణలు అవసరం

ఆత్మ నిర్భర్ భారత్ లక్షం దిశలో కొన్ని కీలక సంస్కరణలు అత్యవసరం అని ప్రధాని తెలిపారు. ప్రపంచం అంతా కరోనాతో సంక్షోభంలో కూరుకుపోతోంది. ఈ దశలో మనం మరింత నిబ్బరంగా ఉండాలని ప్రధాని పిలుపు నిచ్చారు. ప్రభుత్వం ఈ యోజనను ప్రకటించడంతో సరిపోదని,ఈ సంకల్పాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి భారతీయుడు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌తో 42 లక్షల మంది కరోనాతో బాధితులు అయ్యారని, వైరస్‌తో దాదాపు 3 లక్షల మంది వరకూ మృతి చెందారని, భారత్‌లో కూడా ఎందరో బాధితులు అయ్యారని, ఎందరో తమ వారిని కోల్పోయ్యారని, వారందరికి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానని ప్రధాని తెలిపారు. కరోనా దశలో పిపిఇ కిట్లు, మాస్క్‌ల తయారీతో స్వయం సమృద్ధి సాధించినట్లు ప్రధాని తెలిపారు.

ఈ వైరస్ ఆరంభ దశలో దేశంలో ఒక్క పిపిఇ కిట్ కూడా తయారు కాలేదని, కేవలం ఎన్ 95 మాస్క్‌లు తక్కువ సంఖ్యలో రూపొందేవని, ఇక్కడి వాతావరణానికి ఎక్కువగా పరిచయంలేని మాస్క్‌ల కాలం ముంచుకురావడంతె వెంటనే రంగంలోకి దిగి స్వయం ఉత్పత్తితో స్వయం సమృద్ధి దిశలో ముందుకు సాగినట్లు, కరోనా కష్టం మనకు సవాలును తెచ్చిపెట్టింది. అంతేకాకుండా అవసరాలను కూడా తీసుకువచ్చిందని, అవసరాలను తీర్చుకునే తపన పెరిగిందని తెలిపారు. భారతీయ కార్మిక శక్తి ఈ లాక్‌డౌన్ దశలో ఎంతో ఓపికను ప్రదర్శించిందని, స్థానిక ఉత్పత్తిరంగం ఎంతగానో ఆదుకుందని ప్రధాని తెలిపారు. లోకల్ మేలు అనే విధానం ఇప్పుడు మనకు చాటి చెప్పినట్లు అయిందన్నారు. వ్యవసాయ రంగం ఇక ముందు ఎటువంటి అసాధారణ సమస్యలు ఎదుర్కొకుండా చేసేందుకు ఇటువంటి సంక్షోభాలు వచ్చినప్పుడు అన్ని రంగాలు ధీటుగా నిలిచేందుకు ఇప్పటి సవాలు ఒక అవకాశంగా నిలిచిందని ప్రధాని తెలిపారు.

స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించండి

తాను ఎప్పుడూ స్వదేశీ ఉత్పత్తుల గురించి ప్రచారం చేస్తూ వస్తున్నానని, ఖాదీ వస్త్రాలను ధరించండి, ఖాదీ కొనండని చెపుతున్నానని, దీని వల్ల స్థానిక చేనేతకార్మికులకు ఉపాధి దక్కుతుందని, స్వదేశీ భావన ఇనుమడిస్తుందని ప్రధాని తెలిపారు. అంతేకాకుండా స్థానిక ఉత్పత్తుల విక్రయాలతో దేశ ఆర్థిక పరిస్థితి మెరుగు అవుతుందని, ప్రస్తుత దశ ప్రపంచానికి వేర్వేరుగా సమస్యలపై పోరాటం చేయాల్సిన అవసరాన్ని కల్పించిందని, ఈ తరుణంలో మనం ఎవరికి వారుగా సాగించే పయనంలో స్వదేశీ భావన బలోపేతం అవుతుందని తెలిపారు. స్థానిక ఉత్పత్తులను వినియోగించుకోవడం నామోషీ అనుకోవద్దు, ప్రతి భారతీయుడూ ఇందుకు గర్వించాలని ప్రధాని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News