Wednesday, May 1, 2024

రాష్ట్రాల హక్కులను హరించే చట్టాలు

- Advertisement -
- Advertisement -

Laws that drain states' rights

 

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేంద్రీకృత విధానాలను అమలు చేస్తుంది. వారి ఆరు సంవత్సరాల పాలన చూశాకే నేను ఈమాట అనాల్సి వస్తుంది.

ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వేస్తున్న ప్రతి అడుగు ఆ వైపుగానే ఉంది. ఒకే దేశం ఒకే చట్టం, ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదం వినడానికి బాగుంది. కాని దాని చాటున అన్ని హక్కులు తమకే ఉండాలనే కేంద్రం కుట్ర కూడా ఉంది. ఆ విషయాన్ని గమనించకపోతే పప్పులో కాలేసినట్ల్లే.

కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో రాజ్యాంగం చెప్పిన దానిని, సర్కారియా కమిషన్ చేసిన సూచనలను, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు ఉన్న హక్కులు అమలు చేయడం బహుశ కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేదనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే కీలక పదవులలో, బాధ్యతలలో ఉన్న మంత్రులు, ఎంపిలు, ఇతర బిజెపి నాయకులు అప్పుడప్పుడు రాజ్యాంగాన్ని పునస్సమీక్షించాలి, సమూలంగా మార్చాలి అనే వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాంటి ప్రకటనలు ఎందుకు చేస్తున్నట్లు యాదృచ్ఛికంగా చేస్తున్నారు అని అనుకోవాలా? ఒక్కసారి అంటే నిజమే అనుకుందాం పదే పదే ఉన్నత స్థానంలో ఉన్నవారు మాట్లాడుతుంటే ఎలా అర్ధం చేసుకోవాలి? అంటే ఆ ప్రకటనల ద్వారా రియాక్షన్, ఫీడ్‌బ్యాక్ తెలుసుకోవడంతో పాటు ప్రజలను సిద్ధం చేస్తున్నారని కూడా అనుకోవాల్సివస్తుంది. ముందు వారి ఎజండా ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టడం అనిపిస్తుంది. అదే సమయంలో కాంగ్రెస్‌ను బలహీనపరచడం. అందుకు గాంధీ, నెహ్రూల ప్రభావాన్ని తగ్గించడం.

దీని కోసం ఇప్పటికే కార్యాచరణ రూపొందించారు. గుజరాత్‌లో పటేల్ విగ్రహం పెట్టడం అందులో భాగమే. అంతేకాదు గాడ్సేను తెర మీదకు తెచ్చి గాంధీని వివాదాస్పద వ్యక్తిగా చిత్రీకరిస్తూ బిజెపి ఎంపిలు ప్రకటనలు చేయడం ఇందులో భాగమే. అలాగే ఆర్థిక రంగం, సాగునీటి రంగం, విద్యుత్ రంగం తమ గుప్పిటిలో పెట్టుకోవడం ద్వారా ప్రాంతీయ పార్టీల ప్రభావాన్ని తగ్గించవచ్చని వారి ఆలోచన. అందుకు అనుగుణంగా చట్టాల రూపకల్పన చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిని కట్టడి చేయకపోతే దేశంపై పట్టు దొరకదు అనే అభిప్రాయంతో బిజెపి ఉన్నట్లు కనపడుతుంది. ముఖ్యంగా 80వ దశకం తరువాత దేశ రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల ప్రభావం క్రమంగా పెరుగుతూ వచ్చింది. కొన్ని సందర్భాలలో జాతీయ పార్టీలను శాసించే స్థాయికి వచ్చాయి.

కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నాయి. థర్డ్ ఫ్రంట్ కోసం అనేక ప్రయత్నాలు చేశాయి. ఒకటి రెండు సార్లు సక్సెస్స్ అయ్యాయి కూడా. మరికొన్ని సందర్భాలలో ప్రాంతీయ పార్టీల మద్దతుతో జాతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి.ఉదారవాద రాజకీయాలున్న కాంగ్రెస్ కొంత వరకు థర్డ్ ఫ్రంట్‌ను ప్రాంతీయ పార్టీలను స్వాగతిస్తుందేమో కాని, భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రాంతీయ పార్టీల కూటమినికాని, ప్రాంతీయ పార్టీలను కాని అంగీకరించదు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే వారి సైద్ధాంతిక పునాది అటువంటిది కనుక. అఖండ భారత్‌ను నిర్మించాలన్నది వారి మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం లక్ష్యం. అందుకు అధ్యక్ష తరహా పాలన ఉండాలని కోరుకుంటుంది. దానికి అనుగుణంగానే బిజెపి అడుగులు వేస్తుంది అనేది గత ఆరు సంవత్సరాలుగా కేంద్రం అమలు చేస్తున్న ఎజండా చూస్తే అందరికీ అర్ధం అవుతుంది. అందులో నుండి వచ్చిన ఆలోచనే ఒకే దేశం ఒకే ఎన్నిక అనే చర్చ కూడా ఉంది.

మోడీ ఆరేళ్ళ పాలనను మనం నిశితంగా పరిశీలిస్తే వారి అడుగులు ఎటువైపు పడుతున్నాయో మనకు ఇట్టే అర్ధం అవుతుంది. గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ విధానం తెచ్చారు. అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. కాని ఆచరణలో ఏమి జరుగుతుంది. మా పన్నుల వాటా మాకు ఇవ్వండి అని కేంద్రాన్ని అర్థించే స్థితికి రాష్ట్రాలు వచ్చాయి.. అలాగే సాగునీటి రంగంలో నాలుగు బిల్లులు తెచ్చింది. దీని ప్రమాదం రాష్ట్రాలకు ఇప్పుడు అర్ధం కాదు. రేపు భవిష్యత్‌లో తెలుస్తుంది. జల వివాదాల కోసం తెచ్చిన పర్మినెంట్ ట్రిబ్యునల్, డ్యాం సేఫ్టీ బిల్లులు కేంద్రం చేతిలో ఆయుధాలే అని చెప్పవచ్చు. తాజాగా తెస్తున్న విద్యుత్ సవరణ చట్టం కూడా రాష్ట్రాల హక్కులను లాక్కోవడం కోసమే. నాకు ఇంకో అనుమానం కూడా వస్తుంది. పెట్రోలియం ఉత్పత్తులు లాగానే లిక్కర్ ఉత్పత్తులు కూడా మా చేతిలో ఉండాలని దేశ వ్యాపిత లిక్కర్ పాలసీ కూడా తెస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రాలకు ఆదాయ వనరుగా ఉన్న లిక్కరును కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ఆశ్చర్యపోనక్కర లేదు.

ప్రాంతీయ పార్టీల ఓటు బ్యాంకు, రాష్ట్రాల ఆదాయంను దెబ్బకొట్టే లక్ష్యంగా కేంద్రం చట్టాలు తెస్తుందనిపిస్తుంది. ఎందుకు ఈ అనుమానం కలుగుతుంది అంటే వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉండే ప్రాంతీయ పార్టీలు విద్యుత్, సాగునీటి రంగాలలో సాధించే ప్రగతి ఆ రంగాలలో ప్రజలకు ఇస్తున్న రాయితీలు వాటికి ఓట్లు తెచ్చిపెడుతున్నాయి. ఇది దెబ్బకొట్టాలి అంటే రాష్ట్రాలకు ఆ రంగాల మీద హక్కు లేకుండా చేయాలి అనేది కేంద్రం ఆలోచనగా కనపడుతుంది ఎందుకంటే అది వేసే అడుగులు చూస్తుంటే అనిపిస్తుంది. నదుల అనుసంధానం చేయాలనే వాదన కూడా ఆ ఆలోచన నుడిపుట్టిందే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రథమ ప్రాధాన్యతగా కేసీఆర్ సాగునీటి రంగాన్ని విద్యుత్ రంగాన్ని తీసుకున్నారు వాటిలో అద్భుతమైన ఫలితాలు సాధించారు. రైతులకు ఉచితంగా విద్యుత్, సాగునీరు అందిస్తున్నారు. వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. దీనితో రాష్ట్రంలో టిఆరెస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఇలా అనేక రాష్ట్రాలలో ఆయా ప్రాంతీయ పార్టీలు బలపడ్డాయి. వాటి మూలాలను దెబ్బ కొట్టాలంటే రాష్ట్రాలకు ఉన్న హక్కులను లేకుండా చేయాలనే సంకల్పం కేంద్రం తీసుకున్నట్లు కనపడుతుంది .

విదేశీ వ్యవహారాలు, రక్షణ రంగంపై పెట్టిన శ్రద్ధ మోడీ సర్కార్ ఆర్ధిక రంగం మీద పెట్టలేదు. ఇది నేను అంటున్న మాట కాదు ఆర్ధిక నిపుణులు చెబుతున్న మాట. వారు చెప్పడమే కాదు కళ్లకు కనపడుతుంది కూడా. పెద్దనోట్ల రద్దు, జియస్‌టి లతో ఆర్ధిక సంక్షోభం వచ్చింది. దీని నుండి బయటపడే మార్గాలను అన్వేషించిన దాఖలాలు కనపడలేదు. ఇప్పుడు లాక్‌డౌన్ వచ్చి పడింది. మూలిగే నక ్కమీద తాటికాయ పడినట్లు అయ్యింది. అయినా ఇప్పటి వరకు ఇంకా దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. ఏకాడికి వారి ఆలోచన రాష్ట్రాల హక్కులకు ఎలా గండికొట్టాలి, తమకు రాజకీయంగా కలసివచ్చే సామాజిక అంశాలు ఏమున్నాయి అని ఆలోచిస్తున్నారే తప్ప దేశ ఆర్ధిక పరిస్థితులను చక్కదిద్దుదామని లేదు. తలాక్ తలాక్ బిల్లు తేవడం పై, కామన్ సివిల్ కోడ్ తేవడంపై, రామమందిరం నిర్మించడం పై, 370 ఆర్టికల్‌ను రద్దు చేయడం పై పెట్టిన దృష్టితో పోలిస్తే ఆర్ధిక రంగం చక్కదిద్దడంకు పెట్టిన ప్రయత్నాలు నామమాత్రమే అని చెప్పాలి. మోడీ ఆలోచన విధానాన్ని వారి మాతృసంస్థ సైద్ధాంతిక పునాదిని ప్రాంతీయ పార్టీలు అర్ధం చేసుకోవాలి అన్ని హక్కులు హరించాక మేల్కొని లాభం.

జర్మనీలో ఒక కథ ఉంది. నాజీలు ముందు యూదుల కోసం వచ్చారు ఆ తరువాత క్రిస్టియన్ కేథలిక్‌ల కోసం వచ్చారు అయినా నేను పట్టించుకోలేదు. ఆ తరువాత కార్మికుల కోసం వచ్చారు అప్పుడు కూడా నేను పట్టించుకోలేదు ఇప్పుడు నా కోసం వచ్చారు నన్ను పట్టుకొనిపోతున్నారని చెప్పుకుందామన్న ఎవరు లేరు అని పెద్ద మనిషి తన గోడువెళ్లబోసుకున్నాడు. నీదాకా వస్తేకాని నీవు స్పందించకపోతే నీకొచ్చిన కష్టాన్ని చెప్పుకుందామన్న ఎవరూ ఉండరు అనేది ఆ కథ నీతి అందుకే కేంద్రం కేంద్రీకృత విధానాలపై యుద్ధానికి సిద్ధం కావలి. అందుకు మోడీ తేనున్న విద్యుత్ సవరణ చట్టాన్ని ఆయుధంగా వాడుకోవాలి. దానిని అడ్డుకోవడం ద్వారా కేంద్రం దూకుడుకు కళ్లెం వేయాలి. పార్లమెంట్ లో సంపూర్ణ మెజారిటీ వుంది కనుక బిల్లును కేంద్రం పాస్ చేసుకోవచ్చు. కాని ప్రజాక్షేత్రంలో కేంద్రం నైజాన్ని ఎండగట్టగలగాలి, లేదంటే ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది.

                                                                                     పి.వి శ్రీనివాసరావు
(ఇన్‌పుట్ ఎడిటర్ టి న్యూస్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News