Thursday, May 2, 2024

సాగు రుణాల లక్ష్యం చేరుకుంటాం

- Advertisement -
- Advertisement -

Cultivation loans

 

ఈ రంగానికి రుణ వితరణను జాగ్రత్తగా గమనిస్తున్నాం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం ఉండదు : ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు ఇచ్చే వ్యవసాయ రుణాలను ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి పెంచిన రూ.15లక్షల కోట్ల వ్యవసాయ రుణాల టార్గెట్‌ను చేరుకోగలమన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో 2020 21ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణాల పంపిణీ లక్షాన్ని ఈ ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 11 శాతం అంటే 15 లక్షల కోట్ల రూపాయలకు పెంచింది. అంతేకాకుండా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో వివిధ ప్రణాళికలను అమలు చేయడానికి రూ.1.6 లక్షల కోట్లను కేటాయించింది.

2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేయాలని కేంద్రంలోని మోడీ సర్కార్ లక్షంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి పిఎంకిసాన్ పథకానికి రూ.75 వేల కోట్లు కేటాయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ పథకానికి బడ్జెట్‌లో అంతే మొత్తాన్ని కేటాయించారు కానీ సవరించిన అంచనాల ప్రకారం రూ.54,370 కోట్లు మాత్రమే ఖర్చు చేయనున్నారు. దీంతో పోలిస్తే వచ్చే ఏడాదికి దీనికి కేటాయించిన మొత్తం ఎక్కువే.‘ రుణ పరిమితిని విస్తరించడం జరిగింది. ‘స్థానిక వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఇది ఉందని నేనుగట్టిగా భావిస్తున్నాను.

డిమాండ్ పెరుగుతుందని, క్రెడిట్ అవసరాలను దీనితో నేరవేరుతాయని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి నేను గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకులు ఇచ్చే రుణాల పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాను. అందువల్ల ఈ లక్షాన్ని చేరుకోగలమని భావిస్తున్నాను’ అని శనివారం ఇక్కడ భారత రిజర్వ్ బ్యాంక్( ఆర్‌బిఐ) కేంద్ర బోర్డు సమావేశంలో పాల్గొన్న అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణాల లక్షం రూ.13.5 లక్షల కోట్లుగా ఉంది. సాధారణంగా వ్యవసాయ రుణాలకు ఏడాదికి 9 శాతం వడ్డీ ఉంటుంది. అయితే రైతులు ఏడాదికి 7 శాతం వడ్డీకే రూ.3 లక్షల దాకా స్వల్పకాలిక రుణాలను తీసుకోవడానికి వీలుగా ప్రభుత్వం వడ్డీలో 2 శాతం సబ్సిడీ ఇస్తోంది. కాగా ప్రభుత్వ బ్యాంకుల మెగా విలీనానికి సంబంధించి అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఆర్‌బిఐ బోర్డు సమావేశంలో ఈ అంశం చర్చకు రాలేదని చెప్పారు.

‘ఈ విషయంలో వెనక్కి వెళ్లడానికి కానీ, నోటిఫికేషన్ జారీకి జాప్యం జరగడానికి కానీ ఎలాంటి కారణం నాకు కనిపించడం లేదు. సమయం వచ్చినప్పుడు దీనిపై మీకు సమాచారం చెప్తాం’ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వం పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగుగా విలీనం చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ను పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేస్తారు. దీంతో ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1నుంచి దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా మారనుంది. అలాగే సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకుతో, అలహాబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంకుతో విలీనం చేస్తారు. అలాగే ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో విలీనం చేస్తారు.

ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపవు: శక్తికాంత్
కాగా బడ్జెట్ ప్రతిపాదనలు ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని, ఎందుకంటే ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌ఎంబి చట్టం నిర్దేశించిన ద్రవ్య లోటు పరిధిలోనే దాదాపుగా ఉందని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. రెవిన్యూ వసూళ్లు ఆశించిన మేర లేకపోవడంతో ప్రభుత్వం ఇటీవల ద్రవ్య లోటులక్షాన్ని ఇంతకు ముందు నిర్ణయించుకున్న జిడిపిలో 3.3 శాతంనుంచి 3.8 శాతానికి పెంచిన విషయం తెలిసిందే.

‘ఏ బడ్జెట్ ప్రభావం అయినా నేరుగా కనిపించేది ద్రవ్యలోటు గణాంకాలపైనే. అయితే ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి ఉంది. ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాదికి ద్రవ్య లోటు కూడా ఎఫ్‌ఆర్‌ఎంబి కమిటీ సిఫార్సులు నిర్ణయించిన పరిమితుల లోపే ఉన్నాయి’ అని బడ్జెట్ తర్వాత ఆర్‌బిఐ బోర్డు నుద్దేశించి సంప్రదాయ ప్రకారం ఆర్థిక మంత్రి ప్రసంగించిన అనంతరం విలేఖరులతో మాట్లాడిన శక్తికాంత్ దాస్ చెప్పారు. ప్రభుత్వం చేసే అప్పుల్లో ఎక్కువ భాగం చిన్న మొత్తాల పొదుపునుంచే అయినందున ద్రవ్యోల్బణ ప్రభావం పెద్దగా ఉండదు.

ముడి చమురు ధరలు తగ్గడం తప్పకుండా ద్రవ్యోల్బణంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణం ఆహార ద్రవ్యోల్బణం పెరగడమేనని దాస్ చెప్పారు. అంతేకాకుండా టెలికాం టారిఫ్‌లు సవరించడం వల్ల ప్రధాన ద్రవ్యోల్బణం కొద్దిగా పెరిగిందని ఆయన అన్నారు. ప్రధానద్రవ్యోల్బణాన్ని ద్రవ్య పరపతి విధానం పరిధిలోకి చేర్చడం గురించి అడగ్గా దీనిపై ఆర్‌బిఐలో అంతర్గతంగా సమీక్ష జరుగుతోందని, అవసరమైతే ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుతామని ఆయన చెప్పారు.

ప్రభుత్వానికి మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించే విషయాన్ని బోర్డు పరిశీలించిందా అని అడగ్గా, దాస్ నేరుగా సమాధానం చెప్పలేదు. ‘ఏదయినా నిర్ణయం తీసుకుంటే బహిరంగ పరుస్తాం’అంటూ సమాధానాన్ని దాట వేశారు. కాగా క్రెడిట్ వృద్ధి పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని మరో ప్రశ్నకు సమాధానంగా దాస్ చెప్పారు. గత అక్టోబర్‌నుంచి వాణిజ్య రంగంలోకి నిధుల రాకడ అన్ని వైపులనుంచి క్రమంగా పెరుగుతోందని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని తాము ఆశిస్తున్నామని చెప్పారు. ఆర్‌బిఐ అకౌంటింగ్ ఇయర్‌ను ఆర్థిక సంవత్సరంతో అనుసంధానం చేయడం గురించి అడగ్గా ఈ విషయం పరిశీలనలో ఉందని త్వరలో దీనిపై ప్రకటన చేస్తామని ఆయన చెప్పారు. ఆర్‌బిఐ జూలైనుంచి జూన్ వరకు అకౌంటింగ్ సంవత్సరంగా పాటిస్తున్న విషయం తెలిసిందే.

Cultivation loans reach the target
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News