Friday, April 26, 2024

దేశంలో రష్యా వ్యాక్సిన్ ట్రయల్స్‌కు డిసిజిఐ గ్రీన్‌సిగ్నల్

- Advertisement -
- Advertisement -

DCGI green signal for Russia vaccine trials in India

 

హైదరాబాద్ : దేశంలో రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి రెండు, మూడు దశల ట్రయల్స్ నిర్వహించడానికి డిసిజిఐ (డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి లభించింది. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, రష్యాడైరెక్టు ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డిఐఎఫ్), రష్యా సావెరిన్ హెల్త్ ఫండ్ సంస్థలు సంయుక్తంగా శనివారం ఈమేరకు ప్రకటించాయి. హైదరాబాద్ నగర ఆధార ఔషధ ఉత్తత్తి తయారీ సంస్థ అయిన డాక్టర్ రెడ్డీస్ ఇది బహుళ కేంద్ర, యాదృచ్ఛిక నియంత్రిత అధ్యయనం అవుతుందని, ఇందులోభద్రత, వ్యాధినిరోధక శక్తి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవలసి ఉందని వివరించింది. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌కు, పంపిణీకి గత సెప్టెంబర్‌లో డాక్టర్ రెడ్డీస్, ఆర్‌డిఐఎఫ్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈమేరకు ఆర్‌డిఐఎఫ్ వంద మిలియన్ డోస్‌ల వ్యాక్సిన్‌ను డాక్టర్ రెడ్డీస్‌కు సరఫరా చేయవలసి ఉంటుంది.

డాక్టర్ రెడ్డీస్ కోఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ జివి ప్రసాద్ దేశంలో ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభానికి అనుమతించడం చెప్పుకోదగిన అభివృద్ధిగా అభివర్ణించగా, ఆర్‌డిఐఎఫ్ సిఇఒ కిరిల్ డిమిట్రియెవ్ భారత నియంత్రిత సంస్థలతో తాము సమన్వయమై భారత క్లినికల్ డేటా సేకరించి, సురక్షిత, వ్యాధినిరోధిత అధ్యయనం సాగించడానికి అనుమతించడం చెప్పుకోదగిన అంశంగా పేర్కొన్నారు. రష్యాలో నిర్వహించిన మూడో దశ ట్రయల్స్ నుంచి భద్రత, వ్యాధినిరోధిత అధ్యయనం సమకూరుస్తామని అన్నారు. ఈ డేటా భారత్‌లో స్పుత్నిక్ వ్యాక్సిన్ వైద్యపరమైన అభివృద్ధికి మరింత బలం చేకూర్చగలదని అభిప్రాయపడ్డారు. రష్యాలో ప్రస్తుతం స్పుత్నిక్ వి మూడోదశ ట్రయల్స్ జరుగుతున్నాయి. 40 వేల మందిపై నిర్వహించడానికి ప్రతిపాదించారు. అంతేకాక అరబ్ ఎమిరేట్స్‌లో గత వారం ఈ వ్యాక్సిన్ మూడోదశ క్లినికల్ ట్రయల్ ప్రారంభమైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News