Tuesday, April 30, 2024

ఢిల్లీ దుర్ఘటన కేసులో విస్తుపోయే వాస్తవాలు..

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ దుర్ఘటన..అంజలి కేసులో
విస్తుపోయే వాస్తవాలు
బాధితురాలితోపాటు స్కూటీపై మరో యువతి
ప్రమాదం అనంతరం పరారీ
మద్యం మత్తులో ఐదుగురు నిందితులు
మృతురాలిపై లైంగికదాడి జరగలేదని ప్రాథమిక పోస్టుమారం నివేదిక
స్పెషల్ కమిషనర్ షాలినీసింగ్ సారథ్యంలో విచారణ కమిటీ ఏర్పాటు
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అంజలీసింగ్ కేసులో సంచలన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. స్కూటీపై వెళుతున్న 20ఏళ్ల అంజలి కారుప్రమాదంలో కిలోమీటర్ల మేర ఈడ్చుకుపోవడంతో తల, వెన్నెముక, అంతర్గత అవయవాలు చిధ్రమై ప్రాణాలు కోల్పోయిందని తేలింది. మృతురాలి ప్రాథమిక పోస్టుమార్టం నివేదిక వివరాలను పోలీసులు మంగళవారం వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం అంజలిపై లైంగికదాడి జరగలేదని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాగర్‌ప్రీత్ స్పష్టం చేశారు.

మృతురాలి ప్రైవేట్ పార్ట్‌లో ఎటువంటి గాయాలు లేవని పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. మౌలానా ఆజాద్ వైద్య కళాశాల ఆవరణలో మెడికల్ బోర్డు పర్యవేక్షణలో సోమవారం అంజలి శవపంచనామా నిర్వహించారు. వైద్యనివేదికలో మృతురాలిపై లైంగికదాడి జరగలేదని నిర్ధారణ అయింది. కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని కమిషనర్ సాగర్ వెల్లడించారు. కొత్త సంవత్సరం తొలిరోజు తెల్లవారుజామున అంజలి స్కూటీ కారును ఢీకొట్టినట్లు సీసీటీవీలో రికార్డు అయింది. కారు వెనుకభాగంలో చిక్కుకుపోయిన ఆమెను 12కిలోమీటర్లు రోడ్డుపై ఈడ్చుకువెళ్లడంతో దుర్మరణం చెందింది. ప్రమాదం జరిగినప్పుడు షాక్‌కు గురైన అంజలికి తల, వెన్నెముక ఇతర శరీరభాగాలకు తీవ్రగాయాలవడంతో ప్రాణాలు కోల్పోయిందని ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. కెమికల్ అనాల్సిస్, బయోలాజిక్ శాంపిల్స్ నివేదికల అనంతరం తుది పోస్టుమార్టం నివేదిక వైద్యులు అందజేయనున్నారు.

ప్రమాదం సమయంలో స్కూటీపై అంజలితో మరో యువతి
రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో బాధితురాలు అంజలితోపాటు మరో యువతి ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. వీరిద్దరూ ప్రయాణిస్తున్న స్కూటీ కారును ఢీకొట్టి ప్రమాదం జరిగిన అనంతరం ఆ యువతి భయంతో అక్కడినుంచి పారిపోయిందని పోలీసులు మంగళవారం తెలిపారు. ఆ యువతి అంజలి స్నేహితురాలు నిధిగా పోలీసులు గుర్తించారు. నిధిని పిలిచి సిఆర్‌పిసి 164 ప్రకారం ఆమె స్టేట్‌మెంట్‌ను నమోదుచేసినట్లు సిపి వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న ఫుటేజ్ ప్రకారం అంజలి, నిధి న్యూఇయర్ పార్టీ అనంతరం నుంచి రాత్రి 1.45ఎఎం సమయంలో బయలుదేరారు. బాధితురాలు పింక్ కలర్ టీషర్ట్ ధరించి ఉండగా స్నేహితురాలు ఎరుపురంగు దుస్తులు ధరించింది. తొలుత స్నేహితురాలు సూటీని నడపగా అంజలి వెనుకసీటులో కూర్చుంది. కొంతదూరం ప్రయాణించిన అనంతరం వారు తమ స్థానాలు మార్చుకున్నారు. అంజలి స్కూటీని నడపగా ఆమె స్నేహితురాలు వెనుక కూర్చుంది.

ఈక్రమంలో అంజలి స్కూటీతో కారును ఢీకొట్టిన అనంతరం బయటపడిన స్నేహితురాలు సంఘటన ప్రాంతం నుంచి ధేరిపోయింది. కారు వెనుకభాగంలో స్కూటీ ఇరుక్కుపోవడంతో అంజలి కూడా చిక్కుకుపోయింది. 12కిలోమీటర్లు కారును అంజలిని రోడ్డుపై ఈడ్చుకుపోవడంతో తీవ్రగాయాలతో మరణించింది. మంగళవారం నిందితులను సంఘటన ప్రాంతానికి తీసుకువెళ్లిన పోలీస్ దర్యాప్తు బృందం రీక్రియేట్ చేసి పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఐదుగురు నిందితులు మద్యం మత్తులో ఉన్నారని దర్యాప్తు బృందం వెల్లడించింది.

హోటల్ బయట స్నేహితురాలితో అంజలి వివాదం

రోడ్డు ప్రమాదం జరగక ముందు అంజలి హోటల్ బయట స్నేహితురాలి నిధితో గొడవ జరిగిన సంఘటన తాజాగా  వెలుగులోకి వచ్చింది. ఈమేరకు సీసీటీవీ ఫుటేజ్ మంగళవారం పోలీస్ దర్యాప్తులో వెల్లడైంది. న్యూఇయర్ వేడుకలు జరుపుకున్న హోటల్ బయట అంజలి తన స్నేహితురాలితో గొడవపడినట్లు సిసిటివీలో రికార్డు అయింది. స్కూటీని డ్రైవ్ చేసే విషయంపై అంజలి ఆమె స్నేహితురాలి నిధి మధ్య వివాదం జరిగింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈఘటనకు సంబంధించిన ఫుటేజీని పోలీసులు దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్నారు. ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలో సుల్తాన్‌పురిలో నివసిస్తున్న అంజలి పార్ట్‌టైం ఉద్యోగం చేస్తుంది.

డిసెంబర్ 31అర్ధరాత్రి కొత్త సంవత్సరం వేడుకల తర్వాత నగ్నంగా పడిఉన్న అంజలి మృతదేహాన్ని కంఝావాలా రోడ్డుపై పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను హత్యానేరంతోపాటు పలు సెక్షన్‌ల ప్రకారం పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితులు దీపక్‌ఖాన్నా అమిత్‌ఖన్నా క్రిషన్ మిథున్ మనోజ్ మిత్తల్‌ను సోమవారమే మూడు రోజుల పోలీస్ కస్టడీకి తరలించారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో భాగంగా కమిషనర్ షాలినీసింగ్ నేతృత్వంలో విచారణ కమిటీని ఢిల్లీ పోలీసులు ఏర్పాటు చేశారు. విచారణ నివేదికను వీలైనంత త్వరగా అందజేయాలని కమిషనర్ షాలినీసింగ్‌ను పోలీస్ ఉన్నతాధికారులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News