Friday, April 26, 2024

సన్‌రైజర్స్ ది ‘పాత కథే’!

- Advertisement -
- Advertisement -

Delhi's solid win over Hyderabad

సత్తా చాటిన బౌలర్లు, రాణించిన ధావన్, అయ్యర్, రిషబ్ మెరుపులు
హైదరాబాద్‌పై ఢిల్లీ ఘన విజయం

దుబాయి: ఐపిఎల్ రెండో దశలోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట తీరు మారలేదు. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ పరాజయం పాలైంది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఢిల్లీ తన ఖాతాలో ఏడో విజయాన్ని జమచేసుకుంది. బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆశించిన స్థాయిలో ఆరంభం దక్కలేదు. ఓపెనర్ పార్థివ్ పటేల్ రెండు ఫోర్లతో 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

ఆదుకున్న ధావన్, అయ్యర్

ఈ దశల ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను మరో ఓపెనర్ శిఖర్ ధావన్ తనపై వేసుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ధావన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ స్కోరు వేగం తగ్గకుండా చూశాడు. ఈ జోడీని విడగొట్టేందుకు హైదరాబాద్ బౌలర్లు త్రీవంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన ధావన్ ఆరు ఫోర్లు, ఒక సిక్స్‌తో 42 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో రెండో వికెట్‌కు 52 పరుగులు జోడించాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. అయ్యర్ కూడా జోరును పెంచాడు. ఇద్దరు చెలరేగి పోవడంతో ఢిల్లీమరో 13 బంతులు మిగిలివుండగానే విజయాన్ని అందుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ 41 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 47 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన పంత్ 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 21 బంతుల్లోనే అజేయంగా 35 పరుగులు చేశాడు. దీంతో రెండో దశను ఢిల్లీ గెలుపుతో ఆరంభించింది. ఈ విజయంతో ఢిల్లీ ప్లేఆఫ్‌కు మరింత చేరువైంది. ఓటమితో హైదరాబాద్ ప్లేఆఫ్ ఆశలకు దాదాపు తెరపడిందనే చెప్పాలి.

ఆరంభం నుంచే..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్‌కు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. వార్నర్ ఇన్నింగ్స్ మూడో బంతికే పెవిలియన్ చేరాడు. అప్పటికీ సన్‌రైజర్స్ ఖాతానే తెరవలేదు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన మరో ఓపెనర్ సాహా కూడా నిరాశ పరిచాడు. 18 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక కెప్టెన్ విలియమ్సన్ కూడా జట్టును ఆదుకోలేక పోయాడు. అతను 18 పరుగుల స్కోరు వద్ద వెనుదిరిగాడు. మనీష్ పాండే (17), కేదార్ జాదవ్ (3) కూడా విఫలమయ్యారు. అబ్దుల్ సమద్ (28), రషీద్ ఖాన్ (22) కాస్త రాణించడంతో హైదరాబాద్ ఆ మాత్రమైన స్కోరును సాధించ గలిగింది. ఢిల్లీ బౌలర్లలో రబడా మూడు, నోర్జె, అక్షర్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News