Monday, May 6, 2024

ఓట్ల వేటలో విలువలు పతనం

- Advertisement -
- Advertisement -

కర్నాటకలో ఆరు గ్యారంటీలు ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ‘మోడీ గ్యారంటీ’ అంటూ బిజెపి ప్రచారం చేపట్టింది. ఈ ఎన్నికలలో 400 సీట్లతో తిరుగులేని విజయం సాధించాలని బిజెపి పట్టుదలతో కృషి చేస్తున్నట్లుంది. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న కీలక అంశాలను ప్రస్తావించకుండా కేవలం మోడీ నాయకత్వం తిరుగులేదని చూపుతూ ఆయన ‘శ్రీరాముడి అవతారం’గా చిత్రీకరించే ప్రయ త్నాలు జరుగుతున్నాయి. బిజెపి ఎన్నికల ప్రణాళికలో ఆయన ఫోటోలు 53 కనిపించడం, ఆయన పేరును 69 సార్లు ప్రస్తావించడం గమనిస్తే పార్టీ పేరును మార్చేశారా? అనే అనుమానాలు కలుగక మానదు.

కొద్ది ఏళ్ళ క్రితం వరకు తమది ‘విలక్షణమైన పార్టీ’ అని బిజెపి నేతలు గర్వంగా చెప్పుకొంటుండేవారు. మిగిలిన పార్టీలు వ్యక్తుల చుట్టూ తిరుగుతూ ఉంటె బిజెపి మాత్రం విధానాలు, దేశభవిష్యత్, ప్రజల శ్రేయస్సు ఆధారంగా నిర్ణయాలు తీసుకొంటుండేది. వ్యక్తులు ఎంతటి గొప్పవారైనప్పటికీ వారికి కొన్ని పరిమితులు ఉండేవి. జనసంఘ్ ఆవిర్భావం నుండి ఆ పార్టీకి ఓ సైద్ధాంతిక భూమిక ఏర్పాటులో కీలక పాత్ర వహించిన బలరాజ్ మథోక్ వంటి నేతలను సైతం ‘గీత దాటారు’ అని బైటకు పంపారు. బిజెపి ఎదుగుదలలో కీలక పాత్ర వహించిన ఎల్‌కె అద్వానీని సైతం పార్టీ అధ్యక్ష పదవి నుండి దించేశారు.చివరకు పార్టీని అందరికి ఆమోదయోగ్యమైన పార్టీగాతీర్చిదిద్దడంలో ముఖ్యమైన పాత్ర వహించిన విశేష ప్రజాదరణ గల వాజపేయి ప్రతిపాదించిన ‘గాంధేయ సామ్యవాదం’ సిద్ధాంతాన్ని వదిలివేశారు.

బిజెపిలో వాజపేయి, అద్వానీ తిరుగులేని నేతలుగా ఉన్న సమయంలో కూడా అంతర్గతంగా కీలక అంశాలపై గంభీరమైన వాదోపవాదాలు జరుగుతూ ఉండెడివి.వారిద్దరూ ప్రతిపాదించిన అంశాలను సైతం కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమ వాదనలు వినిపించుకోగలిగేవారు.కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. హోం మంత్రి అమిత్ షా తాజాగా చెప్పినట్లు ఈ ఎన్నికలు కేవలం మోడీని మూడోసారి ప్రధానిగా ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతున్నాయి. అంతకు ముందు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరంలేదంటూ పరోక్షంగా సంకేతాలిచ్చారు.కేవలం రష్యా, చైనా వంటి కమ్యూనిస్టు దేశాలలో మాత్రమే ఎన్నికలు ఆ విధంగా జరుగుతూ ఉంటాయి. ఎమర్జెన్సీ సమయంలో ‘ఇందిర ఇండియా- ఇండియా ఇందిర’ అని పేర్కొనడం ద్వారా అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు దేవకాంత్ బారువా రాజకీయాలలో వ్యక్తి ఆరాధనను పరాకాష్ఠకు తీసుకెళ్లారు. కానీ నేడు పరిస్థితులు అంతకన్నా దారుణంగా మారుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు బిజెపి విడుదల చేసిన ఎన్నికల ప్రణాళిక ‘సంకల్ప్ పత్ర’ అందుకు అద్దంపడుతుంది.

గత డిసెంబర్‌లో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయం నుండి బిజెపి ఎన్నికల ప్రణాళికలను సైతం ‘మోడీ గ్యారంటీలు’గా పేర్కొంటున్నారు. కర్నాటకలో ఆరు గ్యారంటీలు ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ‘మోడీ గ్యారంటీ’ అంటూ బిజెపి ప్రచారం చేపట్టింది. ఈ ఎన్నికలలో 400 సీట్లతో తిరుగులేని విజయం సాధించాలని బిజెపి పట్టుదలతో కృషి చేస్తున్నట్లుంది. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న కీలక అంశాలను ప్రస్తావించకుండా కేవలం మోడీ నాయకత్వం తిరుగులేదని చూపుతూ ఆయన ‘శ్రీరాముడి అవతారం’గా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బిజెపి ఎన్నికల ప్రణాళికలో ఆయన ఫోటోలు 53 కనిపించడం, ఆయన పేరును 69 సార్లు ప్రస్తావించడం గమనిస్తే పార్టీ పేరును మార్చేశారా? అనే అనుమానాలు కలుగక మానదు. ఇతరులు ఆయనను ఓ గొప్ప నేతగా పేర్కొనడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ స్వయంగా ఆయన కూడా ‘మోడీ ఉన్నారు కాబట్టి దేశం అభివృద్ధి చెందుతుంది.

దేశం భద్రంగా ఉంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు…’ అన్నట్టు మాట్లాడుతున్నారు. తమ పార్టీ, ప్రభుత్వం కాకుండా తాను ప్రజలకు భరోసా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి అతీతమైన నేత గా చెప్పుకొనే ధోరణి ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేస్తున్నట్లే కాగలదు.ఎన్నికల ప్రణాళికలో నిర్దుష్టమైన హామీలు, కార్యప్రణాళికలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేయలేదు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రైతుల ఆందోళనలు, చైనా నుండి ఎదురవుతున్న ఆర్థిక దురాక్రమణలు వంటి తీవ్రమైన అంశాలను ప్రస్తావించే సాహసం చేయలేదు.

కేవలం పక్షం రోజుల ముందు నియమించిన ఎన్నికల ప్రణాళిక కమిటీ ఓ ఎన్నికల ప్రసంగం మాదిరిగా ‘సంకల్ప్ పత్ర’ను తయారు చేసినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే అమలులో ఉన్న సంక్షేమ పథకాలను మరింత విస్తృతంగా, మరింత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరే విధంగా అమలు పరుస్తామని, పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపడతామని, ఆయుధాలను దిగుమతి చేసుకొనే స్థాయి నుండి ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకెడుతున్నామని.. ఇటువంటి కొన్ని అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. వీటితో పాటు ఒకే దేశం ఒకే ఎన్నికలు, ఉమ్మడి పౌరస్మృతి అంశాలను కీలకంగా ప్రస్తావించారు.
ఆర్టికల్ 370 రద్దు కావడం, అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి కావడంతో గత దశాబ్దాలుగా బిజెపి ఎన్నికల ప్రణాళికలలో కనిపించే ఈ అంశాలు ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం ఏర్పడలేదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలు మెరుగన్నట్లు పేర్కొనడం మినహా ఆ ప్రాంత సమస్యలను ప్రస్తావించలేదు. కొద్ది రోజుల క్రితమే జమ్మూ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, తిరిగి రాష్ట్ర హోదా లభిస్తుందని ప్రకటించారు. కనీసం ఆ అంశాలను ఇప్పుడు ప్రస్తావించే ప్రయత్నం చేయలేదు. 2019 ఎన్నికల ప్రణాళికలో దశాబ్దాల క్రితం ఉగ్రవాదం కారణంగా ప్రాణభయంతో ఇక్కడి నుండి పారిపోయిన కశ్మీరీ పండితులు తిరిగి గౌరవంగా వచ్చి, స్థిర నివాసం ఏర్పాటు చేసుకొనే విధంగా చూస్తామని బిజెపి హామీ ఇచ్చింది.

ఇప్పుడు ఆ హామీకి తిలోదకాలిచ్చారు. కనీసం కశ్మీర్ లోయలో ప్రాణభయంతో ఉన్న కొద్ది మంది కశ్మీరీ పండితులలో స్థైర్యం నింపే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. రెండేళ్లుగా తమ సమస్యలు చెప్పుకునేందుకు గవర్నర్‌ను కలిసేందుకు ప్రయత్నం చేస్తుంటే వారికి అవకాశం కలగడం లేదు. అదే విధంగా పశ్చిమ పాకిస్తాన్, ఆక్రమిత కశ్మీర్ వంటి ప్రాంతాలనుండి వచ్చే వారి పునరావాసం కోసం ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ఇస్తామని 2019 ప్యాకేజీలో ఇచ్చిన హామీని ఇప్పుడు ప్రస్తావించలేదు. ఈశాన్య రాష్ట్రాల్లో అక్రమ వలసలను అరికట్టేందుకు జాతీయ పౌరసత్వ రిజిస్టర్ తయారు చేస్తామని 2019లో చేసిన హామీ గురించి ఇప్పుడు కనీసం ప్రస్తావించలేదు. ఈ విషయమై మాట్లాడేందుకు కూడా బిజెపి నేతలు ఎవ్వరూ సిద్ధపడటం లేదు. పైగా, ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలలో ‘శాంతియుత పరిస్థితులు నెలకొల్పడం’, రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలు పరిష్కరించడం, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని దశలవారీగా ఉపసంహరించడం వంటి కొత్త అంశాలను ప్రస్తావించారు.

2019 ఎన్నికల ప్రణాళికలో 2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. తాజా ఎన్నికల ప్రణాళికలో కనీసం ఆ అంశాన్ని ప్రస్తా వించనేలేదు. గత రెండు, మూడేళ్ళుగా రైతుల ఆదాయం గురించి బిజెపి నేతలు ఎవ్వరూ మాట్లాడటం లేదు. కనీసం వారి ఆదాయం ఏమేరకు పెరిగిందో కూడా చెప్పే ప్రయత్నం చేయడం లేదు. వీలయినంతగా వ్యవసాయ ఉత్పత్తులకు కనీసం మద్దతు ధర పెంచుతామని స్పష్టతలేని హామీ ఇవ్వడం మినహా ఈ విషయమై చట్టబద్ధ్దమైన హామీ కోసం రైతులు చేస్తున్న ఆందోళనల గురించి స్పందన కనిపించడం లేదు.
స్వయంగా ప్రధాన మంత్రి పార్లమెంట్‌లో ఈ విషయమై అధ్యయనం చేసేందుకు ఓ నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సుమారు ఏడాది తర్వాత ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కానీ ఆ కమిటీ ఏమి చేస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఈ విషయమై బిజెపి విధానం ఏమిటో చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు. మొదటి సారి మైనారిటీల గురించి బిజెపి ఎన్నికల ప్రణాళిక మౌనం వహిస్తున్నది. కేవలం, ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయడం ద్వారా అనాగరికమైన ఇటువంటి విధానం అమలు నుండి ముస్లిం మహిళల సాధికారికతకు దోహదం చేశామని మాత్రమే పేర్కొన్నారు.

2019 ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలు (ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పారసీలు వంటివారు) అందరి సాధికారికతకు, గౌరవంతో అభివృద్ధి చెందే విధంగా చేసేందుకు బిజెపి హామీ ఇచ్చింది. ఇప్పుడా ప్రస్తావన లేదు. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో వారి సైద్ధాంతిక భూమికను కాకుండా ఆర్థిక స్తోమతను పరిగణనలోకి తీసుకోవడం ఈ సందర్భంగా ఆందోళన కలిగిస్తుంది. మోడీ మంత్రివర్గంలో నిజాయితీపరులుగా పేరొందిన జనరల్ వికె సింగ్, అశ్విని చౌబే వంటి వారికి తిరిగి సీట్లు ఇవ్వకుండా సామాజికంగా, రాజకీయంగా ఎటువంటి ప్రాతిపదిక లేకుండా సంపన్నులు కావడమే అర్హతలుగా పేరొందిన వారనేకమంది ఇప్పుడు అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.

కనీసం పార్టీలో సభ్యత్వం లేకుండానే పార్టీ సీటు లభించిన తర్వాత మాత్రమే పార్టీ కండువా కప్పుకుంటున్నారు.సైద్ధాంతికంగా నిబద్ధతకు పేరొందిన సుమారు 50 మంది ఆర్థిక పరిస్థితుల కారణంగా సీట్లు పొందలేకపోయారు.అయితే, మిగిలిన పార్టీలలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని చెప్పలేము.ఒక విధంగా ఆయా పార్టీల మద్దతుదారులు సైతం తమ నేతల నుండి పెద్దగా విలువలను ఆశించరు. అయితే, బిజెపి మద్దతుదారులు అందరూ కొన్ని విలువలను, సైద్ధాంతిక నిబద్ధతను ఆశిస్తారు. ఒక విధంగా రాజీలేని ధోరణి అవలంబిస్తారు. వాటికి తిలోదకాలిచ్చే పరిస్థితులను తట్టుకోలేరు.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News