Tuesday, May 14, 2024

2024లో హ్యాట్రిక్ సాధిస్తామన్న ధీమాలో బిజెపి

- Advertisement -
- Advertisement -
లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఐక్యం చేసేందుకు యత్నిస్తున్న కెసిఆర్

న్యూఢిల్లీ: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఎదురుగాలి తగిలినప్పటికీ, మూడోసారీ గెలిచి ‘హ్యాట్రిక్’ సాధిస్తామన్న ధీమాలో బిజెపి ఉంది. దక్షిణాదిలో కర్నాటక రాష్ట్రంలో మాత్రం బిజెపి ఉండింది. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడింది. దాంతో దక్షిణాది నుంచే కనుమరుగైందని చెప్పాలి. కర్నాటకలో బిజెపి అనేకసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ దానికి ఎన్నడూ స్పష్టమైన మెజారిటీ రాలేదు. కుట్రలు, కుతంత్రాలతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దక్షిణాదిలో బిజెపికి కర్నాటక ముఖద్వారంలా పనిచేసింది. తలుపులు తెరిచింది. కానీ అదికాస్తా ఇప్పుడు పోయింది.

ప్రధాని నరేంద్ర మోడీ, పెద్దపెద్ద బిజెపి నాయకులు కర్నాటలో తిరిగి ప్రచారం చేసినప్పటికీ కాషాయ పార్టీ అపజయం పాలయింది. కాంగ్రెస్ 135 సీట్లు గెలిస్తే బిజెపి కేవలం 66 సీట్లే గెలిచింది. ఇది కాంగ్రెస్‌కు ఉత్తేజాన్ని ఇచ్చింది. ఇప్పుడు బిజెపి 2024 లోక్‌సభ ఎన్నికలపై గురిపెట్టింది. మూడోసారి గెలవాలన్న సంకల్పంతో ఉంది. అయితే కాంగ్రెస్, బిజెపిని లోక్‌సభ ఎన్నికల్లో దెబ్బతీయగలదా, లేక చతికిల పడుతుందా అనేది వేచి చూడాలి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ఏ మేరకు బిజెపికి కళ్లెం వేస్తారన్న దానిపైనే కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అయితే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపియే మూడోసారి విజయం సాధిస్తుందని ఢంకా బజాయించి చెబుతున్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ కూడా బిజెపిని సమర్థిస్తున్నారు.

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్లు పాలించారు. సాధించిన ఘనతలు చెప్పుకోడానికి మే 30 నుంచి జూన్ 30 వరకు బిజెపి ప్రచారకార్యక్రమం నిర్వహించనున్నది. కేంద్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని హై కమాండ్‌కు తెలుపాల్సిందిగా బిజెపి అధ్యక్షుడు జెపి. నడ్డా పార్టీ ఎంపీలందరినీ కోరారు. నడ్డా శుక్రవారం ‘కమల మిత్రా’ అనే ప్రచార కార్యక్రమాన్ని ఆరంభించారు. దేశ జనాభాలో సగం ఉన్న మహిళా ఓటర్లను ఆకర్షించాలని ఆయన హితవు పలికారు. ఎలాగైనా బిజెపికి కళ్లెం వేసి కాంగ్రెస్ తిరిగి తన గత వైభవాన్ని సాధించాలన్న తలంపుతో ఉంది.
ఈ ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రతిపక్షాలను ఐక్యం చేసి లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి దక్షిణాదిలోకి చొరబడాలన్న బిజెపి ఎత్తుగడ ‘మిషన్ సౌత్ ఇండియా’కైతే గండి పడింది. కర్నాటక ఎన్నికలు బిజెపికి గట్టి గుణపాఠం అయితే చెప్పాయి. ఇక చూడాల్సింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. కాగా ఫైనల్ మ్యాచ్ మాత్రం 2024 లోక్‌సభ ఎన్నికల్లోనే. ఇప్పటికే బిజెపి, కాంగ్రెస్ అనేక సెమీఫైనల్ మ్యాచ్‌లు ఆడేశాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News