Friday, April 26, 2024

మన్మోహన్ ‘మన్రేగా’యే దిక్కయ్యె

- Advertisement -
- Advertisement -

jan-dhan-yojana,

 

మన్మోహన్ ప్రభుత్వ వైఫల్యానికి సజీవ సాక్ష్యంగా మోడీ చెప్పిన పథకమే ఇప్పుడు నిరుపేదలను ఆదుకునే ఏకైక మార్గంగా మిగిలింది. కరోనా వైరస్ రావడం, దాంతో పాటు లాక్‌డౌన్ విధించడంతో దేశంలో పేదసాదలు ఆకలితో అలమటించే పరిస్థితులు వచ్చాయి. ఆకలితో ప్రజలు ప్రాణాలొదిలే పరిస్థితి చూసిన ప్రభుత్వం మొదటిసారి మార్చిలో కరోనావైరస్ కష్టాలు తగ్గించడానికి ఉద్దీపన ప్రకటించింది. ఇందులో జన్‌ధన్ బ్యాంకు ఖాతాలున్న మహిళల బ్యాంకు ఖాతాలకు ప్రత్యక్ష నగదు బదిలీ కూడా ఉంది.

దేశంలో బ్యాంకు సేవలను విస్తరించడానికి నడిపిన మహోద్యమంలో భాగంగా దేశమంతటా భారీ సంఖ్యలో జన్ ధన్ ఖాతాలు తెరిచారు. మూడు నెలల పాటు నెలకు 500 రూపాయల ఆర్ధిక సహాయం ఈ కరోనా కాలంలో పేద మహిళలకు అందిస్తామన్నారు. ఇందులో ఒకటి రెండు నెలల సహాయం అందించారు కూడా. నెలకు 500 రూపాయల సహాయం అసలు దేనికీ సరిపోదు. కాని ఈ చిన్నపాటి ఆర్ధిక సహాయం కూడా నిరుపేదలకు చాలా పెద్ద సహాయంగా భావించే పరిస్థితులున్నాయి. అయితే చాలా మందికి ఈ సహాయం అందలేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

యేల్ విశ్వవిద్యాలయం, సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకుల ప్రకారం భారతదేశంలో మొత్తం 32 కోట్ల 60 లక్షల మంది నిరుపేద మహిళల్లో కనీసం సగం మందికి ఈ సహాయంలో చేర్చలేదు. ఎందుకంటే, జన్ ధన్ స్కీంలో వారు లేరు. అంటే ప్రభుత్వం ప్రకటించిన ఈ అత్యల్ప సహాయం నెలకు 500 రూపాయల సహాయం విషయంలోను 15 కోట్ల కన్నా ఎక్కువ మంది నిరుపేద మహిళలను చేర్చలేదు. సరే కొందరికైనా ఆర్ధిక సహాయం లభించింది కదా అని సంతృప్తి పడడానికి కూడా లేదు. ఎందుకంటే, ఆర్ధిక సహాయం, ఈ 500 రూపాయలు బ్యాంకు ఖాతాలో పడ్డాయి.

కాని ఆకలికి అలమటిస్తున్న వారి చేతికి దొరకలేదు. జన్‌ధన్ ఖాతాల నుంచి సొమ్మును మైక్రో ఎటిఎంల ద్వారా తీసుకోడానికి
ఆధార్ అనుసంధానం చేసిన చెల్లిం పు లావాదేవీల వ్యవస్థలో ఏప్రిల్ నెలలో 39 శాతం లోపాల వల్ల చెల్లింపులు జరగలేదు. లావాదేవీలు ఫెయిల్ అవ్వడమంటే ఖాతాదారుడికి పెద్ద సమస్య. మరోసారి ప్రయత్నించడాన్ని బ్యాంకులు ఒప్పుకోవు. నగదు ఖాతా నుంచి తరలి పోతుంది. కాని ఖాతాదారుడి చేతికి రాదు. రెండు వారాల తర్వాత మళ్ళీ ఖాతాలోకి వస్తే రావచ్చు. లేకపోతే ఆ డబ్బు కోసం బ్యాంకు చుట్టు తిరగాలి. ప్రస్తుతం సంక్షోభ సమయంలో బీదబిక్కి ఆకలికి చస్తున్న సమయంలో జన్‌ధన్ ఖాతాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా ఇచ్చిన అత్తెసరు ఆర్ధిక సహాయం నిజానికి చాలా మంది చేతికి దొరకనే లేదు. జన్‌ధన్ ఖాతాలు కానీ, ఆధార్ అనుసంధానం చేసిన చెల్లింపులు కాని ఏవీ ఈ సంక్షోభ సమయంలో ఉపయోగపడేవి కావు.

మే 14వ తేదీన టివిలో ప్రైం టైంలో ప్రధాని నరేంద్ర మోడీ కనిపించారు. ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించారు. జన్‌ధన్, ఆధార్, మొబైల్ కాంబినేషన్ గురించి చెప్పారు. అంటే, లక్షలాది మందికి సహాయం అందడం లేదన్నది స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇదే పద్ధతిలో ముందుకు పోతుందని చాలా మందికి అర్థమయ్యింది. కాని, ఇలా ముందుకు వెళ్ళడం వల్ల గానుగ ఎద్దులా గుండ్రంగా తిరగడమే తప్ప ప్రయోజనం ఉండదన్న విషయం త్వరలోనే తెలిసి వచ్చింది.

చివరకు ఆర్ధికమంత్రి నిర్మాలా సీతారామన్ ఆర్ధిక ప్యాకేజీ వివరాలు ప్రకటించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేదా మన్రేగా లేదా మోడీ గారి మాటల్లో మన్మోహన్ ప్రభుత్వ వైఫల్యానికి సజీవ సాక్ష్యం అయిన పథకానికి ఇప్పుడు అదనంగా 40 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ పథకం క్రింద ఏడాదికి 100 రోజులు పని గ్రామీణ కుటుంబాలకు తప్పకుండా ఇస్తారు. పనితో పాటు వేతనం కూడా దొరుకుతుంది. బిజినెస్ స్టాండర్డ్ పత్రిక ప్రకారం ప్రభుత్వం వలస కూలీలకు జన్‌ధన్, ఆధార్, మొబైల్ ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ చేయాలని మొదట భావించింది.

కాని వలస కూలీలను గుర్తించడం, సరయిన వారికే సహాయం అందేలా చూడడం ఇవన్నీ సాధ్యపడేలా లేవని, వైఫల్యం ఎదురవుతుందని భయపడింది. అందువల్ల చివరకు మన్రేగాకే ఈ నిధులు కేటాయించడం తప్పలేదు. కాంగ్రెసు ప్రభుత్వ వైఫల్యానికి సజీవసాక్ష్యంగా మోడీ చెప్పిన పథకాన్ని ఇప్పుడు భుజానెత్తుకోవలసి వచ్చింది. ఈ పథకం ప్రకారం అవసరం ఉన్న వ్యక్తి తన గుర్తింపు తానే ఇస్తాడు. తనకు అవసరం ఉందని చెబుతాడు. అంటే ఇప్పుడు పట్టణ ప్రాంతాలు వదిలి తమ ఊళ్ళకు తరలిపోయిన వేలాది మంది వలసకూలీలు గ్రామీణ ప్రాంతా ల్లో తమకు కూలీ కావాలని అడిగి అక్కడి జాబితాల్లో తమ పేరు రాయించుకోవచ్చు.

మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు మన్రేగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వచ్చినా, మన్రేగాకు నిధుల కేటాయింపు విషయంలో సవతి తల్లి వైఖరి ప్రదర్శించినా ఇప్పుడు ఆ పథకం తప్ప మరొకటి ఉపయోగపడదని గుర్తించి నిధుల కేటాయింపు పెంచడం అభినందించదగిన విషయమే. అయితే ఇచ్చిన కేటాయింపులు చాలవు. నిజానికి మన్రేగా పట్ల సవతి తల్లి వైఖరి చూపకుండా, తగిన విధంగా నిధులు కేటాయిస్తూ వచ్చినట్లయితే, ఇప్పుడు అదనంగా ఇస్తున్నామని చెబుతున్నా ఈ 40 వేల కోట్ల రూపాయల నిధులు రెగ్యులర్ కేటాయింపుల్లోనే వచ్చి ఉండేవి.

పీపుల్స్ యాక్షన్ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ గ్రూప్ తెలియజేసింది. కాబట్టి మన్రేగాకు ఇప్పుడు ఇచ్చిన కేటాయింపులు రెట్టింపు చేయాలని కోరింది. ఎందుకంటే లాక్ డౌన్ తర్వాత చాలా మంది ఆర్ధికంగా చితికిపోయారు. పరిస్థితి చాలా దారుణంగా ఉందిప్పుడు. ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ప్రతి వ్యక్తికి 200 రోజుల పని కల్పించాలని, జాబ్ కార్డుల రిజిస్ట్రేషన్లు త్వరితంగా జరగాలని, చెల్లింపులు వెంటనే జరగాలని డిమాండ్ చేశారు.

మన్రేగా చెల్లింపులు కూడా లోపాలకుప్పలైన ఆధార్ అనుసంధానిత ఖాతాల ద్వారా జరిగేదయితే సమస్య మరింత జటిలమవుతుంది. కాబట్టి ఇతర చెల్లింపు మార్గాలను కూడా ప్రభుత్వం అన్వేషించాలి. అవసరమైతే నగదు చేతికివ్వడాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే, కష్టకాలంలో, కష్టపడిన ప్రజలకు వెంటనే సొమ్ము చేతికి అందడం ముఖ్యం. గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగానే ఇప్పుడు పట్టణ ఉపాధి హామీ పథకం కూడా అవసరమని ఈ సంస్థ తెలియజేసింది. చాలా మంది స్వచ్ఛంద కార్యకర్తలు, మేధావులు కూడా ఇదే అభిప్రాయం ప్రకటించారు.

Direct cash transfer best way to help poor in Corona crisis

* రోహన్ వెంకటరామకృష్ణన్ (స్క్రోల్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News