Friday, April 26, 2024

కార్మికుల మందులు మోరీల పాలు..

- Advertisement -
- Advertisement -
Dispensary staff disposing of outdated medicines

 

కాలం చెల్లిన మెడిసిన్స్‌ను కాల్వల్లో పోస్తున్న డిస్పెన్సరీ సిబ్బంది
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సదాశివపేట్ ఘటన
రాష్ట్ర వ్యాప్తంగా అనేక డిస్పెన్సరీల్లో ఇదే పరిస్థితి
మందులు లేక ఇబ్బందులు పడుతున్న రోగులు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇఎస్‌ఐ మందుల కుంభకోణం మరువకముందే, తాజాగా మరో విస్తుపోయే అంశం తెరపైకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక డిస్పెన్సరీల్లో భారీ మొత్తంలో మందులు కాలం చెల్లినట్లు సమాచారం. దీంతో వాటిని డిస్పెన్సరీల్లో పనిచేసే సిబ్బంది నేరుగా మోరీలలో నింపుతున్నారు. ఈ తతాంగమంతా అధికారుల ఆధ్వర్యంలోనే జరుగుతుండటం ఆశ్చర్యకరం. అసలే ఇఎస్‌ఐ కార్మికులకు మందుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. కానీ వారికి పంపిణి చేసే మందులు గడువు ముగియడంపై తాజాగా సంచలనం రేకెత్తిస్తుంది. డిస్పెన్సరీల్లో మెడిసిన్స్ ఎలా ఎక్సైరీ అయ్యాయని పలువురిలో సందేహాలు నెలకొంటున్నాయి. గత మూడు నాలుగు నెలలుగా కొన్ని డిస్పెన్సరీల్లో బిపి, షుగర్ ట్యాబ్లెట్స్ కూడా లేవని వందల మంది బాధితులను వెనక్కి పంపించారు. కానీ ఇంత భారీ మొత్తంలో మందులు ఎలా ఎక్సైరీ అయ్యాయి? అని కార్మికులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.

వాస్తవంగా ప్రతి డిస్పెన్సరీల్లో రోగులకుA అవసర నిమిత్తం మాత్రమే మందులు కొనుగోళ్లు జరపాలని నిబంధనలు ఉన్నాయి. దీనిపై మెడికల్ ఇంచార్జీ ఒక ఇండెంట్ తయారు చేసి కంపెనీల నుంచి మందులు కొనుగోళ్లు చేయాలి. కానీ ఒక్క సారిగా ఇంత భారీ మొత్తంలో మందులు గడువుముగియడంతో అధికారులపై అనేక అనుమానాలు తలేత్తుత్తున్నాయి. ప్రస్తుతం కాలం చెల్లిన మందులు ఎక్కడ్నుంచి వచ్చాయన్నది ఇప్పుడు ప్రశ్నర్థకంగా మారింది. ఇదిలా ఉండగా, మరోవైపు ఈ కాలం చెల్లిన మెడిసిన్స్‌ను నేరుగా మురికి కాల్వల్లో పోస్తుండటంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఘటనే సదాశివపేట్ డిస్పెన్సరీలో జరిగింది. డేట్ ముగిసిన మందులను మోరీలలోకి నేరుగా పోస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కడ పనిచేసే సిబ్బంది నేరుగా మురుగు నాలల్లో పోస్తుండంతో స్థానికులు అభ్యతరం వ్యక్తం చేసి నా, డిస్పెన్సరీ ఇంచార్జీ పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా మందులు స్టోర్ రూం వద్ద ఉన్న మురికి నాలల్లో పోస్తుండటంతో రోగులతో పాటు ఆ చుట్టు పక్కల నివసించే వారికి గాఢ తీవ్రత కలిగిన రసాయనాల దుర్గంధం వెదజల్లుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇఎస్‌ఐలో పరిస్థితి ఇదీ

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏడాది ఇఎస్‌ఐ కార్మికుల కోసం ప్రభుత్వం సుమారు 450 నుంచి 500 కోట్లు ఖర్చుపెడుతుండగా, దీనిలో 150 నుంచి 200 కోట్లు కేవలం మందులు కోసం వెచ్చిస్తున్నారు. అయితే ప్రస్తుతం డిస్పెన్సరీల్లో మందులు డేట్ అయిపోతుండటంతో ఈ డబ్బుంతా వృథా అవుతుంది. కార్మికుల కష్టార్జితం మట్టిపాలవుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17 లక్షల మంది ఇఎస్‌ఐ కార్డ్ హోల్డర్స్ ఉండగా, వీరి కుటుంబ సభ్యులను కూడా కలిపితే దాదాపు 60 లక్షలకు పైగా ఉంటారు. వీరంతా నిత్యం ఇఎస్‌ఐ కార్డు ద్వారా వైద్యం చేపించుకుంటారు. దీంతో పాటు సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 77 డిస్పెన్సరీల్లో మందులు తీసుకుంటారు. కానీ ప్రస్తుతం కొన్ని డిస్పెన్సరీల్లో మందులు కొరత ఉంటే, మరి కొన్నింటిలో గడువుముగియడం గమనార్హం. మరోవైపు గత కొన్ని రోజులుగా ఇఎస్‌ఐ ఆసుపత్రుల్లో టెస్టులు కూడా చేయడం లేదనే అరోపణలూ ఉన్నాయి.

గతంలో జరిగిన కుంభకోణానికి, ఈ మందులకు సంబంధం ఉందా..?

రాష్ట్ర వ్యాప్తంగా ఇఎస్‌ఐలో గతంలో జరిగిన మందుల కుంభకోణానికి ఈ కాలం చెల్లిన మందులకు లింక్ ఉన్నట్లు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ఇఎస్‌ఐ డిస్పెన్సరీల్లో ప్రతి మూడు నెలలకు ఒక సారి ఇండెంట్ పెట్టాలి. అవసరమైన మందులు తీసుకోవాలి. కానీ సదాశివపేట్ డిస్పెన్సరీలో సెప్టెంబర్ 19 కే కాలం చెల్లినట్లు తెలుస్తోంది. అయితే రోగులు ఇవ్వకుండా ఇన్ని రోజులు ఎందుకు స్టాక్ పెట్టారో తెలియడం లేదు. ఇక్కడే పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కొందరు అధికారులు ఫ్మార్మా కంపెనీలతో కుమ్మక్కై కేవలం రెండు నెలల వ్యాలిడిటీతో గతంలో మందులు కొనుగోళ్లు చేశారని, దీంతోనే అవి ప్రస్తుతం మురిగిపోయాయని కార్మిక నాయకులు అభిప్రాయపడుతున్నారు.

అంతేగాక ఈ మోరీలలో పోసిన మందులు కూడా రికార్డులలో రోగులకు ఇచ్చినట్లు రాస్తరని రాష్ట్ర కార్మిక నేతలో ఒకరు వ్యాఖ్యానించారు. ఈ ఎక్సైరీ మందులు గతంలో జరిగిన స్కాంలో బాగంగానే వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. పేద కార్మికులు పొట్ట కొడుతూ కంపెనీల లాభాల కోసం అధికారులు పనిచేయడం విస్మయానికి గురిచేస్తుందని ఆయన అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డిస్పెన్సరీల్లో జరుగుతున్న మోసాలను గ్రహించి చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News