Friday, April 26, 2024

యూఎస్ ఓపెన్ విజేత థిమ్

- Advertisement -
- Advertisement -

యూఎస్ ఓపెన్ విజేత థిమ్
ఓపెన్ ఫైనల్లో జ్వరేవ్ ఓటమి, చరిత్ర సృష్టించిన డొమినిక్

Dominic Thiem win US Open 2020 Title

న్యూయార్క్: ప్రతిష్టాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆస్ట్రియా సంచలనం, రెండో సీడ్ డొమినిక్ థిమ్ టైటిల్‌ను సాధించాడు. హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ సమరంలో థిమ్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. ఐదు సెట్ల పోరలో థిమ్ 26, 46, 64, 63, 76 తేడాతో విజయం సాధించాడు. తొలి రెండు సెట్లలో గెలిచిన జ్వరేవ్ ఆ తర్వాత చేజేతులా ఓటమిని కొని తెచ్చుకున్నాడు. మరోవైపు అసాధారణ పోరాట పటిమను కనబరిచిన థిమ్ చివరి మూడు సెట్లను గెలిచి చాంపియన్‌గా అవతరించాడు. కరోనా నేపథ్యంలో ఈసారి యూఎస్ ప్రతి ఆటగాడికి కీలకంగా మారింది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్‌పై టోర్నీ మధ్యలో అనూహ్య వేటు పడడంతో థిమ్ పని మరింత సులువుగా మారింది. ఊహించినట్టే అద్భుత ఆటతో అలరించిన థిమ్ తన ఖాతాలో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను జత చేసుకున్నాడు. అంతేగాక యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన తొలి ఆస్ట్రియా ఆటగాడిగా థిమ్ చరిత్ర సృష్టించాడు. మూడు సార్లు గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో ఓటమి పాలైన థిమ్ నాలుగో ప్రయత్నంలో విజేతగా నిలిచాడు. మరోవైపు జర్మనీ స్టార్ జ్వరేవ్ అసాధారణ పోరాట పటిమను కనబరిచినా రన్నరప్‌తోనే సరిపెట్టుకోక తప్పలేదు. ఇంతకుముందు మహిళల సింగిల్స్‌లో జపాన్ స్టార్ నవోమి ఒసాకా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
ఆరంభంలో జ్వరేవ్ జోరు
ఫైనల్ సమరం ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగింది. తొలి సెట్‌లో జ్వరేవ్ ఆధిపత్యం చెలాయించాడు. అద్భుత షాట్లతో థిమ్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. చూడచక్కని షాట్లతో అలరించిన జ్వరేవ్ గేమ్‌పై పట్టు సాధించాడు. మరోవైపు థిమ్ ఒత్తిడికి గురై వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన జ్వరేవ్ అలవోకగా సెట్‌ను దక్కించుకున్నాడు. తర్వాతి సెట్‌లో కూడా జ్వరేవ్ జోరును కొనసాగించాడు. థిమ్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ ముందుకు సాగాడు. అయితే మధ్యలో థిమ్ పుంజుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరి వరకు దూకుడును ప్రదర్శించిన జ్వరేవ్ 64తో సెట్‌ను గెలుచుకున్నాడు.
థిమ్ జోరు
వరుసగా రెండు సెట్లు ఓడినా థిమ్ ఒత్తిడికి గురి కాలేదు. మూడో సెట్‌లో అసాధారణ పోరాట పటిమతో చెలరేగి పోయాడు. జ్వరేవ్ కూడా పట్టు కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. అనూహ్యంగా పుంజుకున్న థిమ్ మూడో సెట్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. ఆ తర్వాత థిమ్ మళ్లీ వెనుదిరిగి చూడలేదు. నాలుగో సెట్‌లో మరింత చెలరేగి ఆడాడు. జ్వరేవ్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా లక్షం దిశగా అడుగులు వేశాడు. మరోవైపు జ్వరేవ్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఒత్తిడికి తట్టుకోలేక వరుస తప్పిదాలు చేశాడు. దీన్ని అవకాశంగా తీసుకున్న థిమ్ అలవోకగా నాలుగో సెట్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇక, ఫలితాన్ని తేల్చే ఐదో సెట్‌లో పోరు మళ్లీ ఆసక్తికరంగా సాగింది. ఇటు థిమ్ అటు జ్వరేవ్ అసాధారణ పోరాటంతో ముందుకు వెళ్లారు. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లక తప్పలేదు. ఇందులో చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడు కోవడంలో సఫలమైన రెండో సీడ్ థిమ్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి చాంపియన్‌గా అవతరించాడు.
నాలుగో ప్రయత్నంలో సఫలం
ఆస్ట్రియా సంచలనం ఇప్పటి వరకు నాలుగు సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరాడు. ఇందులో రెండు ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలు కాగా ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లోనూ టైటిల్ పోరుకు చేరాడు. అయితే తొలి మూడు సార్లు థిమ్‌కు చుక్కెదురైంది. రెండు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ చేతిలో ఓటమి పాలయ్యాడు. అంతేగాక ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లోనూ ఫైనల్‌కు చేరాడు. ఈసారి సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్ చేతిలో కంగుతిన్నాడు. కానీ, నాలుగో ప్రయత్నంలో టైటిల్ కలను నెరవేర్చుకున్నాడు. తొలి రెండు సెట్లను కోల్పోయినా అసాధారణ పోరాట పటిమతో చివరి మూడు సెట్లు గెలిచి జ్వరేవ్‌ను మట్టి కరిపించి తన ఖాతాలో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను జత చేసుకున్నాడు. మరోవైపు జ్వరేవ్ అద్భుతంగా ఆడినా మరోసారి రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నాడు. తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవాలనే జ్వరేవ్ కల ఈసారి కూడా నెరవేరకుండా పోయింది.

Dominic Thiem win US Open 2020 Title

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News