Monday, April 29, 2024

దుబ్బాక ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

- Advertisement -
- Advertisement -

Dubbaka By- Election 2020

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నిక ఈ నెల 3న జరగనున్న సందర్భంగా ప్రశాంత వాతావరణంలో, సజావుగా జరిగేలా పూర్తి స్థాయి ఏర్పాట్లను చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళికెరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్‌తో కలిసి ఆమె విలేకర్లతో మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల సంఘం సూచించిన ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటరు గుర్తింపుతో పాటు ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల గుర్తింపు కార్డులను అనుమతించడం జరుగుతుందని తెలిపారు.

కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద జాగ్రత్త చర్యలు చేపట్టామని తెలిపారు. ఓటు వేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్ , చేతికి గ్లౌజులను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు, వికలాంగులకు, కరోనా బాధితులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించామని దానిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మొత్తం దుబ్బాక నియోజకవర్గంలో పోలింగ్ కోసం 315 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశామని అందులో 89 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మొత్తం లక్షా 98వేల 807 మంది ఓటర్లు ఉన్నారని అందులో మహిళా ఓటర్లు లక్షా 778 మంది, పురుష ఓటర్లు 97వేల 978 మంది ఉన్నారని తెలిపారు.

దుబ్బాకలో 144 సెక్షన్ అమలు.. సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్

నవంబర్ 1 సాయంత్రం ఆరు గంటల నుంచి 04వ తేదీ వరకు దుబ్బాక నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ తెలిపారు. భద్రత కోసం నాలుగు కంపెనీల కేంద్ర బలగాలు రప్పించామని తెలిపారు. ప్రచారం కోసం ఇతర ప్రాంతాల నుంచి దుబ్బాక కు వచ్చిన వారు వెళ్లిపోవాలని సూచించారు. కేవలం దుబ్బాక నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగిన వారు మాత్రమే ఉండాలని తెలిపారు. ఐదుగురు మించి వ్యక్తులు ఒక దగ్గర గుమిగూడవద్దని సూచించారు. పార్టీ జెండాలు, పార్టీ గుర్తులు , ప్లే కార్డులు ధరించవద్దని, ప్రదర్శించవద్దనిసూచించారు. మైకులు, లౌడ్ స్పీకర్లు, వాడరాదని, పాటలు ఉపన్యాసాలు ఇవ్వకూడదని తెలిపారు. ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, టపాకాయలు కాల్చడం లాంటివి నిర్వహించడం నేరంగా పరిగణించడంతో పాటు సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News