Wednesday, May 1, 2024

భేషజాలు లేవు

- Advertisement -
- Advertisement -

ప్రజల కోసమే మెట్టు దిగాం..రాజకీయాల కోసం కాదు అభివృద్ధి కోసం భవిష్యత్తులోనూ
కేంద్రాన్ని అడుగుతూనే ఉంటాం… సహకరించకపోతే కొట్లాడుతాం
కేంద్రంతో గత ప్రభుత్వం గిల్లికజ్జాలు.. అందుకే పలు ప్రాజెక్టుల్లో జాప్యం

ప్రజల సమస్యలను పక్కనపెట్టిన నాటి పాలకులు
మేం అధికారంలోకి రాగానే కేంద్రంతో మాట్లాడి రక్షణ భూముల సమస్యను పరిష్కరించాం
ఎలివేటెడ్ కారిడార్ భూమిపూజ కార్యక్రమంలో సిఎం రేవంత్‌ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంతో భేషజాలకు వెళ్లమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల అవసరాల కోసమే ఒక మెట్టు దిగానని, రాజకీయాల కోసం కాదని సిఎం తెలిపారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని, అందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు. సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ సమీపంలో రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రేవంత్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిందే కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ దూర దృష్టి నిర్ణయాల వల్లే భాగ్యనగరం అభివృద్ధి చెందిందని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కెటిఆర్ సెల్ఫీలు దిగే శిల్పారామాన్ని ఏర్పాటు చేసింది కూడా కాంగ్రెస్ అని ఆయన అన్నారు. బిఆర్‌ఎస్ హయాంలో హైదరాబాద్‌లో గంజాయి, పబ్బులు, డ్రగ్స్ వచ్చాయని ఆయన ఆరోపించారు. కెసిఆర్ ప్రభుత్వంలో అభివృద్ధి ఏమీ జరగలేదని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రజల అవసరాలను మర్చిపోయిందని ఆయన దుయ్యబట్టారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణం గా అభివృద్ధి చేస్తామని రేవంత్ పేర్కొన్నారు. రెండో దశలో 75 కి.మీల మెట్రో విస్తరణ చేపట్టబోతున్నామని ఆయన వివరించారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేస్తామని, ఎన్నికలయ్యాక రాష్ట్ర అభివృద్దే తమ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ధర్నాచౌక్‌లో బిఆర్‌ఎస్ ధర్నా చేపట్టాలని, ఆ ధర్నాకు కాంగ్రెస్ పూర్తిగా సహకరిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నగర అభివృద్ధి కోసం ఇందిరా పార్కు వద్ద కెటిఆర్ ఆమరణ దీక్ష చేయాని, కెటిఆర్ చచ్చుడో అభివృద్ధికి నిధులు వచ్చుడో తేలే వరకు దీక్ష చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కెటిఆర్ దీక్షకు దిగితే మా కార్యకర్తలే ఆయన్ను కంచె వేసి కాపాడుతారని సిఎం తెలిపారు. కెటిఆర్ తన తండ్రిని స్పూర్తిగా తీసుకొని ఆమరణ నిరహార దీక్ష చేయాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు.
కేంద్రంతో గత ప్రభుత్వం గిల్లికజ్జాలు
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకొని ప్రజల సమస్యలను పక్కన పెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం కృషి చేశామన్నారు. చాంద్రాయణగుట్ట రక్షణ భూముల విషయంలో లీజ్ రెన్యువల్ చేయకుండా, గత ప్రభుత్వం కేంద్రంతో సఖ్యత పాటించలేదని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించామన్నారు. రక్షణ శాఖకు ఇవ్వవలసిన భూములను ఇచ్చామని, రాజకీయాలకు తావు లేకుండా చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంతో గత ప్రభుత్వ వివాదం వల్ల ఈ ప్రాజెక్టును పక్కనబెట్టారని అన్నారు
రైతులు కరువు పరిస్థితులను ఎదుర్కోవాలి
ఎంపిగా ఉన్న సమయంలో రాజీవ్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాధాన్యతను కేంద్రానికి వివరించామని సిఎం రేవంత్ తెలిపారు. రాష్ట్ర-, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణాత్మక వైఖరి ఉంటే ప్రజలకే నష్టం జరుగుతుందన్నారు. రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం రక్షణ శాఖ భూములను అప్పగించిందన్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధి జరగాలంటే రాజీవ్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తవ్వాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను కలిసి ఎదుర్కొవాలని రైతులకు సిఎం పిలుపునిచ్చారు.
రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం
రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తామని సిఎం తెలిపారు. తమ పోరాటం ఫలించిందని కెటిఆర్ అంటున్నాడని, ఆయన ఏం పోరాటం చేశారో చెప్పాలని సిఎం రేవంత్ ప్రశ్నించారు. ట్విట్టర్‌లో పోస్టులు పెట్టుడా అంటూ సిఎం రేవంత్ ఎద్దేవా చేశారు. మేము అనుమతులు తీసుకొస్తే ఆయన పోరాటం అని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు.
ఎలివేటెడ్ కారిడార్‌లోని ముఖ్యాంశాలు…
కారిడార్ మార్గం: ప్యార్డైజ్ జంక్షన్ వెస్ట్ మారేడ్‌పల్లి, కార్ఖానా,- తిరుమలగిరి,-బొల్లారం-, అల్వాల్-, హకీంపేట్, తూంకుంట- ఓఆర్‌ఆర్ జంక్షన్, (శామీర్‌పేట్).
మొత్తం కారిడార్ పొడవు: 18.10 కి.మీ.లు
ఎలివేటెడ్ కారిడార్ పొడవు: 11.12 కి.మీ.
అండర్ గ్రౌండ్ టన్నెల్: 0.3 కి.మీ.
ఫియర్స్: 287
అవసరమైన భూమి: 197.20 ఎకరాలు
రక్షణశాఖ భూమి: 113.48 ఎకరాలు
ప్రైవేటు ల్యాండ్: 83.72 ఎకరాలు
ప్రాజెక్టు వ్యయం: రూ.2,232 కోట్లు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News