Monday, May 6, 2024

పాపం, రైతు!

- Advertisement -
- Advertisement -

శాసన సభ ఎన్నికల పోలింగ్ నాలుగు రోజులు వుందనగా రాష్ట్రంలోని రైతాంగానికి సంబంధించిన ఒక కీలక అంశం వివాదాస్పదమైంది. రబీ పంట కాలపు రైతుబంధు డబ్బు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి గత వారం పచ్చ జెండా ఊపిన ఎన్నికల సంఘం 27వ తేదీ సోమవారం నాడు దానిని వెనక్కు తీసుకొంది. ఎన్నికల ప్రచారం తుది దశలో వుండగా చోటు చేసుకొన్న ఈ పరిణామం సహజంగానే ప్రధాన రాజకీయ పక్షాల మధ్య వాడి విమర్శలకు దారి తీసింది. తాను రైతులకు మేలు చేయబోతే కాంగ్రెస్ పార్టీ అడ్డం పడిందని పాలక బిఆర్‌ఎస్ ఆరోపించింది. రైతుబంధును కాంగ్రెస్ ఆపివేయించిందని అది విమర్శించింది. రైతుబంధు చెల్లింపును ఎన్నికల ప్రచారంలో వాడుకోకుండా చూడాలని మాత్రమే ఇసికి తాము విజ్ఞప్తి చేశామని, దానిని ఆపాలని కోరలేదని కాంగ్రెస్ నాయకులు వివరణ ఇచ్చారు. ఏమైతేనేమి రాష్ట్రంలోని లక్షలాది రైతులకు ఈ రబీ పంట సమయంలో అక్కరకు వచ్చి వుండవలసిన రైతుబంధు చెల్లింపు ఆగిపోయింది. ఈ పథకం కొత్తగా ఇప్పుడు మొదలవుతున్నది కాదు. రైతులకు వ్యవసాయ పెట్టుబడి కింద ఉపయోగపడాలనే ఉద్దేశంతో 2018 ఖరీఫ్ సీజన్‌లో ఇది శ్రీకారం చుట్టుకొన్నది.

ఎకరాకు రూ. 5000 వంతున వానా కాల పంటకు (ఖరీఫ్) ముందు ఒకసారి, యాసంగి పంట (రబీ) కు ముందు మరోసారి రైతులకు నగదు చెల్లింపు చేయాలని నిర్ణయం తీసుకొని దీనిని అమల్లోకి తెచ్చారు. మొదటి సంవత్సరం ఈ పథకం కింద రూ. 12 వేల కోట్లను ప్రభుత్వం రైతులకు చెల్లించింది. రాష్ట్రంలో గల 65 లక్షల మంది రైతులకు దీనిని చెల్లిస్తున్నారు. ఇంత వరకు 10 సార్లు జరిగిన ఈ చెల్లింపుల కింద ప్రభుత్వం రూ. 72 వేల కోట్లను రైతులకు అందజేసింది. ఆ రకంగా రైతుబంధు పూర్వం నుంచి అమల్లో వున్న పథకమే. అందుచేత దాని చెల్లింపులకు ఎన్నికలు అవరోధం కావలసిన పని లేదు. బహుశా ఈ దృష్టితోనే ఇసి తొలుత పథకం చెల్లింపులకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో రైతాంగ కష్టాలకు, కన్నీళ్ళకు సుదీర్ఘ చరిత్ర వుంది. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోడం వల్ల రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి, వున్నదీ లేనిదీ తాకట్టు పెట్టి పంట పెట్టుబడిని సమకూర్చుకొనేవారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పంట నష్టపోతే అప్పు, వడ్డీ కింద ఆస్తులను వదులుకోవలసిన దుస్థితి. ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు రైతులకు మేలు చేసిన వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు.

ఈ ఎన్నికల్లో పాలక బిఆర్‌ఎస్‌తో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇటువంటి పథకాన్నే తన మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది. దీనిని బట్టి రైతుబంధుకున్న ప్రాధాన్యం వెల్లడవుతున్నది. ప్రధాన మంత్రి కిసాన్ పథకం కింద రైతులకు ఇటీవలనే ఎకరాకు రూ. 2000 వంతున నగదు సాయాన్ని అందించారు. అది వారి ఖాతాల్లో పడింది. దానికి లేని అభ్యంతరం రైతుబంధు విషయంలో ఎందుకు తలెత్తింది అనేది కీలకమైన ప్రశ్న. ప్రధాని పథకం దేశమంతటికీ వర్తించేది అయినప్పటికీ ఎన్నికల రాష్ట్రాల్లో కూడా దాని చెల్లింపులు జరిగాయి కదా! రైతు బంధు కొలబద్దతో కొలిచినప్పుడు ఆ పథకం కింద కూడా చెల్లింపులు జరిపి వుండకుండా వుండాల్సింది. ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చినందున రైతుబంధు నగదును త్వరలో చెల్లిస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రకటించారని, అందుకే ఇసి దానిని ఆపివేసిందని కొన్ని వార్తలు చెబుతున్నాయి. సోమవారం నాడు ఉదయం టిఫిన్లు చేసేలోగానే మీ ఖాతాల్లో రైతుబంధు నగదు పడుతుందని హరీశ్ రావు రైతులను ఉద్దేశించి ప్రకటించారని, అదే చెల్లింపు ఉత్తర్వుల నిలిపివేతకు దారి తీసిందని అంటున్నారు. రాష్ట్రంలో ఇటీవల పడిన వర్షాలు రబీ పంటలకు అనువైన వాతావరణాన్ని సృష్టించాయి. ఈ సమయంలో రైతు చేతికి నగదు అందితే అది ఎంతో ఉపయోగకరం అవుతుంది.

ఇసి రైతుబంధు చెల్లింపులను నిలిపివేసినందున రైతు నోటి వద్దకు వచ్చిన కూడు ఆగిపోయినట్టయింది. మొదటే అనుమతి ఇచ్చి వుండకపోతే వేరు మాట. అనుమతి ఇచ్చి దానిని వెనక్కు తీసుకోడం ఆశ కలిగించి నిరాశకు గురి చేసినట్టయింది. ఎన్నికల కమిషన్ స్థాయిలో ఇటువంటి తడబాట్లు, పొరపాట్లు సంభవించకుండా వుంటే బావుండేది. రాజ్యాంగ సంస్థలు ఆచితూచి అడుగు వేసినప్పుడే దేశంలో రాజ్యాంగ పాలనకు మేలు కలుగుతుంది. రైతుబంధు ఖ్యాతి ఇదివరకే బిఆర్‌ఎస్ ఖాతాలో చేరిపోయింది. ఈ చెల్లింపులు ఇప్పుడు జరిగినందు వల్ల కొత్తగా దానికి కలిగే ప్రయోజనమేమీ వుండదు. కాకపోతే రాజకీయం ముదిరి జనహితానికి కీడు జరుగుతున్నది. అంతిమంగా రైతు నష్టపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News