Sunday, April 28, 2024

ఏది నీతి, ఏది అవినీతి!

- Advertisement -
- Advertisement -

స్వతంత్ర రాజ్యాంగ సంస్థలుగా ఉండాల్సిన సిబిఐ, ఇడి, ఐటి సంస్థల దాడులు, కేసులు విచారణ, అరెస్టు లు, పని విధానం ప్రస్తుతం సంచలనం కలిగిస్తున్నాయి. నిజంగానే ఈ సంస్థలు అవినీతి రాజకీయ నాయకుల భరతం పడుతున్నాయా? లేక అధికార బిజెపి పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారి ప్రత్యర్థులపై కేసులు మోపి వేధిస్తున్నాయా? అనే అనుమానాలు ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నాయి. మన దాయాది దేశం పాకిస్థాన్‌లో పరిపాలన చేసిన మాజీ ప్రధానులు అధికారం కోల్పోయిన తర్వాత దేశం విడిచి పారిపోవడమో, జైలు ఊచలు లెక్కించడమో, లేక దారుణమైన హత్యలకు గురికావడమో జరుగుతుంది.ఇదే మనకు ఆశ్చర్యం కలిగించే అంశం అయితే. అంతకంటే మనం ఓ అడుగు ముందుకేసి రాజ్యాంగ సంస్థలు అధికారం కనుసన్నల్లో నడిపి రాజకీయ స్థిరత్వానికి పనిముట్టుగా వాడుకుంటున్నారా? ప్రత్యర్థులపై దాడులకు వినియోగిస్తున్నారా? అన్న అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయి.

ప్రధానిగా మోడీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత రాజ్యాంగ సంస్థలైన సిబిఐ, ఇడి, ఐటి దాడులు ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై నిత్యకృత్యమయ్యాయి. అంతేకాదుచివరకు, న్యాయ వ్యవస్థ, చట్టసభల స్వతంత్రను సైతం అనుమానించేలా కొన్నిసంఘటనలు జరుగుతున్నాయి. దేశంలో చురుకైన ప్రత్యర్థులు అందరిపై సిబిఐ, ఇడి, ఐటి దాడులు, కేసులు నిత్యకృత్యం అయ్యాయి. మోడీ రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత రాజ్యాంగ సంస్థలు ప్రతిపక్షాలపై పెట్టిన కేసుల సంఖ్య పెరిగాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలను బలహీనపరచడానికి, అవినీతి బురద చల్లడానికి ఇదో భయానక, బెదరగొట్టే, చెదరగొట్టే రాజకీయ వ్యూహంగా మారిందన్న విమర్శలు లేకపోలేదు? ఇటీవల ఈ విధానం మరింత నగ్నంగా ముందుకొచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రత్యర్థి రాజకీయ పక్షాల ప్రభావిత నేతల్ని ప్రచారానికి దూరం చేయాలన్న వ్యూహం కనిపిస్తుందని, బిజెపిపై ‘ఇండియా’ కూటమి ఆరోపణగా ఉంది? ఇటీవల జరిగిన సంఘటనలే తీసుకుంటే భూకుంభ కోణం పేరుతో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇడి అరెస్టుకు ముందు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడంతో జార్ఖండ్ రాష్ట్రంలో అధికార సంక్షోభం ఏర్పడింది. జార్ఖండ్ ముక్తి మోర్చాను స్థాపించి గిరిజన ఉద్యమం ద్వారా శిబుసోరెన్ స్వతంత్రంగా జార్ఖండ్‌లో అధికారం లోనికి వచ్చారు.

ఆయన కుమారుడే హేమంత్ సోరెన్. కాంగ్రెస్‌తో కలిసి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన హేమంత్ సోరెన్ బిజెపి ప్రత్యర్థిగా ప్రస్తుతం గిరిజన తిరుగుబాటు నేత పేరుతో ఉన్న బిర్షాముండా జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు. ఇక ఇదే బాటలో ఎన్నికల ముందు డిల్లీ సిఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేసే కుట్ర జరుగుతోందని ఆప్ ఆరోపించింది. నిజంగా కేజ్రీవాల్ పరిస్థితిని బిజెపి విచారణ పేరుతో భయానకంగా మార్చింది. అవినీతికి వ్యతిరేక ఉద్యమంలో పుట్టన కేజ్రీవాల్, ఆమ్‌ఆద్మీ పార్టీని పీకల్లోతు అవినీతి కేసుల్లోకి దింపి ఆ పార్టీ రాజకీయ మార్క్‌ను బిజెపి తుడిచివేసిందనే ఆవేదన ఆప్ కార్యకర్తల్లో ఉంది. ఆప్ జాతీయ పార్టీ హోదా పొందడం, పంజాబ్ విజయం తర్వాత ఆప్ పార్టీపైన ఈ రకమైన దాడులు తీవ్రం అయ్యాయనే అనుమానం ఆ పార్టీ నేతలలో ఉంది. ఇంకా చిత్రం ఏమంటే తమ ఎంఎల్‌ఎలను కొనుగోలు చేసి తమ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర జరుగుతోందని ఆరోపించిన కేజ్రీవాల్, విద్యామంత్రి ఆతీశీలపై బిజెపి కేసుపెట్టి కేంద్రం ఆధీనంలోని పోలీసులను ముఖ్యమంత్రిని విచారించేందుకు పంపడం విశేషం.

ఇంతకీ కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్న కేసు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం. ఇదీ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సిఫార్సుల మేరకు సిబిఐ, ఇడి చేపట్టిన కేసులే! వందకోట్ల కుంభకోణం అన్నారే కానీ ఇంత వరకు ఎలాంటి రికవరీలేదు. ఇప్పటికే ఢిల్లీ విద్యా వ్యవస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈ కేసులో ఏడాదిగా విచారణ ఖైదీగా జైలులో ఉన్నారు. దేశానికే తలమానికంగా వైద్యం ప్రజలకు చేరువ చేసిన మోహళ్ళ క్లినిక్ సృష్టి కర్త సత్యేంద్ర జైన్ ఇడి అండర్ ట్రయల్ ఖైదీగా రెండేళ్ళుగా జైలులో మగ్గుతున్నారు. ఇంకా మరీ విచిత్రం ఏమంటే ఆప్ ఎంపి సంజయ్ సింగ్‌కు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేకుండా చార్జిషీట్‌లో తన పేరు ఉచ్ఛరించారని బహిర్గతం చేసిన ఆయనకు సిబిఐ బహిరంగంగా పొరపాటు జరిగింది అని ఒప్పుకొంది. అయితే ఆయన అటు తర్వాత పార్లమెంటులో మోడీ, అమిత్ షా విదానాలు దుయ్యబట్టారు, సస్పెండ్ అయ్యారు.

చివరకు లిక్కర్ కుంభకోణంలో ఉన్న ఓ అప్రూవర్ స్టేట్‌మెంట్ తీసుకుని ఎవరికైతే కేసులో పొరపాటున పేరు ఉచ్ఛరించారని ఒప్పుకున్నారో అదే కేసులో నిజంగానే చేర్చి ప్రస్తుతం విచారణ ఖైదీగా జైలు పాలయ్యారు. ఇక బీహార్‌లో బిబిపికి కొరకరాని కొయ్యగా వున్న లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం దర్యాప్తు సంస్థల వేటలో ఉండనే ఉన్నారు. ఉదాహరణకు కూటమి మారి నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా బిజెపి అండతో అధికారం చేపట్టిన మరుసటి రోజే అంతకు ముందు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ కుమారుడు తేజస్వి యాదవ్‌కు సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఇక దేశంలో బిజెపికి వ్యతిరేకంగా వున్న కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్, తమిళనాడులో ఓ మంత్రి, శివసేన నేత సంజయ్ రౌత్, మమతా బెనర్జీ, సమాజ్ వాది నేత అఖిలేశ్ యాదవ్, చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చివరకు గుజరాత్ గిరిజన నేత వరకు ఈ సంస్థలు కేసులు మోపబడ్డవారే. ఇంతేకాదు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపి నుండి కాంగ్రెస్‌లో చేరిన మరుక్షణమే వివేక్ వెంకటస్వామిపై సైతం దాడులు జరిగాయి.

వీటన్నింటి నేపథ్యంలోనే ‘ఇండియా’ కూటమి కన్వీనర్ మల్లిఖార్జున ఖర్గే మోడీ మళ్ళీ గెలిస్తే ఎన్నికలనేవి ఉండవు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లా నియంతగా సెటిల్ అవుతారని ప్రమాద హెచ్చరికగా చేశారు. అయితే ఈ కేసులన్నీ చూసినప్పుడు అధికారం అనేది అవినీతికి దగ్గరగా ఉంటుందా! అన్న అనుమానం రాక మానదు. ఇకపోతే ఇవే రాజ్యాంగ సంస్థలు అధికార పక్షం బిజెపిపై ఒక్క కేసు నమోదు కావడం లేదు. అంటే ఆ పార్టీలో అంతానీతిమంతులేనా? అదే ప్రధాని చెప్పకనే చెప్పడానికి ప్రయత్నిస్తున్న వ్యూహంగా కనిపిస్తుంది. అయితే బిజెపి లో వున్న నేతలేం పూర్తిగా నీతిమంతులా అన్న ప్రశ్నలు ఉదయిస్తాయి. గతంలో కాంగ్రెస్ నాయకుడుగా ఉండగా ప్రస్తుత అసోం ముఖ్యమంత్రి హిమంతు బిశ్వాస్ శర్మపై సరస్వతి కుంభకోణం ఉంది. ఆయన బిజెపిలో చేరి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి నీతివంతులయ్యారు? కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప పై అవినీతి మరకను బిజెపి చెరిపేసింది. బిజెపి పార్టీతో సఖ్యతగా వున్న ప్రాంతీయ పార్టీలు సైతం ఎన్ని కేసులు ఉన్నా భద్రంగానే ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చాలా కేసులు ఉన్నప్పటికీ కోర్టుకు సైతం హాజరు కావడం లేదు. కీలక సమయాల్లో బిజెపికి మద్దతు ఇచ్చి ఆయన భద్రంగానే ఉన్నారు. బిఆర్‌ఎస్‌పై ఎన్ని ఆరోపణలు వచ్చినా కేంద్ర పెద్దలు మోడీ, అమిత్ షా లు పలు మార్లు కెసిఆర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కానీ ఇడి, సిబిఐ విచారణకు కేంద్రం ఆదేశించింది లేదు. కారణం ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ వ్యతిరేక పక్షంలో ఉండడమే? గతంలో మాదిరిగా మళ్లీ ఏదైనా అవసరం రావచ్చునే బిజెపి ముందు చూపు కావచ్చును. మొత్తం మీద రాజ్యాంగ సంస్థల దాడులు, కేసులు ఎన్నికల ముందు ఎవరు నీతిపరులు, ఎవరు అవినీతి పరులు? తేల్చే అవకాశం, విచారణ తంతు ఇప్పట్లో తేలే అవకాశం లేదు. కానీ ఎన్నికల ముందు ఈ వ్యవహారం కొందరికి మోదం, కొందరికి ఖేదంలా మారింది.—–

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News