Saturday, April 27, 2024

బాధ్యతా రహిత బడ్జెట్

- Advertisement -
- Advertisement -

BJP declared assets worth Rs 4847 cr in 2019-20

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు పార్లమెంటుకు సమర్పించిన 2022-23 సంవత్సర బడ్జెట్ దేశ జనాభాలో 75 శాతానికి పైగా వున్న సాధారణ ప్రజానీకానికి, ఎస్‌టి, ఎస్‌సి, బిసి వర్గాలకు, మహిళలకు, నిరుద్యోగ యువతరానికి, రైతు లోకానికి ఎటువంటి ప్రయోజనం కలిగించని నిర్విశేష, నిరర్థక పత్రం అనడం ఎంత మాత్రం వాస్తవ విరుద్ధం కాదు. ఇప్పటికే జిఎస్‌టి, పెట్రో ధరల విపరీతమైన బాదుడుతో హాహాకారాలు చేస్తున్న నేపథ్యంలో కొవిడ్ వల్ల కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలపై దయతలచి ఈ బడ్జెట్‌లో పన్నులు పెంచదలచుకోలేదన్న మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన క్రూర పరిహాసమే, తప్ప మరొకటి కాదు. జిఎస్‌టి అవకతవకలు, పెద్ద నోట్ల రద్దు దేశంలోని మెజారిటీ ప్రజల మూలుగులను పీల్చివేసిన సంగతి అందరికీ తెలిసిందే. నిన్న మొన్నటి వరకు హద్దు ఆపూ లేకుండా రోజువారీగా పెంచేసిన పెట్రోల్ ధరలు అంతర్జాతీయంగా ఎగబాకుతున్న క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా మళ్లీ పెరగక తప్పని పరిస్థితి కనిపిస్తున్నది. సంపన్నులను మరింత సిరిమంతులుగా చేయడం తప్ప వేరే పని లేని ప్రధాని మోడీ ప్రభుత్వం సాధారణ ప్రజల మీదికి పెట్రో ధరల బండరాళ్లను దొర్లించడంలో ఆనందం పొందుతుందనే సంగతి కాదనలేనిది. అందుచేత వాటి ధరల పెరుగుదలను ఆశ్రయించి మిగతా సరకుల ధరలన్నీ విజృంభించక తప్పదు. ప్రజలపై అంతకు మించిన పన్నుల మోత మరొకటి ఎక్కడుంటుంది? సమ్మిళిత అభివృద్ధి, ఉత్పాదకత పెంపు, ఇంధన వినియోగంలో మార్పు, పర్యావరణ పరిరక్షణ అనే నాలుగు స్తంభాలపై ఆధారపడే ప్రగతి సాధన మీద దృష్టి కేంద్రీకరిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రపంచ ఆకలి నివేదికలోని మొత్తం 116 దేశాలలో భారత్ 101 స్థానం అలంకరించి అలమటిస్తున్నది. పొరుగునున్న బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్‌ల కంటే వెనుకబడి వుంది. దేశంలోని శతకోటీశ్వరుల సంపాదన 35 శాతం పెరిగింది. 24 శాతం ప్రజలు నెలకు రూ.3000 రాబడితో నిష్ఠ దారిద్య్రాన్ని, దారుణమైన పేదరికాన్ని అనుభవిస్తున్నారు. అత్యంత సంపన్నులు గంటకు రూ.90 కోట్లు సంపాదిస్తున్నారు. కొవిడ్ కాలంలో 1520 కోట్ల మంది పేదరికంలో కూరుకుపోయారు. పర్యవసానంగా దేశంలో పేదరికం అమిత వేగంగా పెరిగి సగం జనాభాను ఆవహించింది. దేశ నాయకత్వం ప్రజాస్వామ్యం, ప్రజల హక్కులు, సమానత్వం వంటి పలుకులకు బదులు పౌర విధులు, బాధ్యతలు, త్యాగాల గురించి మాట్లాడడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పేదలను, అన్నార్తులను, సామాజిక న్యూనతకు గురి అవుతున్న వారిని చేయందించి తీసుకుపోవాలనే రాజ్యాంగ ఆశయాల సాధనకు తగిన ప్రతిపాదనలేవీ బడ్జెట్‌లో కనిపించడం లేదు. అటువంటప్పుడు ఈ బడ్జెట్‌ను సమ్మిళిత భారతాన్ని సాధించడానికి ఉద్దేశించిన గొప్ప సాధనంగా ఎలా భావిస్తాము? ఉద్దేశం రాజకీయమైనదే కావచ్చు గాని కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం వెతికి తీసిన ఒక చేదు వాస్తవాన్ని గమనించక తప్పదు. ఈ బడ్జెట్ ప్రసంగాన్ని ఇంత వరకు కనీవినీ ఎరుగని పెట్టుబడిదారీ ప్రసంగంగా ఆయన అభివర్ణించారు. పేదలు అనే పదం మొత్తం ప్రసంగంలో రెండు చోట్ల మాత్రమే కనిపించిందని చెప్పారు. దీనిపై వ్యాఖ్యానం అవసరం లేదు. మొత్తం బడ్జెట్‌లో సగటు భారతీయుల, పేదల అభ్యున్నతిని లక్షంగా చేసుకొని తీసుకున్న నిర్ణయం గట్టిగా కనిపించదు, డిజిటల్ కరెన్సీ, రైతులకు డిజిటల్ సేవలు వంటి పెద్ద పెద్ద మాటలు బడ్జెట్‌లో ఎక్కువ చోటును ఆక్రమించాయి. వేతనాదాయ వర్గాలకు రాబడి పన్ను వెసులుబాటు ఈ బడ్జెట్‌లోనూ ముఖం చాటేసింది. వచ్చే పాతికేళ్లను అమృత కాలంగా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అభివర్ణించారు. కొవిడ్ మృతుల శవాలు గంగా నదిలో తేలిన నేపథ్యంలో మనం అనుభవిస్తున్నది మృత కాలమే గాని అమృత కాలం ఎలా అవుతుంది? కొవిడ్ రెండో దశలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కొట్టవచ్చినట్టు కనిపించింది. ఆక్సిజన్, అత్యవసర వైద్య సేవలు కొరవడి అసంఖ్యాక కొవిడ్ రోగులు అకాల మరణానికి గురయ్యారు. అప్పుడు కేంద్రంలో బాధ్యత గల ప్రభుత్వం జాడ కనిపించలేదు. రాష్ట్రాలే తమకున్న అరకొర వనరులతో, పాదాలు నెత్తురోడిన వలస కార్మికులను, కొవిడ్ రోగులను శాయశక్తులా ఆదుకున్నాయి. ఇటువంటి చోట పాతికేళ్ల అమృత కాలాన్ని ప్రజలకు వాగ్దానం చేస్తున్న ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని ఎలా విశ్వసించగలరు? ఏడాది పాటు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన సాగించి 700 మందికి పైగా సహచరులను కోల్పోయిన దేశ రైతాంగానికి ఎరువులపై రాయితీలను తగ్గించివేసి రూ.35,000 కోట్ల మేరకు అదనపు భారాన్ని కలిగించడం తప్ప ప్రధాని మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో వారికి చేసిన చెప్పుకోదగిన మేలు మరొకటి లేదు. ఇటువంటి బడ్జెట్‌ను బాధ్యతా రహితమైన పద్దుగా తప్ప మరొక విధంగా పరిగణించలేము.

Editorial About Union Budget 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News