Monday, April 29, 2024

కశ్మీర్ ఎన్నికలకు బిజెపి వ్యూహం!

- Advertisement -
- Advertisement -

జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు వచ్చే ఏడాది, 2024 సెప్టెంబర్ 30 లోగా నిర్వహించాలని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం గత సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో పరిశీలిస్తే, జమ్ముకశ్మీర్ కేంద్ర ప్రభుత్వ పాలనలోకి వచ్చి ఈనెల 20వ తేదీనాటికి అయిదేళ్ళు పూర్తి అవుతాయి. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణం రద్దు తరువాత బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నూతన రాజ్యాంగం ఆధ్వర్యంలో ఈ ఎన్నికలను ఎలా నిర్వహించనున్నదనే ఊహాగానాలు మొదలయ్యాయి.కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల కమిషన్ గతంలో పార్లమెంటు ఎన్నికలను నిర్వహించింది. అయినప్పటికీ, ఎన్నికల కమిషన్ అనేక కారణాలతో పాటు భద్రతా కారణాలను కూడా చూపిస్తూ గతంలో అనేక మార్లు ఇక్కడ ఎన్నికల నిర్వహణను తిరస్కరిస్తూ వచ్చింది. ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి పక్కన పెట్టిన ప్రజాస్వామిక ప్రక్రియను పునరుద్ధరించవలసి ఉంది.

రాజ్యాంగం పరిధిలో ఇక్కడి ప్రజలకు ఉన్న ప్రజాస్వామిక హక్కును ఉపయోగించుకోవడానికి అనుమతించవలసి ఉంది. అత్యధిక సంఖ్యలో ముస్లింలు ఉన్న ఈ ప్రాంతంలో హిందువును ముఖ్యమంత్రిని చేసి బీజేపీ అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఎన్నికలు నిర్వహించాలనే సుప్రీంకోర్టు నిర్ణయం తరువాత ఇదొక పెద్ద కదలిక. జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా దాని స్థాయిని కుదించాక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రానున్న ఎన్నికలను ప్రభావితం చేసే రాజకీయ ఎత్తులకు తెరతీయనున్నదని కశ్మీర్ విశ్వవిద్యాలయం సామాజికి శాస్త్రాల డీన్ ప్రొఫెసర్ నూర్ ఏ. బాబా భావిస్తున్నారు. జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్తీకరణ బిల్లు 2019లో చట్టంగా మారే సరికి నరేంద్ర మోడీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్ ఎన్నికలను కూడా పునర్వ్యవస్తీకరించింది. నియోజకవర్గాల వివాదాస్పద పునర్వ్యవస్తీకరణ పూర్తి కాగానే, బీజేపీ బలంగా ఉన్న జమ్ములో అరు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగగా, కశ్మీర్‌లో ఒకే ఒక్కనియోజకవర్గం పెరగడంతో, దానికి స్పష్టమైన జనాభా అనుకూలత ఏర్పడింది. “నియోకవర్గాల పునర్వ్యవస్తీకరణ జరగడంతో ఎన్నికల గణాంకాలు కాస్త బీజేపీకి అనుకూలంగా మారాయి. రాజోరి, రీసాయ్, చీనాబ్ లోయ వంటి నియోజకవర్గాల్లో హిందూ ఓటర్లు అధికంగా ఉండేలా ఈ పునర్వ్యవస్తీకరణను పూర్తి చేశారు.” అని జమ్ముకు చెదిన అనురాధ్ బాసిన్ అనే రచయిత అంటారు.

నూతన రిజర్వేషన్ విధానాన్ని అనుసరించి ‘అట్టడుగునున్న వారికి రాజ్యాధికారం’ ప్రకారం గుజ్జర్లు, బక్కర్ వాల్స్, పహారిస్ వంటి షెడ్యూల్డు జాతులవద్దకు కాషాయ పార్టీ చేరుతోంది. జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే 370వ అధికారణాన్ని రద్దు చేయడాన్ని సుప్రీం కోర్టు సమర్థిస్తూ తీర్పు ఇచ్చిన రోజే జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్తీకరణ సవరణ బిల్లు 2023 కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ సవరణ ద్వారా జమ్ముకశ్మీర్ రాష్ర్ట అసెంబ్లీ సీట్లు 83 నుంచి 90కి పెరగడమే కాకుండా, షెడ్యూల్డు కులాలకు ఏడు సీట్లు, షెడ్యూల్డు తెగల వారికి తొమ్మిది సీట్లు కేటాయించారు. శాసన సభకు ముగ్గురిని నియమించే అధికారాన్ని ఈ బిల్లు జమ్ముకశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్‌కు కల్పించింది. కశ్మీర్ నుంచి వలస వెళ్ళిన వర్గాల వారి నుంచి ఒకరిని, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌నుంచి వలస వచ్చిన వారి నుంచి ఒకరిని లెప్టినెంట్ గవర్నర్ శాసనసభకు నియమించవచ్చు. ‘అట్టడుగున ఉన్నవారికి రాజ్యాధికారం కోసం కశ్మీర్’ అన్న మాటను సమర్థించుకోవడానికి ఫెడరల్ విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుందని ప్రొఫెసర్ నూర్ ఏ. బాబా అంటారు. “ఈ రోజు జమ్ముకశ్మీర్‌లో మెజారిటీ ప్రజలనుమైనారిటీలుగా మార్చడంలో చాలా యుక్తిని ప్రదర్శించింది” అని ఆయ న వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ నియోజకవర్గాల పునర్‌వ్యవస్తీకరణ బీజేపీకి లాభించేవిధంగా 2014 ఎన్నికల్లో సాధించిన 25 సీట్లను దాటేలా ఉన్నప్పటికీ, 90 మంది సభ్యులు కల సభలో మెజారిటీ స్థానాలైన 46కు సమీపించడం సాధ్యం కాదు. మ్యాజిక్ నెంబర్‌ను చేరుకోవడానికి కశ్మీర్‌కు కేంద్రీకృతమైన, తనకు భావ సారూప్యం కల పార్టీలతో బీజేపీ మరింత దగ్గరవడానికి ప్రయత్నించవచ్చు.
ఎన్నికల రాజకీయ గోదాలో 2019 నుంచి కొత్త శక్తులు మొలకెత్తుకొచ్చాయి. వీరిలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులావ్‌ు నబీ ఆజాద్, పీపుల్స్ డెమాక్రటిక్ పార్టీ అధినేత మెహబూబా ముఫ్తి, అల్తాఫ్ బుఖారి వంటి వారు బాహాటంగా ప్రధాని నరేంద్ర మోడీ పట్ల అనుకూలత వ్యక్తం చేశారు. అదే సమయంలో గుప్తకార్ అలయన్స్ గా ఏర్పడిన నేషనల్ కాన్ఫరెన్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలు రద్దు చేసిన అర్టికల్ 370ను పునరుద్ధరించాలని పోరాడాయి. ఈ రెండు పార్టీలు చరిత్రలో గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య ప్రత్యక్ష పోరు నెలకొంటుందని జమ్ముకు చెందిన విద్యావేత్త, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ రేఖన్ చౌదరి అంటారు. “కశ్మీర్‌లో బలంగా పనిచేస్తామని నేషనల్ కాన్ఫరెన్స్‌పూర్తి విశ్వాసంతో ఉంది. ఎందుకంటే, రెండేళ్ళ క్రితం డీడీసీ ఎన్నికల్లో అది తన బలాన్ని నిరూపించుకుంది.

అనేక మంది నాయకులు పార్టీని విడనాడడంతో పీపుల్స్ డెమాక్రటిక్ ఫ్రంట్ మాత్రం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.” అని ఆమె వివరించారు. “సజ్జద్‌లోనికి చెందిన పీిపుల్స్ కాన్ఫరెన్స్ పరిమితమైన బలంతో ఎన్నికల్లో చాలా పరిమితంగానే ప్రభావం చూపగలుగుతుంది. ఇతరత్రా ఎలా ఉన్నా ఎన్నికల ఫలితాల వైపు మాత్రం వెనుకబడింది” అని ఆమె చెప్పారు.
“జమ్ము కశ్మీర్‌లో ఉన్న సంప్రదాయ రాజకీయ వాతావరణాన్ని సుప్రీం కోర్టు తీర్పు మౌలికంగా మార్చేసింది. స్థానిక పార్టీలకు పరిస్థితి చాలా ఇబ్బందిగా తయారైంది”?అని సీనియర్ రాజకీయ విశ్లేషకులు జఫర్ చౌదరి అన్నారు. “ప్రత్యేక ప్రతిపత్తికి అనుకూలమైన శ్రోతలు లేని రాజకీయ వాతావరణంలో కశ్మీర్‌లో బీజేపీకి పొత్తులు ఏర్పడుతున్నాయి. బీజేపీకి స్థానికంగా అవకాశం కల్పిస్తోంది” అని చౌదరి అన్నారు. అలసి పోయిన చిన్నచిన్న రాజకీయ శక్తులను గుప్కార్ పక్షం తనలోకి ఇముడ్చుకుంది. చెదిరిన వాతావరణంలో అధికారాన్ని ఎవరైనా సరే పంచుకోవచ్చని జమ్ముకశ్మీర్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏమైనప్పటికీ 2014 ఎన్నికల్లో అంతకుముందు కంటేరెట్టింపు స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఈ తడవ గెలుపు అంత తేలికకాదు. “జమ్ము ప్రాంతంలో బీజేపీ తనకు ప్రత్యామ్నాయం లేదని భావించడంతో పాటు అనేక సవాళ్ళను కూడా ఎదుర్కొంటోంది.

ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్‌నుంచి గులాంనబీ ఆజాద్ నిష్ర్కమించడంతో ఆ పార్టీ చాలా బలహీనపడింది. నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మునుంచి పూర్తిగా నిష్ర్క మించి కాశ్మీర్‌పైనే కేంద్రీకరించింది.”
“జమ్ములో బాగా ప్రసిద్ధమైన దేవేంద్ర రాణా, ఎస్ ఎస్ స్లాథియాలు నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి బీజేపీలోకి మారి పోయారు. జమ్ములో నేషనల్ కాన్ఫరెన్స్ చురుగ్గా లేదు. వీళ్ళంతా బీజేపీ కోసం రాజకీయాలనే ఒదిలేసుకున్నారు.” అని జమ్ము విశ్వవిద్యాలయంలో బోధించే చౌదరి అంటారు. నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ వంటి సంప్రదాయపార్టీలు పోటీపడుతున్న కశ్మీర్‌లో దాదాపు డజను మంది నాయకులు బీజేపీలోకి వసల వెళ్ళడంతో ఏ ఒక్కరికీ బలం చేకూరకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. “పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీని మినహాయిస్తే, మిగతా పార్టీలన్నీ తమ మౌలిక దృక్పథం నుంచి మారిపోయాయి. ముఖ్యంగా నేషనల్?కాన్ఫరెన్స్ తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ఆచరణాత్మక మార్గాన్ని ఎన్నుకోవచ్చు. 370 అధికరణాన్ని రద్దు చేయడాన్ని సమర్థిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడానికి చాలా కాలం ముందే పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ ‘కోర్టులో ఉన్న చట్టపరమైన సమస్య’ అంటూ 370 వ అధికరణానికి దూరంగా జరిగింది.”

ఎన్నికల తరువాత అధికారం చేపట్టాలంటే సగం స్థానాలు 45 కంటే మరో మూడు అదనపు స్థానాలు, అంటే 48 స్థానాలు గెలుచుకోవలసి ఉందని విశ్లేషకులు చౌదరి అంటారు. “శాసన సభకు ముగ్గురిని నియమించే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉన్నందున బీజేపీకి మేజిక్ స్థానాలు 43 వస్తే సరిపోతుంది. గడచిన మూడు విడతల అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల ధోరణిని పరిశీలించినట్టయితే ఏదైనా రాజకీయ కూటమి అధికారం చేపట్టాలంటే మేజిక్ నెంబర్‌ను దాటాక కూడా, దానితో కలిపి 48 సీట్లు సంపాదించాల్సిందే” అని చౌదరి అంటారు.
“గెలిచిన కూటముల్లో పోటీ తీవ్రంగా ఉన్నట్టయితే, ప్రభుత్వ ఏర్పాటులో లెఫ్టినెంట్ గవర్నర్ నియమించిన ముగ్గురు సభ్యుల ఓట్లు కీలకంగా మారతాయి” అని ఆయన అంటారు. జమ్ము కశ్మీర్‌లో జరిగిన మార్పుల వల్ల ప్రజాస్వామ్యాన్ని, రాష్ట్రాన్ని నిలబెట్టడం చాలా కష్టం అని ప్రొఫెసర్ నూర్ ఏ.బాబా అంటారు. ‘బీజేపీకి అనుకూలంగా చేసినా, చేయకపోయినా ఆ పార్టీ అధికారంలోకి రావడం మాత్రం సాధ్యం కాదు. కొన్ని విధానాలు మాత్రం కొనసాగుతాయంటారు. “బీజేపీ ఎన్నికల లెక్కల ప్రకారం కేంద్రం వ్యవహరిస్తోంది. కేంద్రం కోసం జమ్ము కశ్మీర్‌లో జరిగేదేదో జరుగుతోంది. రాజకీయ ఉద్దేశ్యంతోనే ఆర్టికల్ 370 రద్దు జరిగింది. ఈ మార్పులు ఈ నమూనాలో జరుగుతాయి.” అని బాబా ముక్తాయించారు.

అనువాదం : రాఘవశర్మ
‘ద వైర్’ సౌజన్యంతో..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News