Friday, April 26, 2024

కొనుగోళ్లలో దూసుకెళుతున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు

- Advertisement -
- Advertisement -

కళకళలాడుతున్న రిటైల్ షాపులు
ప్రత్యేకమైన ఆఫర్లతో కొనుగోళ్లపై దృష్టి సారించిన వినియోగదారులు
వచ్చే నెల 15వరకు
ఆకర్షణీయమైన రాయితీలు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు

Electronic products sale in Market

మనతెలంగాణ/హైదరాబాద్:  పండుగ సీజన్ సందర్భంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోళ్లు పెరిగాయి. సంవత్సరన్నర నుంచి కరోనా నేపథ్యంలో వినియోగదారులు లేక విలవిలలాడిన రిటైల్ షాపులు దసరా పండుగ నేపథ్యంలో కళకళలాడుతున్నాయి. గతేడాది పోలిస్తే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల విక్రయాలు ఈసారి 35 శాతం మేర రెట్టింపు అమ్మకాలు జరిగినట్టు వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ కొనుగోళ్ల పోటీని తట్టుకొని నిలదొక్కుకునేందుకు ఈసారి రిటైలర్లు ప్రత్యేకమైన ఆఫర్లను అందజేస్తుండడంతో వినియోగదారులు సైతం కొనుగోళ్లపై దృష్టి సారించారు. పండుగ సీజన్ వచ్చిందంటే ఆటోమొబైల్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ ఉప కరణాలు, గ్యాడ్జెట్ల కొనుగోళ్లకు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు షాపింగ్ మాళ్లు, రిటైలర్లు సైతం ఆకర్షణీయమైన ఆఫర్లతో అమ్మకాలను పెంచుకునేందుకు తాపత్రయపడుతుంటారు. గతేడాదితో పోలిస్తే రెట్టింపు అమ్మకాలతో ఒకవైపు రిటైలర్లు, ఆకర్షణీయమైన రాయితీలు, క్యాష్ బ్యాక్‌లతో కొనుగోలుదారులు ఇరువురు ఈసారి లబ్ధి పొందడంతో ఎలక్ట్రానిక్స్ సేల్స్ అమాంతం పెరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.

దీపావళి వరకు….

పండుగ సందర్భంగా నగరవాసులు సైతం ఇంటికి కొత్త వస్తువులు తీసుకువచ్చేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో చాలాకాలం తర్వాత ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు కొవిడ్ ముందు భారీ సేల్స్‌ను నమోదు చేశాయని రిటైలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దసరాతో మొదలైన ఈ జోరు దీపావళీ వరకు కొనసాగుతుందని, తమ ఆఫర్లు నవంబరు 15 వరకు కొనసాగుతాయని వ్యాపారులు పేర్కొన్నారు.

55, 65, 75, 85 ఇంచుల టివిలకు డిమాండ్

మినీ థియేటర్ల కొనుగోళ్లు గతేడాదితో పోలిస్తే డబుల్ అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నట్టు వ్యాపారులు తెలిపారు. దసరా, దీపావళి పండుగ సీజన్లలో టివిలు, సెల్ ఫోన్‌లు ఎక్కువగా అమ్ముడవుతుంటాయి. వినోదానికి కేరాఫ్ అయిన సినిమా క్రమంగా ఓటిటిలకు మళ్లుతుండటంతో ఇంట్లో మినీ థియేటర్ ఏర్పాటుకు వినియోగదారులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని వ్యాపార వర్గాలు తెలిపాయి. ఐపీఎల్, వరల్డ్ కప్ సీజన్లతో పెద్ద టివిలకు డిమాండ్ మరింత పెరిగిందని, అందులో భాగంగా 55, 65, 75, 85 ఇంచుల టివిలకు డిమాండ్ ఎక్కువ ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్లు మార్కెట్లో ప్రస్తుతం 4కె తో పాటు 8కె టెక్నాలజీ రిజల్యూషన్‌కు సంబంధించిన టీవీలను వ్యాపారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. కలిసొచ్చిన వర్క్ ఫ్రం నేపథ్యంలో హోంటివిలతో పాటు సౌండ్ బాక్స్‌లకు అంతే డిమాండ్ ఉందని, వాటిని ఎక్కువగా కొంటున్నారని, వీటితో పాటు డిష్ వాషర్లకు సైతం ఆదరణ పెరుగుతోందని వ్యాపారులు తెలిపారు.

క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తున్న ఫైనాన్స్ కంపెనీలు

రిటైల్ దుకాణాల్లో ఆన్‌లైన్ మాదిరిగానే ఫైనాన్స్ కంపెనీలు రూ. 25 వేల వరకు క్యాష్ బ్యాక్‌లను అందజేస్తున్నాయి. ఆన్‌లైన్ కన్నా మెరుగైన ధరలు, ఉత్పత్తులను స్టోర్లలో వ్యాపారులు అందిస్తున్నారు. కరోనా మహమ్మారి ఆంక్షల తర్వాత వచ్చిన దసరా ఫెస్టివ్ సీజన్ తమకు రెండింతల వ్యాపారాన్ని తీసుకువచ్చిందని వ్యాపారులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News