Monday, May 6, 2024

కాబూల్‌నుంచి భారత్ చేరిన ఎంబసీ సిబ్బంది

- Advertisement -
- Advertisement -
Embassy staff arriving in India from Kabul
120 మందితో జామ్‌నగర్ ఎయిర్‌బేస్ చేరిన సి17 విమానం

న్యూఢిల్లీ: తాలిబన్లు అఫ్ఘాన్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత దేశ రాజధాని కాబూల్‌లో పరిస్థితి దిగజారి పోవడంతో భారత్ అక్కడి తమ దౌత్య కార్యాలయంలో పని చేస్తున్న రాయబారి, ఇతర దౌత్య సిబ్బందిని అత్యంత క్లిష్టపరిస్థితుల మధ్య భారత్‌కు తీసుకు వచ్చింది. కాబూల్‌లో భారత రాయబారి రుద్రేంద్ర టాండన్, 120 మంది దౌత్య సిబ్బందితో భారత వాయుసేనకు చెందిన సి17 రవాణా విమానం మంగళవారం ఉదయం 11.15 గంటల సమయంలో గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్ బేస్‌కు చేరుకుంది. అక్కడినుంచి విమానం ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు బయలుదేరి వెళ్లింది. కాబూల్‌లో పరిస్థితి చాలా సంక్లిష్టంగా, గందరగోళంగా ఉందని, అక్కడ చిక్కుబడిన భారతీయులను వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కాగానే స్వదేశానికి తీసుకు రావడం జరుగుతుందని టాండన్ జామ్‌నగర్ ఎయిర్‌బేస్ వద్ద మీడియా కు చెప్పారు. ‘ క్షేమంగా భారత్‌కు తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది.

మనది చాలా పెద్ద దౌత్య కార్యాలయం. కేవలం మూడు రోజుల్లోనే రెండు దశల్లో మొత్తం 192 మంది దౌత్య సిబ్బందిని చాలా క్రమశిక్షణగా తరలించగలిగాం’ అనిఆయన చెప్పారు. కాబూల్‌లో పరిస్థితి శరవేగంగా మారిపోతుండడంతో దిక్కుతోచని చాలా మంది భారతీయులకు తమ దౌత్య కార్యాలయం అవసరమైన సాయంతో పాటు ఆశ్రయం కూడా కల్పించినట్లు ఆయన తెలిపారు. గత ఏడాదిఆగస్టులో టాండన్ అఫ్ఘానిస్థాన్‌లో భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరించారు. కాబూల్‌లో ఇప్పటికీ కొంతమంది భారతీయులు ఉన్నారని, అందువల్ల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయన చెప్పారు. అందువల్లనే ఎయిరిండియా కాబూల్‌కు కమర్షియల్ విమానసర్వీసులను కొనసాగిస్తోందని టాండన్ తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటలకు బయలు దేరిన భారతవాయుసేన విమానంలో 120 మందికి పైగా దౌత్య సిబ్బంది, అధికారులతో పాటుగా కొతం మంది భారతీయ పౌరులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం కాబూల్ విమానాశ్రయంలో విమాన సర్వీసులు నిలిచిపోవడానికి ముందే మరో సి17 విమానంలో దాదాపు 40 మంది సిబ్బందిని తరలించడం జరిగింది. ఈ రెండు విమానాలు కూడా పాక్ గగనతలం మీదుగా కాకుండా ఇరాన్ గగనతలాన్ని ఉపయోగించుకొని కాబూల్‌కు చేరుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News