Sunday, April 28, 2024

బహుజనుల బతుకుల్లో వెలుగెన్నడు?

- Advertisement -
- Advertisement -

Enlightened in lives of mass People

వ్యక్తిగత ఆరాధనతో ఎవరి దగ్గరా బానిసలుగా బ్రతకవద్దని’ డా. బి.ఆర్. అంబేడ్కర్ అణగారిన వర్గాల వారి నుద్దేశించి పలుమార్లు చెప్పారు. దేశంలో దాదాపు 85% మంది బహుజనులున్నారు. రిజర్వేషన్ల పెంపు, రాజ్యాధికార సాధన అనే రెండు ప్రధాన లక్ష్యాలతో బహుజన ఉద్యమాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రిజర్వేషన్స్ విషయంలో సంస్కరణలు తేవాలని పాలక వర్గాలు భావిస్తున్నప్పటికీ ఎన్నికలలో తమ గెలుపోటములపై ప్రభావం పడుతుందేమోనన్న భయంతో వాటి జోలికి వెళ్ళడం లేదు. అయితే వివిధ రంగాలలో పెరుగుతున్న ప్రైవేటీకరణతో ప్రభుత్వ ఉద్యోగాల తగ్గే అవకాశం ఉంది. ఆర్ధిక సంక్షోభంతో పాటు, కరోనా వైరస్ తోడవడంతో దేశంలో సంస్కరణలు వేగవంతమయ్యాయి.

రాజ్యాధికార సాధన అనేది బహుజనుల రెండవ అతిపెద్ద లక్ష్యం. ఉత్తరప్రదేశ్‌లో బహుజనుల కల సాకారం అయ్యింది. అయితే అక్కడ వివిధ రాజకీయ పరిణామాల వల్ల బహుజనులు అధికారానికి దూరంగా వెళ్ళిపోయారు. బహుజనులతో విద్యావంతులు, మేధావులు, ఉన్నతాధికారులులో ఎక్కువ మంది ఏదో ఒక సాంప్రదాయ పార్టీకి అనుచరులుగా మారడం, బహుజన ఉద్యమాల్లో చీలికలు రావటం తదితర కారణాలవల్ల రాజ్యాధికార సాధన అనేది ఒక విఫల ప్రయోగంగా మిగులుతోంది.అంబేడ్కర్ మహాశయుని ప్రకారం విద్య ద్వారానే తన జాతి ప్రయోజనాలు కాపాడుకోవచ్చన్నారు. కానీ దేశంలో అత్యధిక నిరక్ష్యరాస్యులు బహుజనులలోనే ఉన్నారు. 2001లో ఎస్.సి. మహిళల అక్షరాస్యత శాతం 42% ఉండగా, 2011 నాటికి 56.5% నికి పెరిగింది. 2011 నాటికి దేశ అక్షరాస్యతా శాతం 73% గా ఉండగా, ఎస్.టి.లలో 59% గా ఉంది. బహుజన ఉద్యమ లక్ష్యలలో అక్షరాస్యత పెంపుదల కూడా చేర్చాలి.

అంబేడ్కర్ మూఢ విశ్వాసాలకు దూరంగా ఉండాలని సూచించారు. మూఢ విశ్వాసాల వల్లనే వ్యక్తిగత ఆరాధన పెరుగుతుంది. తద్వారా పరాధీనత పెరుగుతుంది. బుద్ధుని బోధనలని ప్రచారం చేసే సరైన యంత్రాంగం భారతదేశంలో లేనందువల్ల బహుజనులలో మూఢ విశ్వాసాలు బాగా పెరుగుతున్నాయి. రాజ్యాంగం ప్రసాదించిన నిబంధనల వల్ల, పాలకులు అమలుపర్చిన సంక్షేమ పథకాలు వల్ల గత 70 ఏళ్లలో బహుజనుల జీవితాల్లో కొంత మార్పు వచ్చిన మాట వాస్తవమే. అయితే ఈ మార్పు ఆశించిన స్థాయిలో లేదు. ప్రస్తుతం ప్రభుత్వాలు సంక్షేమ బాట పట్టాయి. కరోనా కష్టకాలంలో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు కొంత వరకు పేదవారికి ఉపయోగపడతాయి.

వారిలో కొనుగోలు శక్తి పెరుగుతుంది. దీనితో పాటుగా తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం కల్పించడం, వారికి శాశ్వత ఉపాధి కల్పించే ఏర్పాట్లు చేయాలి. ఆధిపత్య వర్గాలలో ఎక్కువ మంది రైతులుగా, బహుజనులలో ఎక్కువ మంది వ్యవసాయం పై ఆధారపడేవారు కూలీలుగా ఉన్నారు. ప్రజలలో పెరుగుుతున్న మద్యం వినియోగం కూడా ఆందోళన కల్గిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తుంది. మద్యాన్ని నిషేధించడంతో పాటు నాటు సారా విక్రయాన్ని అరికట్టాలి. మద్యపానం సేవిస్తే వచ్చే నష్టాల్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. ఇదొక దీర్ఘకాలిక ఉద్యమంగా జరగాలి.

అంబేడ్కర్ అన్నట్లు ప్రతి సమస్యపై నిరంతరం అధ్యయనం జరగాలి. నిరంతర దూషణలతో, చీలికలతో ఉద్యమాలు బలహీనపడతాయి. బహుజనుల దీన స్థితికి ఆధిపత్య వర్గాల వారు ఒక్కరే కారణం కాదు. చరిత్రలో రాజులు, జమీందార్లు, సామంతుల ఉక్కు పిడికిలలో నిమ్నవర్గాల వారు నలిగిపోగా, ఆధునిక కాలంలో బడా కార్పొరేట్లు, పారిశ్రామిక వేత్తల నియంత్రణతో పేదవారి హక్కులు కాలరాయబడుతున్నాయి. అగ్ర వర్ణాలలో కూడా బహుజనుల అభ్యున్నతికి కృషి చేసేవారున్నారు. అటువంటి వారిని గుర్తించి సమస్యల పరిష్కారానికి ఉమ్మడిగా పని చేయాలి.

ఒకవైపు నిరక్షరాస్యత నిర్మూలన, మద్యపాన నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై దృష్టిపెడుతూనే, మరో వైపు రాజ్యాధికార సాధన వంటి అంశాలపై పోరాడితే బహుజన ఉద్యమాలకి విసృ్తతంగా మద్దతు లభిస్తుంది. 1840వ ప్రాంతంలో మహారాష్ర్టలో మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రీ బాయి ఫూలేలు, ఫాతిమా బేగం అనే మరొక విద్యావేత్తతో కలిసి నిరక్షరాస్యత నిర్మూలనకు ఎంతో కృషి చేశారు. ఆనాటి సమాజంలో వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ 1848-53 మధ్య ప్రాంతంలో ఐక్య ఉద్యమాలకు మహారాష్ర్టలో వారు పటిష్ఠమైన పునాదులు వేశారు. వారి స్ఫూర్తితోనే నేటి బహుజనుల నాయకులు కూడా ఉమ్మడి కార్యాచరణలు ప్రకటించాలి. అప్పుడే బహుజన సాధికారిత వస్తుంది. ఈ దిశగా బహుజన నాయకులు ఆలోచించాలి.

యం. రాంప్రదీప్- 9492712836

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News