Monday, April 29, 2024

దాహార్తియా ద్రోహానికి హారతియా?

- Advertisement -
- Advertisement -

Water dispute between Two Telugu states

కృష్ణా గోదావరి నదీజలాల వినియోగం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదం అయింది. ఈ జటిల జల సమస్య పరిష్కారానికి ఏర్పాటు అయిన అపెక్స్ కౌన్సిల్ భేటీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. త్వరలోనే ఏదో ఓ తేదీన భేటీ జరుగుతుంది. అయితే ఈ జల వివాద నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తాము ఈ వివాదానికి సంబంధించి దీటైన జవాబు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన తగు విశ్లేషణాత్మక, అంతకు మించిన గణాంకాల భరిత వాదనకు ఆయన సమాయత్తం కావడం అభినందనీయం. అయితే ఈ ప్రతిపాదిత అపెక్స్ కౌన్సిల్ భేటీతో కేంద్ర ప్రభుత్వం ఇరుకునపడే అవకాశం ఉన్నట్లు అన్పిస్తోంది. అసలు ఇంతవరకూ ఇరు రాష్ట్రాలకు సంబంధించి కొత్త ప్రాజెక్టులు / పాత ప్రాజెక్టులకు నిర్వచనాలు ఇప్పటికీ నిర్ణయించనేలేదనేది నా అభిప్రాయం.

బ్రిజెష్‌కుమార్ ట్రిబ్యునల్ కాలాతీత వ్యవహారాలపై స్పందన ఏమిటనేది ఓ విషయం. కేటాయించిన వాటాను కొత్త కాలువలు, జలాశయాలు కట్టకుండానే నీటిని వాడుకోవల్సి ఉంది. అయితే ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కేంద్రం పరిధిలోని అపెక్స్ కౌన్సిల్‌కు ఇప్పటికీ సరైన విధివిధానాలు ఖరారు కాలేదు. తగుదునమ్మా అనుకుంటూ కొత్త కాలువలు వేయడం, జలాశయాలు కట్టకుండా చేయడం గురించి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం వద్ద ఇప్పటికీ సరైన ఫార్మూలా లేనేలేదు. ఇప్పటికే అపెక్స్ కౌన్సిల్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ వివరణగా ఓ లేఖ పంపించింది. ఈ లేఖను పరిశీలిస్తే కొన్ని విషయాలు స్పష్టం అవుతున్నాయి. లేఖానుసారంగా చూస్తే పొరుగు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అర్థం అవుతోంది.

రాయలసీమ ఎత్తిపోతలతో పాటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తరలించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులు కొత్తవి కావని కెడబ్లుడిటి చేసిన కేటాయింపులు, 2015లో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల ప్రకా రం వాటా నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికే చేపట్టిన ప్రాజెక్టులే ఇవని చెప్పదల్చుకున్నట్లు స్పష్టం అవుతోంది. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. కెడబ్లుడిటి నీటి వినియోగాన్ని ప్రాజెక్టుల వారీగా కేటాయించలేదనే విషయాన్ని గుర్తించాలి. ఇక 2015లో కుదిరిన రెండు రాష్ట్రాల ఒప్పందం దామాషా పద్ధతిన ఖరారు అయిన తాత్కాలిక ఏర్పాటు అనేది కూడా గమనించాల్సి ఉంటుంది.

కెడబ్లుడిటి కేటాయించింది కేవలం నికర జలాలను మాత్రమే. మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛను ఇచ్చింది కానీ ఈ విషయంలో ఎటువంటి హక్కులు కల్పించలేదు. మిగులు జలాలపై కెడబ్లుడిటికి ఎటువంటి హక్కు గురించి కోరడం లేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాతపూర్వకంగా వివరణ సమర్పించింది. కెడబ్లుడిటి 2, 65 శాతం డిపెండబులిటిలో నుంచి 39 టిఎంసిలు, మిగులు జలాలను లెక్కించి 145 టిఎంసిలు, 6 టిఎంసిలు కనీస ప్రవాహాలుగా చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 100 టిఎంసిలు కేటాయించిన విషయం విదితమే.

కానీ 2014 సంవత్సరంలో రాష్ట్రాలు విడిపోయి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలులోకి రావడంతో కెడబ్లుడిటి 2ను పొడిగించి రెండు రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయించాలని, లోటు సంవత్సరాలలో ప్రాజెక్టుల వారీగా నీటి విడుదల కోసం కార్యాచరణ ప్రోటోకాల్‌ను ఖరారు చేయాలనే బాధ్యతను అప్పగించారు. ఇక కెడబ్లుడిటి 2 నడుస్తున్న సందర్భంలో ట్రిబ్యునల్‌కు తెలియచేయకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడం ఎంతవరకు సమంజనం అన్నది ప్రశార్థకం. కేంద్ర ప్రభుత్వమే ఈ పథకం చేపట్టకూడదని ఆదేశించినా ఆం.ప్ర ప్రభుత్వం టెండర్లను నిర్ణయించడం, ముందుకు సాగడం వంటి విషయాలు దేశంలోని ఇతర నదీజలాల వివాదాలపై తప్పకుండా ప్రభావానికి దారితీస్తుంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు నదీ జలాలు, ట్రిబ్యునల్‌లు ఇచ్చిన అవార్డుల విషయంలో పరిపూర్ణ జ్ఞానమున్న వ్యక్తి. పూర్తి స్థాయిలో సమగ్ర సమాచారం సంతరించుకున్నారు. వ్యూహ ప్రతివ్యూహాలు పన్నడంలో దిట్ట అనే విషయం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందమే నిరూపిస్తున్నది. బచావత్ ట్రిబ్యునల్‌లో ఎగువ రాష్ట్రాలు కృష్ణానదిలో ఆం.ప్ర రాష్ట్రానికి ఎక్కువ నీటిని కేటాయించారని గగ్గోలు పెట్టడం, ఆం.ప్ర రాష్ట్రానికి గోదావరి నుంచి కృష్ణాకు మళ్లించే అవకాశం ఉన్నందున వాదోపవాదాల తరువాత తుది తీర్పులో క్లాజ్ xiv బి ప్రకారం క్లుప్తంగా చూస్తే కృష్ణా నదికి ఏ ఇతర నది ద్వారానైనా నీటిని మళ్లిస్తే బేసిన్ రాష్ట్రాలు అందులో వాటా కోరే హక్కును కల్పించడమైనదనే విషయాన్ని చేర్చడం జరిగింది.

జిడబ్లుడిటి అవార్డు కూడా బచావత్ చూడటం వలన వారికి కెడబ్లుడిటి అవార్డులోని అంతర్గతం అంతా తెలియడం వలన గోదావరిపై గల పోలవరం నుండి 80 టిఎంసిలు కృష్ణానదికి తరలించే ప్రతిపాదన ఉండటం వలన మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు అందులో వాటా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం 80 టిఎంసిలలో కర్నాటకకు 21 టిఎంసిలు, మహారాష్ట్రకు 14 టిఎంసిలు 29.1.1979, 30.1979 ఒప్పందాల ద్వారా అంగీకరింపబడ్డాయి. మిగతా 45 టిఎంసిలు ఉమ్మడి ఆం.ప్ర రాష్ట్రం నాగార్జునసాగర్ ఎగువన ఎక్కడైనా వాడుకోవచ్చుననే హక్కు 4.8. 1978 ఒప్పందం ప్రకారం కలిగి ఉన్నది. ఇచట గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ 80 టిఎంసిల నికర జలాలు, పోలవరం ప్రాజెక్టు క్లియరెన్స్ వచ్చిన మరునాటి నుండే. ఈ 45 టిఎంసిల నికర జలాలు కృష్ణా బేసిన్‌లోని తెలంగాణ ప్రాజెక్టులకే చెందుతాయి.

ఈ దశలో తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్‌లో 45 టిఎంసిల నికర జలాల నిగ్గు తెలియపర్చాలె. ఇప్పుడు దాహా ర్తి తీర్చడానికే ఈ రాయలసీమ పథకం అని చెప్పి మున్ముందు దానిని ఇతర వినియోగాల కోసం వాడుకునే అవకాశం ఉన్నది. ఇది వరకే మద్రాసు నగరంనకు 15 టిఎంసిల తాగు నీటి కోసం అని చెప్పి తెలుగుగంగ ప్రాజెక్టును ఇతర అవసరాల కోసం వాడుతున్న విషయం తెలిసిందే. స్వేచ్ఛ ఉన్నదని చెప్పి హక్కుగా మార్చుకునే మల్చుకునే అవకాశాలు ఎక్కువగా పుష్కలంగా ఉన్నాయి.

ఉదాహరణకు మిగులు జలాల వాడకం కోసం నిర్మించిన తెలుగు గంగ ప్రాజెక్టును బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా వాదించి 25 టిఎంసిలు కృష్ణా బేసిన్ వెలుపలి ప్రాంతానికి తరలించడంలో విజయం సాధించింది. దీనిని ఇప్పుడు గుర్తుంచుకోవల్సి ఉంటుంది. కావున ఎట్టి పరిస్థితుల్లోనూ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవల్సిందే. ఒకవేళ ఇప్పుడు అడ్డుకోకుంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అమలులోకి వస్తే 31 మే 2050 వరకూ ఎటువంటి సమీక్షలు నిర్వహించడానికి వీలుండదు. ఈ విధంగా నీటికి సంబంధించి సీలుబంద్ అయిపోతుంది. దీనిని గుర్తించి తగు చర్యలు చేపడుతారని, తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ భేటీలో తగు విధంగా వాదనలు విన్పిస్తుందని ఆశిస్తున్నారు.

కె. వేణుగోపాల్ రావు- (రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News