Saturday, April 27, 2024

కొవిడ్-19 నివారణ చర్యల్లో ముందంజలో ఉన్నాం: మంత్రి ఈటల

- Advertisement -
- Advertisement -

Minister Etela Rajender

 

హైదరాబాద్ : దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కొవిడ్ -19 నివారణ చర్యల్లో మనమే ముందంజలో ఉన్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి కూడా ప్రశంసించారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కరోనా సోకిన వాళ్లంతా బాగానే ఉన్నారని, రెండు, మూడు రోజుల్లో కొలుకున్న బాధితులను వరసగా డిశ్చార్జ్ చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కోఠి కమాండ్ కంట్రోల్ రూంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కరోనా క్రమంగా ప్రబలుతుందని, సోమవారం ఒక్కరోజే మరో 6 కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు.

దీనిలో ఒకరు ఇటీవల ఇండోనేసియా బృందంతో కరీంనగర్‌లో కలసి తిరిగాడని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు కరోనాతో ఎవరు చనిపోలేదని, కనీసం వెంటిలేటర్ మీద కూడా లేరని, అందరి ఆరోగ్యం మెరుగ్గా ఉందని ఆయన చెప్పారు. పాజిటివ్‌గా ఉన్న 33 మందిని, వారి ఆరోగ్య పరిస్థితి బట్టి క్రమక్రమంగా డిశ్చార్జ్ చేస్తామన్నారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే మేలని సూచించారు. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకే ఎపెడిమిక్ యాక్ట్‌ను అమలు చేస్తున్నామని తెలిపారు.

నిత్యవసర వస్తువుల తప్ప అని బంద్ అని పేర్కొన్నప్పటికీ, ప్రజలు రోడ్లపైకి వచ్చి ఎందుకు ఆగమైతున్రో అర్థం కావడం లేదన్నారు. బతికుంటే బలుసాకు తినొచ్చు గానీ , బయటకు వచ్చి వైరస్ వ్యాప్తికి కారకులం కాకుడదని పిలుపు నిచ్చారు. ప్రజల ప్రాణాలు రక్షించడం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, దీన్ని యావత్ సమాజం గమనించాలని మంత్రి కోరారు. సామాజిక భాద్యతతో ప్రజలంతా ఎపిడెమిక్ చట్టం నిబంధనలను పాటించాలన్నారు. నిత్యావసర వస్తువులకు కూడా కేవలం ఒకమనిషి మాత్రమే బయటకు వచ్చి తీసుకోవాలని మంత్రి కోరారు. క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తుల్లో మరో 97 మందిలో అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని, వారికి కూడా త్వరలోనే పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. విదేశాల నుంచి వచ్చే వారు ఖచ్చితంగా స్వతహాగా రిపోర్టు చేయాల్సిందిగా మంత్రి విజ్ఞప్తి చేశారు.

వైరస్ సోకిన వాళ్లలో 14 రోజుల వరకు ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించే అవకాశం లేనందున, విదేశాల నుంచి వచ్చిన వారు ప్రభుత్వం పర్యవేక్షణలో ఉండాలని కోరారు. ఇప్పటికే 26 వేల మంది ఆశావర్కర్లు, 8 వేల మంది ఎఎన్‌ఎమ్‌లు, 69 వేల పోలీస్ సిబ్బంది, వందల కొద్ది డాక్టర్లు ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం పనిచేస్తున్నారని అన్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ల వద్దని, అలా సంచరిస్తే కఠిన శిక్షలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలను లెక్కచేయకుండా ప్రజలకు ఇబ్బంది చేస్తే ఊపేక్షించేది లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

హోం క్వారంటైన్లో ఉన్న పిల్లలను బయటకు రాకుండా చూడాల్సిన బాధ్యత ఆయా తల్లిదండ్రులదేనని మంత్రి అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ సంస్థలన్నీ కలసి కరోనా నియంత్రణ కోసం కృషి చేస్తామన్నారు. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సిసిఎంబి కూడా సిద్ధమైందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసరమైతే తప్ప ఆపరేషన్లు చేస్తలేమని, మరో 10 రోజుల పాటు ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు.

Etela said 6 corona cases reported
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News