Saturday, May 4, 2024

అరుదైన ఐఎఎస్ అధికారి

- Advertisement -
- Advertisement -

Ex-CS S.V. Prasad passed away

ఆయన లేరు,
ఆయన నవ్వు ఉంది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా, నలుగురు ముఖ్యమంత్రులకు కార్యదర్శిగా పని చేసిన ఎస్.వి. ప్రసాద్ చనిపోయారన్న వార్తను నమ్మలేకపోతున్నాను. ఎదుటి వారిని ఆకట్టుకునే చిరునవ్వు ఆయనది. ఆ నవ్వుని ఇక చూడబోమన్న వాస్తవాన్ని జీర్ణించుకోవడం కష్టం. బాగా నూనె రాసి చక్కగా దువ్వుకున్న తలతో చిన్న పిల్లాడి ముఖం గల ఈ ఐఎఎస్ అధికారిని మొట్టమొదట 70వ దశకం చివరిలో కలిశాను. అప్పుడాయన విశాఖపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్‌గా ఉండేవారు. ఆ సమయంలో ఆయనతో ఏమి మాట్లాడానో గుర్తు లేదుగాని ఆయన చిరచిహ్నమైన ఆ నవ్వు ఇంకా అలాగే నా మనసులో ముద్రపడిపోయి ఉంది. 90లలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కార్యదర్శిగా ఉన్నప్పుడు మళ్లీ ఆయన్ను కలిశాను. సెక్రటేరియట్‌లోని ముఖ్యమంత్రి చాంబర్‌లో గాని, శాసన సభలో గాని ఆయన్ను కలుస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత పదేళ్ల పాటు వృత్తిపరంగానో, అప్పుడప్పుడు స్నేహపూర్వకంగా ఓ కప్పు టీ తాగడం కోసమో వెళ్లి ప్రతి వారం ఆయనతో మాట్లాడేవాడిని.

ఎప్పుడూ బిజీగా ఉండేవారు. కాని ఆ పని భారాన్ని, ఉన్నత పదవీ బాధ్యతలను మనల్ని కట్టిపడేసే ఆ నవ్వు మాటున కనిపించనిచ్చేవారు కాదు. సరదాగా సాగే సంభాషణకు, ఎదుటి వారిని నొప్పించకుండా మధ్యలోనే ముగింపు చెప్పడంలో దిట్ట ప్రసాద్ గారు. చాలా తెలివి తేటలు గల ఐఎఎస్ ఆఫీసర్ , తన కార్యదర్శి యుబి రాఘవేంద్రరావును, ఎన్‌టి రామారావు ‘ నా మానస పుత్రుడు’ అనే వారు. ముఖ్యమంత్రి మనసెరిగి ఆయన ఆలోచనలకు కార్యరూపం ఇవ్వగల స్వతస్సిద్ధ సామర్థమున్నవాడు యుబి.

ఈ లక్షణం ప్రసాద్‌గారిలో కూడా దండిగా ఉండేది. అందుకే ఆలోచనల్లో, దృష్టికోణంలో, ప్రవర్తనలో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఉండే ముగ్గురు (లేదా ముఖ్యమంత్రుల వద్ద సమర్థవంతంగా పని చేసి వారి విశ్వాసాన్ని, ప్రేమను చూరగొన్నారు. నేను రిటైర్ అయిన తర్వాత కుందన్‌బాగ్‌లో మేము ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం. ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు, జడ్జీల క్వార్టర్స్ కూడా అక్కడే ఉండేవి. మా ఇంటికి వెళ్లాలంటే తప్పనిసరిగా ప్రసాద్ గారి ఇంటి ముందు నుంచే వెళ్లాల్సి వచ్చేది. అయితే ఆ తర్వాత ఆయన్ను కలవడం జరగలేదు. అప్పుడప్పుడూ నా ఫేస్‌బుక్ పోస్టింగులపై కామెంట్ పెట్టేవారు. వారి ఆత్మకు శాంతి, సద్గతి కలగాలని కోరుకుంటున్నాను. ప్రసాద్ గారు మన మధ్యలేరు, ఆయన నవ్వు మాత్రం మనందరి హృదయాలలోనూ మెదులుతూ ఉంటుంది.

నిజాయితీ, నిబద్ధతలు గల అజాతశత్రువు

దాదాపు ఆరుగురు ముఖ్యమంత్రుల వద్ద 13 ఏళ్ల పాటు వివాద రహితం గా ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విజిలెన్స్ ప్రధాన కమీషనర్ గా పని చేసిన మాజీ ఐ ఏ ఎస్ అధికారి శ్రీ ఎస్. వీ. ప్రసాద్ గారు మనతో లేరనే విషయం నమ్మలేక పోతున్నాం. భారీ విగ్రహం కాకపోయినా, స్ఫుర ధ్రూపి, చక్కని చిరునవ్వు తో ఎదురయిన వారిని ఆత్మీయంగా పలుకరించే మానవతా వాది శ్రీ ప్రసాద్ గారు మంగళవారం నాడు కన్ను మూసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర లో నాకు తెలిసి, ఏ ఐ ఏ ఎస్ అధికారి కూడా ఒక పార్టీ ముఖ్యమంత్రి వద్ద పనిచేసి, మరొక రాజకీయ పార్టీ అధికారం లోకి వచ్చినపుడు ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధానాధికారి గా పని చేసిన ఉదంతం లేదు. ముఖ్యమంత్రులు కూడా అందుకు అంగీకరించే సంప్రదాయం ఉండేది కాదు. కానీ, ప్రసాద్ గారి విషయంలో చరిత్ర తిరగ రాసేరని చెప్పవచ్చు. ముఖ్యమంత్రులు శ్రీయుతులు ఎన్. జనార్ధన రెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి, ఎన్. టి. రామా రావు, చంద్రబాబు నాయుడు, రోశయ్య హయం లో సీఎంఓ ప్రధానాధికారిగా, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా, విజిలెన్స్ ప్రధాన కమీషనర్ గా ప్రసాద్ గారు పని చేసి, అందరి చేత శహాబాష్ అనిపించుకోవడమే కాదు, గౌరవ, మర్యాద లను కూడా పొందారు.

వాస్తవానికి, కాంగ్రెస్ ముఖ్యమంత్రుల వద్ద పని చేసిన ఉన్నతాధికారి శ్రీ ప్రసాద్ గారిని తెలుగుదేశం ప్రభుత్వ ముఖ్యమంత్రి సీఎంఓ కీలక అధికారిగా ఎలా తీసుకుంటారని, కొంత చర్చ కూడా నడిచింది. అయితే, ఇటు ప్రభుత్వానికి, అటు ప్రసాద్ గారికి శ్రేయోభిలాషి, ముఖ్యులైన ఒక పెద్దాయన సలహా మేరకు సీఎంఓ కి రావాలని కోరారు. ఏ పదవిలో ఉన్నా, సమయ పాలన, సమన్వయం, సమర్ధత తో ఆ పదవికి వన్నె తెచ్చారు ప్రసాద్ గారు. ముఖ్యమంత్రుల వద్ద ఉన్నపుడు అటు రాజకీయ నాయకులను, ఇటు ప్రభుత్వ యంత్రాంగం మధ్య ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా, రాకుండా సమాతూకం తో సమన్వయం చేసుకొని, వెళ్లిన సమర్ధులైన అధికారి ఆయన. దివిసీమ ఉప్పెన సమయంలో అప్పుడే కొత్తగా సబ్ కలెక్టర్‌గా వారు విశేషమైన సేవలు అందించారు. ప్రసాద్ గారు తూర్పు గోదావరి జిల్లాలోని ఒక మారుమూల గ్రామం ఒడిసలేరు కు చెందిన వారు. చదువుల్లో మంచి ప్రతిభ కనబరిచి, ఇంజనీరింగ్, ఐ ఐ ఎమ్ లో ఎమ్ బి ఏ చేశారు.

రెండు మెడికల్ కాలేజీ ల్లో సీట్ కూడా వచ్చింది. అయితే, వారి మేనమామ గారి ప్రొద్బ్లంతో సివిల్స్ లో మొదటి ఛాన్స్ కే మంచి ర్యాంక్ తో ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు ఎంపిక అయ్యారు. ఆర్టీసీ ఎమ్ డీ గా, సమాచార శాఖ సంచాలకులు గా, విశాఖపట్నం మునిసిపల్ కమీషనర్ గా ప్రసాద్ గారు తనదైన ముద్ర వేశారు.ప్రసాద్ గారితో నా ఉద్యోగ జీవితం లో మంచి అనుబంధం ఉండేది. 1988 అక్టోబర్-నవంబర్ నెలల్లో అనుకుంటాను… ప్రసాద్ గారు సమాచార సంచాలకులు గా పదవీ బాధ్యతలు తీసుకున్న కొత్త లో హైదరాబాద్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (హెచ్ యూ జే) మీట్ ది ప్రెస్ లో పాల్గొన్నారు.. అప్పుడు నేను ప్రముఖ దిన పత్రిక లో పాత్రికేయునిగా ఉన్నాను. అప్పటికే, రాష్ట్ర సర్వీస్ కమిషన్ ద్వారా జిల్లా పౌర సంబంధాల అధికారి గా ఎంపికయి, కమీషనర్ వెలివల్లి సైదులు గారు పోస్టింగ్ ఇవ్వకుండా 20 నెలలు గడిచిపోయాయి.

ఆ దశలో, ప్రసాద్ గారు సమాచార శాఖ కు వచ్చారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమం ముగిసిన తరువాత, అప్పటి హెచ్ యూ జే అధ్యక్షులు దాసు కేశవ రావు గారు ప్రసాద్ గారితో, నా పోస్టింగ్ ఆర్డర్ రాలేదన్న విషయాన్ని ప్రస్తావించారు.. నేను ఆయన ను కలవడం గానీ, ఫోన్ లో అడగడం గానీ జరగలేదు… అయినప్పటికీ, సరిగ్గా వారం రోజుల్లో మా ఇంటి అడ్రస్ కి రిజిస్టర్డ్ పోస్ట్ లో నా పోస్టింగ్ ఆర్డర్ పంపించిన గొప్ప మనిషి ప్రసాద్ గారు.. ఏదైనా, జిల్లా లో పని చేస్తానంటే, పాత్రికేయునిగా చేసిన అనుభవం కేంద్ర కార్యాలయం మీడియా రిలేషన్స్ కి ఉపయోగ పడతాయి. నేను ఉన్నన్నాళ్ళు కేంద్ర కార్యాలయం లోనే పని చెయ్యాలని నన్ను ఆదేశించారు.

అదే మాదిరి, 2011 జనవరి లో ప్రతి ఏడాది మాదిరి కుటుంబం తో శ్రీకాకుళం జిల్లా లోని మా స్వగ్రామం సంక్రాంతి కి వెళ్లాను. అప్పటికి నేను సమాచార శాఖ అదనపు సంచాలకునిగా పని చేస్తున్నాను. జనవరి 17 న ప్రసాద్ గారు ఫోన్ చేసి, ఎక్కడ ఉన్నావు, అని అడిగారు. ఊరిలో ఉన్నానని చెప్పాను. తక్షణమే హైదరాబాద్ కు రావలసిందిగా ఆదేశించారు.. ఎందుకని అడిగితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర ప్రెస్ కార్యదర్శి గా నిన్ను నియమిస్తున్నాం, అని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి నేను కానీ, నాకు వారు కానీ, వ్యక్తిగతంగా తెలియదు కదండీ, అంటే, 15 మంది పాత్రికేయులు, ఉన్నతాధికారులు, ప్రైవేట్ వ్యక్తులను స్క్రూటినైజ్ చేసి, నిన్ను ఎంపిక చేసాం.. రావాల్సిందే అన్నారు ప్రసాద్ గారు. నేను ప్రయాణం లో ఉండగానే, నా పోస్టింగ్ జీ. ఓ జారీ చేయించారు. ఆయన చేతి వ్రాత సువర్ణాక్షరాల్లా ఉండేవి. డ్రాఫ్టింగ్ కూడా సంక్షిప్తంగా, నిర్ణయాత్మకంగా, చక్కగా ఉండేది. అధికారులు, సిబ్బంది, రాజకీయ నాయకులతో ఎంతో ఆత్మీయంగా సంబంధాలను నెరపిన మానవతా వాది. అజాత శత్రువు ప్రసాద్ గారు. ఆయన ఏ లోకంలో ఉన్నా, నాతో సహా వేలాది మంది గుండెల్లో ఎల్లప్పుడూ నిలిచే ఉంటారు.. వారికి నా మనః పూర్వక నివాళులు అర్పిస్తున్నాను.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News