Sunday, April 28, 2024

కల్తీలపై ఎక్సైజ్ శాఖ నిఘా !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో కల్తీ మద్యం, కల్లు, గుడుంబాలపై ఎక్సైజ్ శాఖకు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జిహెచ్‌ఎంసి పరిధిలో గుడుంబా, గంజాయితో పాటు అక్రమ మద్యం, కల్తీ కల్లు అమ్మకాలు జరుగుతున్నాయని ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. దీంతోపాటు కొన్ని జిల్లాలో గుడుంబాను యథేచ్ఛగా విక్రయిస్తుండడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు దానిని అరికట్టడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. గతేడాది దాదాపు 50 వేల లీటర్ల గుడుంబాను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేయగా ప్రస్తుతం 5 నెలల్లో 15 వేల లీటర్ల వరకు గుడుంబా సీజ్ చేయడం గమనార్హం.

అయితే ఏడాదికి 12 లక్షల లీటర్ల గుడుంబా విక్రయాలు జరుగుతున్నాయని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటుండగా, దానిని అరికట్టడానికి తగిన సిబ్బంది లేకపోవడం కూడా తమకు ఇబ్బంది తెచ్చిపెడుతుందని ఆ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు కొన్ని బెల్టుషాపుల్లో కల్తీ మద్యం అమ్మకాలు మందుబాబుల ప్రాణాల మీదకు తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ బెల్ట్ షాపులో లిక్కర్ తాగి ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఎక్సైజ్ పోలీసులు బెల్ట్‌షాపుపై దాడి నిర్వహించి నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

గతేడాది ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అమ్ముతున్న సుమారు రూ.2 కోట్ల కల్తీ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు గతనెల శంషాబాద్ విమానాశ్రయంలో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్న మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు భారీగా స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
ప్రభుత్వానికి నివేదిక
దీంతోపాటు కల్తీ కల్లుకు సంబంధించి డైజోఫాం, ఆల్ఫాజోలం అతిగా వాడుతూ కల్తీకల్లును తయారు చేస్తున్నారని ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో కల్లు కల్తీ అవుతోందని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రభుత్వానికి సైతం నివేదిక అందించారు. అయితే ఇతర రాష్ట్రాల్లో ఇక్కడి కంటే తక్కువ ధరకు కల్లు దొరకడంతో చాలామంది విక్రయదారులు అక్కడి నుంచి ఇక్కడకు కల్లును దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలో మద్యం ధరలు చాలా తక్కువగా ఉండడంతో అక్కడి నుంచి అక్రమంగా సరిహద్దులకు జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. ఇదంతా ఎక్సైజ్, పోలీసుశాఖలోని కొందరు అధికారులు, సిబ్బంది కనుసన్నలోనే సాగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News