Friday, May 10, 2024

పర్యావరణం.. ప్రజారోగ్యం ఎక్కడ?

- Advertisement -
- Advertisement -

 Festside Management Bill 2020

 

ఫెస్టిసైడ్ మేనేజ్‌మెంట్ బిల్లు 2020పై నిపుణుల పెదవి విరుపు
ఏటేటా పెరుగుతున్న వినియోగం.. విషపూరిత మరణాలు
పురుగు మందుల ధరల నియంత్రణ లేదు
ప్రచార ప్రకటనలు నిషేధించాలని సూచించినా పట్టని కేంద్రం
నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం శూన్యం

మన తెలంగాణ/హైదరాబాద్: పురుగు మందుల ధరల నియంత్రణపై ప్రస్తావన లేకుండానే ఫెస్టిసైడ్ మేనేజ్‌మెంట్ ముసాయిదా బిల్లు 2020కు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపిందని విమర్శలు వస్తున్నాయి. త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న ఈ ముసాయిదా బిల్లుపై వ్యవసాయ నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వాలు పెదవి విరుస్తున్నాయి. తాము చేసిన సూచనలు పరిగణనలోకి తీసుకోకుండానే తీసుకువస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ బిల్లును చూస్తే పరిపాలన పరమైన మార్పులు తప్ప పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా లేదనేది స్పష్టమౌతోంది. ప్రధానంగా పురుగు మందుల యొక్క అన్ని రకాల ప్రచార ప్రకటనలను నిషేధించాలని నిపుణులు సూచించారు. వాణిజ్య ఆసక్తికి తగినట్లుగా ప్రకటనలు ఉంటున్నాయని, ఇవి రైతులను ప్రభావితం చేస్తున్నాయి. చదువురాని అన్నదాతలు వీటిని కొనుగోలు చేసి అధికంగా వినియోగించడంతో పాటు నష్టపోతున్నారని వివరించారు.

అయితే బిల్లులో ఈ విషయమై కేంద్రం ఎటువంటి ప్రతిపాదన చేయలేదు. అలాగే పురుగు మందుల కంపెనీ, డీలర్ ప్రతినిధులను రైతులతో సంభాషించడాన్ని అనుమతించకూడదని బిల్లులో పొందుపర్చాలని సూచిస్తున్నారు. ఇందుకోసం పురుగుమందుల కంపెనీలు ‘ప్రవర్తనా నియమావళిని’ అభివృద్ధి చేసి అనుసరించాలని రాష్ట్ర వ్యవసాయాధికారి ఒకరు మన తెలంగాణతో వ్యాఖ్యానించారు. అలాగే పురుగు మందుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం, అధికారాలు సరిగ్గా లేవు. దీనిపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అభ్యంతరాన్ని లేవనెత్తాయి. కొన్ని రాష్ట్రాలు గ్లైఫోసేట్‌ను నిషేధించాయి. అయితే అది ఎక్కువ కాలం అనుమతించబడలేదు. రాష్ట్రంలోని వ్యవసాయ, -పర్యావరణ అంశాలపై అక్కడి ప్రభుత్వాలకు అవగాహన ఉంటుందని, పురుగుమందులను నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్, అగ్రోస్ ఎం.డి రాములు వ్యాఖ్యానించారు.

పురుగు మందులతో దీర్ఘకాలిక వ్యాధులు వస్తుండటంతో వినియోగం తగ్గే విధంగా బిల్లును తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. 2014లో నేషనల్ క్రైమ్స్ రికార్డు బ్యూరో ప్రకారం 7,365 విషపూరిత కేసులను పురుగుమందుల వల్లనే నమోదయ్యాయి. అందులో 5,915 మంది మరణించారు. అలాగే 2015లో 7,672 కేసుల్లో 7,060 మరణాలు సంభవించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత 201415లో 2805.71 మెట్రిక్ టన్నుల పురుగు మందుల వినియోగం ఉండగా, 201516లో కేవలం 992.88 మెట్రిక్ టన్నులు, 201617లో 3436.39 టన్నులు, 201718కి వచ్చేసరికి 4865.74 టన్నులకు చేరుకుంది.

క్లాస్ వన్ పురుగుమందుల నిషేధం ఏది ?
తీవ్రమైన విషపూరితం ఆధారంగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని పురుగుమందులను చాలా ప్రమాదకరమైన (క్లాస్ వన్ ఎ), అత్యంత ప్రమాదకరమైన (క్లాస్ బి) గా వర్గీకరిస్తుంది. క్లాస్ వన్ పురుగుమందుల అమ్మకం, వాడకాన్ని నిషేధించడానికి బిల్లులో అవసరమైన నిబంధనలు చేయాలని వ్యవసాయ నిపుణులు దొంతిరి నరసింహారెడ్డి సూచించారు. అయితే అటువంటి మార్పులేవి చేయకుండానే బిల్లుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. అనుపమ్ వర్మ కమిటీ సిఫారసుల తర్వాత 2018 ఆగస్టులో కేంద్రం 18 పురుగుమందులను నిషేధించింది. అయితే ఎక్కువగా ఉపయోగించే రెండు క్లాస్ వన్ పురుగు మందులైన మోనోక్రోటోఫోస్, కార్బోఫ్యూరాన్‌లను బ్యాన్ చేయకుండా అలాగే వదిలేసింది.

చిన్న జరిమానాలతో నియంత్రణ ఎలా
కోట్ల రూపాయల విలువైన పురుగుమందులను విక్రయించే పెద్ద కంపెనీకి చిన్న, చిన్న ఆర్థిక జరిమానాలు సరిపోదని చెబుతున్నారు. ఉదాహరణకు మిస్ బ్రాండెడ్ పురుగు మందులను అమ్మినందుకు రూ. ఒక లక్ష రూ.5 లక్షలు జరిమానా బిల్లులో ప్రతిపాదించారు. అయితే ఇవి ఏ మాత్రం మిస్ బ్రాండెడ్‌ను ఆరికట్టలేవని పేర్కొంటున్నారు. అలాగే కొన్ని తీవ్ర కేసులకు ప్రతిపాదించిన రూ.10 నుంచి రూ. 50 లక్షల జరిమానా కూడా తగినంతగా నిరోధించకపోవచ్చునని అభిప్రాయపడుతున్నారు. వీటిపై స్పష్టత ఇవ్వలేదు. అలాగే వీటిని రుజువు చేయాల్సిన బాధ్యత రైతుల మీదనే ఉండటంతో కంపెనీలకు వెసులుబాటు కల్పించనట్లుగా ఉందంటున్నారు. వ్యక్తిగత రక్షణ పరికరాలు లేదా భద్రతా సామగ్రి లేకుండా పురుగుమందుల సంస్థ పురుగుమందును విక్రయించ డం చట్టవిరుద్ధంగా చేయాలని సూచిస్తున్నారు. పురుగు మందుల వినియోగం మహారాష్ట్రలో అత్యధికంగా ఉంది. ఆ తరువాత ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా ఉన్నాయి.

ముసాయిదాలో ముఖ్యమైన అంశాలు
-ప్రస్తుతం ఉన్న సెంట్రల్ ఇన్‌సెక్ట్ సైడ్స్ బోర్డు పేరును సెంట్రల్ పెస్టిసైడ్స్‌గా మార్పు చేశారు. దీనికి వైద్య సేవల డైరెక్టర్ జనరల్ ఛైర్మన్‌గా ఉండనున్నారు. బోర్డు లో ఇద్దరు రైతు ప్రతినిధులకు అవకాశం కల్పించారు. ఇందులోనే ఒక మహిళా రైతు ఉండనున్నారు.
-ప్రస్తుతం ఎవరైనా పురుగు మందు తయారు చేస్తే రిజిస్ట్రేషన్ వరకు మాత్రమే పరిమితం కాగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేశాక వాటి సామర్థం ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు. వ్యవసాయ ఉత్పత్తిలో నమోదిత పురుగు మందుల పనితీరును కూడా పర్యవేక్షణ ఉండనుంది
-మానవులు, జంతువులు, పర్యావరణంపై ఎటువంటి ప్రభావం చూపనుందో రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే దరఖాస్తులో పేర్కొవాల్సి ఉంటుంది.

Expert dissatisfaction over Festside Management Bill 2020
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News