Monday, April 29, 2024

సుప్రీం సూపర్ తీర్పులు

- Advertisement -
- Advertisement -

Supreme court

 

130కోట్ల మంది భారతీయులు ఆమోదించారు
– అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రధాని మోడీ

లింగపర న్యాయంతోనే అభివృద్ధి
కీలకరంగాల్లో మహిళలకు ప్రాధాన్యం
మూడు వ్యవస్థలు పరస్పరం గౌరవించుకోవాలి
ఏ న్యాయవ్యవస్థకైనా మహాత్ముడే ఆదర్శం:మోడీ
న్యాయమే రాజ్యాంగం మూలస్తంభం : సిజెఐ బోబ్డే
ఉగ్రవాద నిర్మూలన ముఖ్యం : జస్టిస్ ఎన్‌వి రమణ
ఉగ్రవాదానికి, అవినీతికి ప్రైవసీ హక్కులేదు : రవిశంకర్ ప్రసాద్

న్యూఢిల్లీ: ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన కీలకమైన తీర్పుల్ని 130 కోట్లమంది భారతీయులు మనస్ఫూర్తిగా ఆమోదించారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం పేర్కొన్నారు. ఆయా కేసుల్లో తీర్పులకు ముందు … ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అని భయాందోళనలు వ్యక్తమైనా వారు పట్టించుకోలేదన్నారు. ఆ విశిష్టమైన తీర్పులు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయన్నారు. శనివారం సుప్రీంకోర్టులో అంతర్జాతీయ న్యాయ సదస్సు 2020 ప్రారంభ సమావేశంలో మోడీ ‘న్యాయవ్యవస్థ మారుతున్న ప్రపంచం’ అనే అంశంపై ప్రసంగించారు. రాజకీయంగా అతి సున్నితమైన అయోధ్య కేసుతో సహా అనేక ముఖ్యమైన కేసుల్లో చరిత్రాత్మకమైన తీర్పులిచ్చిందని న్యాయవ్యవస్థను ప్రశంసించారు.

లింగపరమైన న్యాయం లేకుండా ప్రపంచంలో ఏ దేశం కూడా తను సంపూర్ణంగా చెందామని చెప్పలేదని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మోడీ లింగమార్పిడి చేయించుకున్నవారు(ట్రాన్స్‌జెండర్స్) , త్రిపుల్ తలాక్ పై ఉన్న చట్టాలు, దివ్యాంగుల (అంగవికలురు) హక్కుల గురించి ప్రస్తావించారు. సైనికదళాల్లో మహిళలకు హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, వారికి 26 వారాలు ప్రసూతి సెలవు మంజూరు చేసిందని పేర్కొన్నారు.

సమతుల్యత కోసం…
అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతకోసం పర్యావరణ న్యాయశాస్త్రాధ్యయనం చేసి పునర్నిర్వచనం చేసినందుకు భారత న్యాయవ్యవస్థను నరేంద్రమోడీ ప్రశంసించారు. సాంకేతికత, ఇంటర్‌నెట్ వినియోగం గురించి ప్రత్యేకంగా చెబుతూ మోడీ కోర్టుల్లో ఇది ప్రక్రియాపరమైన నిర్వహణలో తోడ్పడుతుందని, తీర్పుల వ్యవస్థకు విస్తృతంగా ఉపయోగపడుతుందని చెప్పారు. మనిషి తెలివితేటలతో కృత్రిమ మేధస్సును జోడించడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇందువల్ల వేగంగా న్యాయాన్ని అందించ వచ్చన్నారు.

‘మారుతున్న కాలంలో డేటా పరిరక్షణ, సైబర్ నేరాలు వంటివి న్యాయవ్యవస్థకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. ఈ దశాబ్దంలో ప్రపంచంలో గణనీయమైన మార్పులు వస్తాయి. సమాజం, ఆర్థికరంగం లేదా సాంకేతికత వంటి అన్ని రంగాలపై ఆ ప్రభావం పడుతుంది. అయితే ఆ మార్పులు హేతుబద్ధమైనవిగా, న్యాయంగా ఉండాలి’ అని ప్రధాని ఆకాంక్షించారు. ప్రతి కోర్టును ఇ కోర్టుల వ్యవస్థతో అనుసంధానించేందుకు, నేషనల్ జ్యుడీషియల్ డేటా వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అందువల్ల న్యాయప్రక్రియ సరళతరమవుతుందన్నారు.

మహాత్ముడే ఆదర్శం
మహాత్మాగాంధీ సేవల్ని ప్రస్తావిస్తూ మోడీ ఆయన జీవితం సత్యం, మానవసేవకు అంకితమైందని, నేడు ఏ న్యాయవ్యవస్థకైనా అవే పునాదులని చెప్పారు. న్యాయవ్యవస్థ, చట్టసభలు, పాలనా యంత్రాంగం వ్యవస్థల్ని ప్రశంసిస్తూ ‘ఇవి మిగిలిన వ్యవస్థల పరిధిని, హుందాతనాన్ని గౌరవించాలి. ఈ మూడూ రాజ్యాంగానికి మూలస్తంభాలు. ఇవి వివిధ సందర్భాల్లో దేశం ఎదుర్కొన్న సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొన్నాయి. భారతదేశం అలాంటి సుసంపన్నమైన సంప్రదాయం నెలకొన్నందుకు మనం గర్వించాలి. గత ఐదేళ్లలో దేశంలో వివిధ వ్యవస్థలు ఈ సంప్రదాయాన్ని మరింత బలోపేతం చేశాయి’ అని ప్రధాని మోడీ కొనియాడారు. ఈసందర్భంగా ఆయన 1,500 పాత చట్టాల్ని రద్దు చేయడంలో ప్రభుత్వం కృషిని ప్రస్తావించారు. ‘పనికిరాని చట్టాలను పక్కన పెట్టడమే కాకుండా సామాజిక అల్లికను పటిష్టం చేసే లక్షంతో కొత్త చట్టాలను తీసుకురావడం కూడా వేగంగా జరిగింది.

మహిళలకు న్యాయం
సమాన హక్కులనే అంశాలకింద భారత రాజ్యాంగం లింగపరమైన న్యాయాన్ని కల్పించిందని, స్వాతంత్య్రం తర్వాత మహిళలకు కూడా ఓటు హక్కు కల్పించిన దేశాల్లో భారతదేశం కూడా ఒకటని ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా మోడీ …మహిళలకోసం ప్రభుత్వం చేపట్టిన ‘బేటీ బచావో బేటీ పఢావో’ వంటి పథకాల్ని ప్రస్తావించి, మహిళా సాధికారతకు ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు. సైన్యంలోను, పైలట్లగానూ, గనుల్లోనూ మహిళలు పనిచేస్తున్నారన్నారు. భారత ఆర్థికరంగం గురించి చెబుతూ ఐదారేళ్ల కిందట ఇది ప్రపంచంలో 11వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు ఐదో స్థానంలో ఉందని తెలిపారు.

న్యాయమే కీలకం : బోబ్డే
ఆధునిక రాజ్యాంగాల్లో దేని అమలుకైనా న్యాయమే మూలస్తంభమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) ఎస్‌ఎ బోబ్డే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ న్యాయమూర్తుల సదస్సులో ‘న్యాయవ్యవస్థ మారుతున్న ప్రపంచం’ అనే అంశంపై మాట్లాడుతూ ఆయన ప్రపంచంలో ప్రస్తుత సవాళ్లను అది ఎలా ఎదుర్కొంటున్న దానిపైనే దాని విజయం ఆధారపడి ఉంటుందన్నారు. న్యాయపాలనను ఆధారం చేసుకునే రాజ్యాంగాల రచన జరుగుతోందన్నారు. చట్టపరమైన హక్కులు చట్టపరమైన విధులకు అవినాభావ సంబంధముందన్నారు.

‘ప్రతి పౌరుడి బాధ్యతనూ రాజ్యాంగం చెప్పింది. అది జరిగినప్పుడు వ్యవస్థ, సిద్ధాంతాలు గౌరవించబడతాయి. అయితే ఈ అంశం తరచు నిర్లక్ష్యానికి గురవుతుంటుంది. ప్రపంచంలో 50కి పైగా దేశాలు తమ రాజ్యాంగాల్లో పౌరుడి మౌలిక బాధ్యతల గురించి స్పష్టంగా పేర్కొన్నాయి. హక్కులు కావాలనుకున్నప్పుడు బాధ్యతను నెరవేర్చాలని మహాత్మాగాంధీ చెప్పారు. బాధ్యతను నెరవేర్చడమే అసలైన హక్కులు. శక్తివంతమైన, స్వతంత్రత కలిగిన న్యాయవ్యవస్థను రాజ్యాంగం సృష్టించింది, చట్టవ్యవస్థతో, పాలనా వ్యవస్థతో దానికి సంబంధం లేదు’ అని సిజెఐ స్పష్టం చేశారు.

నమ్మశక్యం కాని సాంకేతికాభివృద్ధిని నేడు మనం చూస్తున్నామని ‘ఏ మూల ఏ మార్పు జరిగినా అది ప్రపంచంలో అనేక చోట్ల మార్పులకు దారితీస్తోంది’ అన్నారు. మనకు ‘వ్యాస స్మృతి’ ఉందని, వివిధ పరిస్థితుల్లో నిర్ణయాలు ఎలా ఉండాలనేది అది తెలిపిందని కూడా చీఫ్ జస్టిస్ బోబ్డే వ్యాఖ్యానించారు.

అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ కూడా ఈ సదస్సులో మాట్లాడారు. పేదరికం గురించి ప్రస్తావించి, దాని నిర్మూలనకు వివిధ ప్రభుత్వాలు తీసుకున్న చర్యల్ని వివరించారు. సామాజిక అంశాలతో సహా ప్రభుత్వం అనేక సంస్కరణల్ని తెచ్చిందన్నారు.

ప్రపంచాన్ని పీడిస్తున్న సమస్యలు
ఉగ్రవాదం, సైబర్ క్రైమ్, పర్యావరణ స్వచ్ఛత పతనం అవుతుండడం, ఆరోగ్య సమస్యలు వంటివి నేడు భారతదేశంతో సహా ప్రపంచంలో అనేక దేశాల్ని పట్టి పీడిస్తున్నాయని, న్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని నవ్య సిద్ధాంతాల్ని రూపొందించి వాటిని తగు విధంగా పరిష్కరించాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థకు ఉందని సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి ఎన్‌వి రమణ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ న్యాయసదస్సులో మాట్లాడుతూ ఆయన ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఉగ్రవాదం ఒకటన్నారు. ‘ప్రస్తుతం ప్రపంచీకరణ వల్ల ప్రపంచం చిన్నదైంది. సమస్యలు ఉమ్మడివే. కాబట్టి పరిష్కారాలు కూడా ఏకగ్రీవంగా ఉండాలి.
ఉగ్రవాదం భారతదేశంతో సహా ప్రపంచంలో ప్రతిభాగానికీ ప్రధాన సమస్య అయింది.

కొత్త సిద్ధాంతాల ద్వారా దానిపై పోరాడాలి. అదే సమయంలో న్యాయాన్ని కూడా నిలబెట్టాలి. దానికి భంగం వాటిల్లకూడదు. దేశాల మధ్య సరిహద్దు ఒప్పందాలు, పౌరుల్లో చైతన్యం, పెట్టుబడులు వాణిజ్యం అనేవి ప్రపంచీకరణ డిమాండ్లుగా మారాయి. న్యాయంపట్ల అచంచల విశ్వాసంతో వ్యవస్థల్ని ఏర్పాటు చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది’ అని జస్టిస్ ఎన్‌వి రమణ చెప్పారు.

న్యాయశాఖామంత్రి రవిశంకర్ ప్రసాద్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని ప్రస్తావించారు. ఉగ్రవాదం, అవినీతిపరులకు ప్రైవసీ హక్కు లేదని, అలాంటి వారు వ్యవస్థను దుర్వినియోగపరచకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. పాలన ప్రజాప్రతినిధులదని, తీర్పులిచ్చే బాధ్యత జడ్జీలదేనని అన్నారు.

మోడీ బహుముఖ మేధావి

సుప్రీంకోర్టు జడ్జి అరుణ్ మిశ్రా ప్రశంస
న్యూఢిల్లీ: ‘ప్రధానమంత్రి నరేంద్రమోడీ అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన అద్భుతమైన వ్యక్తి’ అని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అరుణ్ మిశ్రా ప్రధానిని ప్రశంసల జల్లులో ముంచెత్తారు. ‘ఆయన (మోడీ) బహుముఖ మేధావి. ప్రపంచ స్థాయిలో ఆలోచిస్తారు. స్థానికంగా ఆచరిస్తారు’ అని కితాబిచ్చారు. మోడీ నాయకత్వంలో భారతదేశం అంతర్జాతీయ సమాజంలో ఒక బాధ్యతాయుతమైన, స్నేహపూరిత సభ్యురాలిగా మారిందని చెప్పారు. సుప్రీంకోర్టులో శనివారం జరిగిన అంతర్జాతీయ న్యాయసదస్సు 2020 న్యాయ వ్యవస్థ, మారుతున్న ప్రపంచం ప్రారంభ సమావేశంలో వందన సమర్పణ చేస్తూ జస్టిస్ మిశ్రా ఈ వ్యాఖ్య చేశారు. కాలం చెల్లిన 1500 చట్టాల్ని తొలగించినందుకు ప్రధానిని, న్యాయశాఖామంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ను ఆయన అభినందించారు.

‘న్యాయవ్యవస్థ జాతీయంగా, అంతర్జాతీయంగా సవాళ్లను ఎదుర్కొనడం మామూలేనని, అయితే మారుతున్న ప్రపంచంలో దాని పాత్ర గణనీయమైందని జస్టిస్ మిశ్రా తెలిపారు.‘మనిషి గౌరవంగా బతకడం మన ప్రాథమిక ఆశయం. అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించే బహుముఖ మేధావి మోడీ ఈ సదస్సుకు ఎజెండాను రూపొందించి, చర్చల్లో ఒక కేటలిస్ట్‌గా ఉపయోగపడి, స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసినందుకు ధన్యవాదాలు’ అని జస్టీస్ మిశ్రా వందన సమర్పణలో చెప్పారు. భారతదేశం రాజ్యాంగానికి కట్టుబడి ఉంది. ప్రపంచ శాంతి భద్రతలు, ఉగ్రవాదం నుంచి స్వేచ్ఛ పొందడం అంశాలకు కట్టుబడి ఉంది. అభివృద్ధికి పర్యావరణ పరిరక్షణ అతిముఖ్యమని భావిస్తుంది’ అని జస్టిస్ మిశ్రా స్పష్టం చేశారు.

Supreme court super Judgments
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News