Friday, May 3, 2024

వానాకాలం ‘సాగు’ మొదలు

- Advertisement -
- Advertisement -

Farmers are planting crops of vaanakalam

 

69,490 ఎకరాలలో పంటలు వేసినట్లు వ్యవసాయ శాఖ తాజా నివేదిక l ప్రభుత్వం వద్దని చెప్పినా 3156 ఎకరాలలో మొక్కజొన్న l రేపో, మాపో నైరుతి.. తొలకరితో సాగుకు మరింత ఊపు

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో సాగు సంబురం మొదలైంది. రైతులు వానాకలం పంటలు వేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 69,490 ఎకరాలలో వివిధ పంటలు సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి తాజాగా నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వం కోటి 25 లక్షల ఎకరాలలో సాగును ప్రతిపాదించనిప్పటికీ, గత ఐదు సంవత్సరాల సాగు ఆధారంగా వ్యవసాయ శాఖ సాధారణ సాగు అంచనాలను లెక్కిస్తుంది. దీని ప్రకారం రాష్ట్రంలో ఈ వానాకాలంలో కోటి 3 లక్షల ఎకరాల సాధారణ సాగు అంచనా వేసింది. ఇందులో పత్తి 44.50 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 34,586 ఎకరాలలో వేశారు. అలాగే జొన్నలు సాధారణ సాగు 1.19 లక్షల ఎకరాలు కాగా 15,666 ఎకరాలలో, కందులు 7.61 లక్షల ఎకరాలకు గాను 6191 ఎకరాలలో, వరి 27.25 లక్షల ఎకరాలకు గాను 4719 ఎకరాలలో, పెసర్లు 2.21 లక్షల ఎకరాలకు గాను 3508 ఎకరాలలో వేశారు. రాష్ట్రంలో వానాకాలం సాగుకు మే చివరి వారంలోనే రైతులు దుక్కులు సిద్ధం చేసుకుంటారు.

నైరుతి విస్తరించకముందే పడే సాధారణ చినుకులతో ఒకసారి దుక్కి దున్నుతారు. ఆ తరువాత నైరుతితో తొలకరి జల్లులు మొదలవగానే మరోమారు దుక్కి దున్ని, విత్తనాలు వేసుకుంటారు. అయితే వాతావరణ శాఖ నివేదిక ప్రకారం రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించి విస్తరించేందుకు ఒకటి, రెండు రోజుల సమయం పట్టనుంది. దీంతో నేల లోపలి భాగం తడిచేలా భారీ వర్షాలు కురిస్తే ఉధృతంగా రైతులు విత్తనాలు వేస్తారు. ఈసారి మంచి వర్షాలే కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నియంత్రిత సాగు ప్రణాళికలకు అనుగుణంగా వ్యవసాయ శాఖ విత్తనాలు సిద్దం చేసింది. ఇప్పటికే కొంత మొత్తం రైతులకు అందుబాటులో పెట్టింది. ఇందులో వరి 15.56 లక్షల క్వింటాళ్లు, పత్తి కోటి 39 లక్షల విత్తన ప్యాకెట్లు (ప్రైవేట్ కంపెనీలు), కందులు 39 వేల క్వింటాళ్లు, పెసలు 15 వేల క్వింటాళ్లు, సోయాబీన్ 76 వేల క్వింటాళ్లు కేటాయించారు.

మొక్కజొన్నను వద్దన్నా వేస్తున్న రైతులు

రాష్ట్రంలో నియంత్రిత సాగు విధానంలో భాగంగా మొక్కజొన్న పంటను ఈ వానాకాలం సీజన్‌లో సాగు చేయొద్దని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే దండిగా నిల్వలు ఉన్నాయని, ఈ సీజన్‌లో వేస్తే దిగుబడి కూడా తక్కువగా వస్తుందని తెలిపింది. ఈ పంటకు బదులుగా పత్తి, కందులు వేసుకోవాలని సూచన చేసింది. అలాగే యాసంగి పంటగా మొక్కజొన్న వేసుకోవాలని స్పష్టం చేసింది. అయినా రైతులు మక్కలు సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు 3156 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ నివేదిక స్పష్టం చేస్తోంది. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్ధతు ధరకు మక్కల కొనుగోళ్లు చేపట్టరాదని ప్రభుత్వం భావిస్తోంది. వద్దన్నా సాగు చేస్తే నియంత్రిత సాగు ఎలా విజయవంతం అవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రతిసారి మార్కెట్‌లో ఎంఎస్‌పి రాని పక్షంలో ప్రభుత్వమే మద్ధతుకు మార్క్‌ఫెడ్ ద్వారా మక్కలను సేకరిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News