Thursday, May 16, 2024

ఈ దఫా ఇంటి బోనమే

- Advertisement -
- Advertisement -

Government Cancelled the Bonalu celebrations

 

వేడుకలు రద్దు
కీలక నిర్ణయం ప్రకటించిన ప్రభుత్వం

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో బోనాల వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది బోనాల వేడుకలు రద్దు చేసింది. కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం ఆలయాల్లో బోనాలను పూజారులే సమర్పిస్తారని స్పష్టం చేసింది. అలాగే ఎవరి ఇంట్లో వాళ్లు బోనాలు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. బోనంతో ఆలయాలకు రావొద్దని ప్రభుత్వం కోరింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మంత్రులు, అధికారులు బోనాల వేడుకల నిర్వహణ అంశంపై బుధవారం నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా బోనాల నిర్వహించే అంశంపై కూలంకషంగా చర్చించారు. జిహెచ్‌ఎంసి పరిధిలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో బోనాల వేడుకలను నిర్వహిస్తే కోవిడ్…19ను నియంత్రించడం మరింత కష్టసాధ్యమవుతుందని సమీక్షలో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ దేవాలయాల కమిటీ ప్రతినిధులు సూచించారు. దీంతో ఈసారి బోనాల వేడుకలు నిర్వహించకూడదని నిర్ణయించారు. ఆలయాల్లో బోనాలు సమర్పించడానికి ఎవరినీ అనుమతించకూడదని కూడా సమావేశంలో మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి రాష్ట్ర ప్రజలు సహకరించాలని ప్రభుత్వం కోరింది.

ఈ నేపథ్యంలో జంట నగరాల్లో ఏటా ఆషాఢ మాసంలో కనిపించే బోనాల వేడుకల సందడి ఈసారి కనిపించదు. కోరనా వైరస్ దృష్టిలో పెట్టుకుని ఈ దఫా ఎవరి ఇంట్లో వారు బోనం సమర్పించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది సామూహిక బోనాల వేడుకలు రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆలయాల్లో అమ్మవార్లకు పూజారులు మాత్రమే బోనాలు సమర్పిస్తారని తెలిపారు. ప్రజలు ఎవరి ఇంట్లో వారే దేవతలకు బోనాలు సమర్పించుకోవాలని సూచించారు.

ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం ప్రారంభం మొదలుకుని శ్రావణ మాసం ముగిసే వరకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో బోనాల సందడి ఉంటుంది. రాష్ట్రంలో ఈ నెల 22 నుంచి ఆషాఢ మాసం మొదలవుతుండగా, తొలుత గోల్కొండ బోనాలు, తర్వాత లష్కర్, చివరికి లాల్‌దర్వాజ బోనాలతో ఈ సంబురాలు ముగుస్తాయి. అయితే ఈ వేడుకల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. దేవతలకు బోనాలు సమర్పించి ఎంతో ఆనందోత్సవాలను విందులను ఏర్పాటు చేసుకుంటారు. పైగా రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు బంధు మిత్రులతో కలిసి సామూహికంగా జరుపుకునే పండుగ కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సిఎంకు ఆరోగ్య శాఖ నివేదిక?

బోనాల సందర్భంగా లాక్‌డౌన్ నిబంధనలు, భౌతిక దూరం భక్తులు పాటించరని, ప్రజలు గూమిగూడకుండా నియంత్రించడం పోలీసులకూ సాధ్యపడదని, ఇది కరోనా వైరస్ విజృంభణకు దారి తీస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే సిఎం కెసిఆర్‌కు ఒక నివేదిక అందజేసింది. ఈ నివేదికలో రాష్ట్రంలో కరోనా వ్యాధి ప్రబలుతున్న క్రమంలో బోనాల పండుగకు అనుమతించడం శ్రేయస్కరం కాదని సూచించిందని తెలిసింది. కరోనా వైరస్ బయటపడ్డ తొలినాళ్లలో ఇటలీ, ఇరాన్ వంటి దేశాలు మత సంబంధమైన కార్యక్రమాలకు అనుమతించడమే అక్కడ పరిస్థితి అదుపు తప్పడానికి ప్రధాన కారణమని నివేదికలో వివరించింది.

అలాగే మన దేశంలో మర్కజ్ ఉదంతం సృష్టించిన కలకలాన్ని పొందుపర్చింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఆలయాలు తెరవడం సహా లాక్‌డౌన్‌కు అనేక సడలింపులు ఇచ్చినప్పటికీ, మత సంబంధమైన కార్యక్రమాలకు ఇప్పటికీ అనుమతి ఇవ్వకపోవడాన్ని గుర్తుచేసింది. ఈ పరిస్థితుల్లో బోనాల పండుగకు అనుమతి ఇస్తే, కరోనా కొత్త కేసులను కొని తెచ్చుకున్నట్లేనని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సిఎం కెసిఆర్‌ను కలిసినప్పుడు కూడా స్పష్టం చేసినట్లు తెలిసింది. వైద్య శాఖ ఇచ్చిన నివేదికను దృష్టిలో పెట్టుకునే బోనాల వేడుకలను ప్రభుత్వం రద్దు చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News