Sunday, April 28, 2024

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కాలపట్టిక..

- Advertisement -
- Advertisement -

Farmers Concern Timeline Against Three Farm Laws

 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించడంతో ఏడాదికాలంగా సాగుతున్న రైతుల ఆందోళనకిక తెరపడుతుందని భావిస్తున్నారు. ఆందోళనాకాలంలో 700మంది రైతులు పలు సంఘటనల్లో మృతి చెందారు. నూతన వ్యవసాయ చట్టాల వల్ల కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తున్న కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) ఇక కనుమరుగు కానుందని రైతు సంఘాలు అనుమానించాయి. తమ జీవితాలను కార్పొరేట్ కంపెనీల దయాదాక్షిణ్యాలకు వదిలివేసేలా చట్టాలున్నాయని వారు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. రైతు సంఘాల ఐక్యవేదిక సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కెఎం) ఆధ్వర్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో గతేడాది నవంబర్ 26 నుంచి నిరంతర నిరసన కొనసాగుతోంది. రైతుల ఆందోళనకు ప్రతిపక్షాలు, పలు ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. పర్యావరణ ఉద్యమకారిణి గీతాథన్‌బెర్గ్, గాయకురాలుసామాజిక కార్యకర్త రిహానా, అమెరికా ఉపాధ్యక్షురాలి మేనకోడలు మీనాహారిస్‌సహా పలువురు ప్రముఖులు రైతు ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. కేంద్ర చట్టాలు, రైతు సంఘాల ఆందోళనలకు సంబంధించిన కీలక సంఘటనలు ఇలా ఉన్నాయి..

కేంద్ర వ్యవసాయ చట్టాలు,రైతు నిరసనల కాలపట్టిక

2020, సెప్టెంబర్ 14 … పార్లమెంట్ ముందుకు ఆర్డినెన్స్

2020, సెప్టెంబర్ 17 … ఆర్డినెన్స్‌కు లోక్‌సభ ఆమోదం

2020, సెప్టెంబర్ 20 … ఆర్డినెన్స్‌కు రాజ్యసభ ఆమోదం

2020, సెప్టెంబర్ 24 … మూడురోజుల రైల్‌రోకోకు పంజాబ్ రైతుల పిలుపు

2020, సెప్టెంబర్ 25 … ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ(ఎఐకెఎస్‌సిసి) పిలుపుతో దేశవ్యాప్తంగా రైతుల నిరసన

2020, సెప్టెంబర్ 26 … చట్టాలకు నిరసనగా బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎను వీడిన శిరోమణి అకాలీదళ్(ఎస్‌ఎడి)

2020, సెప్టెంబర్ 27 … వ్యవసాయబిల్లులపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో ప్రభుత్వగెజిట్ ద్వారా చట్టాలుగా..

2020, నవంబర్ 25 … ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చిన పంజాబ్, హర్యానాల్లోని రైతు సంఘాలు, కొవిడ్ నిబంధనలతో
అనుమతించని పోలీసులు

2020, నవంబర్ 26 … ఢిల్లీవైపుగా రైతుల ప్రదర్శన.. హర్యానాలోని అంబాలా జిల్లా వద్ద రైతులపై జల ఫిరంగులు,
భాష్పవాయువు ప్రయోగం

2020, నవంబర్ 28 … ఢిల్లీ సరిహద్దుల నుంచి రైతులు వెళ్లిపోతే వీలైనంత త్వరగా వారితో చర్చలకు సిద్ధమని
హోంమంత్రి అమిత్‌షా ప్రకటన

2020, డిసెంబర్ 3 … రైతు సంఘాలతో కేంద్రం మొదటిదఫా చర్చలు

2020, డిసెంబర్ 5 … రైతు సంఘాలతో కేంద్రం రెండోదఫా చర్చలు

2020, డిసెంబర్ 8 … భారత్‌బంద్‌కు రైతు సంఘాల పిలుపు

2020, డిసెంబర్ 9 … చట్టాల సవరణకు కేంద్రం ప్రతిపాదన, రైతు సంఘాల తిరస్కరణ

2020, డిసెంబర్ 11 … రైతు చట్టాలను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో బికెయు పిటిషన్

2020, డిసెంబర్ 13 … రైతు ఉద్యమం తుక్డే, తుక్డే ముఠాల చేతుల్లోకి వెళ్లిందన్న కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్

2020, డిసెంబర్ 30 … రైతు సంఘాలతో కేంద్రం ఆరోదఫా చర్చలు

2021, జనవరి 7 … రైతు సంఘాలతో కేంద్రం ఏడోదఫా చర్చలు

2021, జనవరి 12 … వ్యవసాయ చట్టాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు, సిఫారసుల కోసం నలుగురు సభ్యుల
కమిటీ ఏర్పాటు

2021, జనవరి 26 … రైతు సంఘాల పిలుపుతో ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ, ఆందోళనకారులకూపోలీసులకూ మధ్య
పలుచోట్ల ఘర్షణలు, ఎర్రకోట వద్ద విధ్వంసం, ఉద్రిక్తత, ఓ నిరసనకారుడి మృతి

2021, జనవరి 29 … ఏడాదిన్నరపాటు చట్టాలను నిలిపివేసి, జాయింట్‌కమిటీతో చట్టాలను పరిశీలింపజేస్తామని
కేంద్రం ప్రతిపాదన, రైతు సంఘాల తిరస్కరణ

2021, ఫిబ్రవరి 5 … రైతుల ఆందోళనకు అనుకూలంగా టూల్‌కిట్‌ను సృష్టించినవారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన
ఢిల్లీ సైబర్ పోలీసులు, టూల్‌కిట్‌ను షేర్ చేసిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటాథన్‌బర్గ్

2021, ఫిబ్రవరి 6 … దేశవ్యాప్తంగా మూడు గంటలపాటు రహదారుల దిగ్బంధంలో పాల్గొన్న రైతులు

2021, మార్చి 6 … ఢిల్లీ సరిహద్దుల్లో 100 రోజులకు చేరిన రైతుల నిరసన

2021, ఏప్రిల్ 15 … రైతులతో చర్చలు జరపాలని ప్రధాని మోడీకి హర్యానా డిప్యూటీసిఎం దుష్యంత్‌చౌతాలా లేఖ

2021, మే 27 … ఆరు నెలల నిరసనకు గుర్తుగా బ్లాక్‌డేను పాటించిన రైతులు

2021, జూన్ 5 … సంపూర్ణక్రాంతికారీ దివస్ పాటించిన రైతులు

2021, జూన్ 26 … ఏడు నెలల నిరసనకు గుర్తుగా ఢిల్లీకి రైతుల ప్రదర్శన

2021, జులై 22 … వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ సమీపంలో కిసాన్ సంసద్ పేరుతో రైతుల
సమాంతర సభ ప్రారంభం

2021, ఆగస్టు 7 … జంతర్‌మంతర్ వద్ద రైతుల సమాంతరసభను సందర్శించిన 14 పార్టీల నేతలు

2021, సెప్టెంబర్ 5 … కొన్ని నెలల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముజఫర్‌నగర్‌లో రైతు సంఘాల
బలప్రదర్శన

2021, అక్టోబర్ 22 … రైతుల ఆందోళన రాజ్యాంగం కల్పించిన హక్కులకు వ్యతిరేకం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్య,
నిరసనకారులు రహదారులను నిరంతరం దిగ్బంధించొద్దని ఆదేశం

2021, అక్టోబర్ 29 … ఘాజీపూర్ సరిహద్దు వద్ద బారికేడ్లను తొలగించిన ఢిల్లీ పోలీసులు

2021, నవంబర్ 19 … మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటన

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News