Tuesday, April 30, 2024

రైతులు భూమి క్రయవిక్రయాల్లో జాగ్రత్తలు పాటించాలి

- Advertisement -
- Advertisement -
  • రైతు చట్టాలపై అవగాహన సదస్సు
  • సీనియర్ సివిల్ జడ్జి సబిత

బిజినేపల్లి రూరల్: రైతులు భూముల క్రయ, విక్రయాలు, విత్తనాల కొనుగోలు విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవ సంస్థ కార్యదర్శి జి. సబిత అన్నారు. బుధవారం బిజినేపల్లి మండలం మహాదేవుని పేట గ్రామంలోని బిసి కమ్యూనిటి హాల్‌లో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో రైతులకు న్యాయవిఙ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు భూముల క్రయ, విక్రయాలు చేసుకున్నప్పుడు సాదా కాగితాలపైన రాసుకుని అనేక ఇబ్బందుకు గురవుతున్నారని, కోర్టులో దాదాపు 200పై సాద బైనామ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇట్టి సాదాకాగితాలు కోర్టులో చెల్లుబాటు కావు కనుక తప్పనిసరిగా భూ క్రయ, విక్రయాలను, భాగపరిష్కారాలను హద్దులతో కూడిన రిజిస్ట్రేషన్ ద్వారానే కొనుగోలు చేయాలని సూచించారు.

జిపిఏ ద్వారా ఇచ్చిన ఆస్తులు వారు బ్రతికి ఉన్నంత కాలం వారే అనుభవించుటకు హక్కు కలిగి ఉంటారు, వారసులకు జిపిఏ ద్వారా వచ్చిన ఆస్తులపై ఎలాంటి హక్కు ఉండదు కనుక రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి పంట దిగుబడులు రాక అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.

విత్తనాలు కొనేటప్పుడు తప్పనిసరిగా రశీదు తీసుకుని సమస్యలు వచ్చినప్పుడు న్యాయ సహాయం కోసం జిల్లా న్యాయస్థాన ప్రాంగణం జిల్లా న్యాయసేవ సంస్థను సంప్రదించవచ్చని, తద్వారా తమ సమస్యలు పరిష్కరించుకుని జీవితంలో ప్రశాంతంగా ఉంటారని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు న్యాయస్థానాల్లో పెండింగ్ ఉన్న కేసుల పరిష్కారానికి లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా సెప్టెంబర్ 9వ తేదిన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, ఈ లోక్‌అదాలత్‌లో భూ తగాదాలు కానీ లీగల్‌గా ఎలాంటి తగాదాలున్నా అందులో రాజీ చేసుకోవడానికి ముందుకు వచ్చి పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జూనియర్ న్యాయమూర్తులు ఎ. ప్రవీణ్ కుమార్, మౌనిక, సీనియర్ న్యాయవాదులు మధుసూదన్ రావు, శ్యాం ప్రసాద్ రావు, సత్యనారాయణ రావు, బాబు పియర్స్, బార్ అసొసియేషన్ అధ్యక్షులు రఘునాథ్ రావు, శ్రీరాం రామచంద్రయ్య, న్యాయ సేవా విభాగం సిబ్బంది దేవిక, కేశవరెడ్డి, సర్పంచ్ రాజేందర్ రెడ్డి, సబ్ ఇన్స్‌పెక్టర్ గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News