Monday, April 29, 2024

ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు

- Advertisement -
- Advertisement -

Fires in Maharashtra Hospitals

 

ఒకే రకమైన దారుణ దుర్ఘటనలు తలదాచుకోడానికి వెళ్లే చెట్టే అగ్గిపిడుగై విరుచుకుపడి బతుకులను అదే పనిగా బలి తీసుకుంటూ ఉండడం, ప్రాణ రక్షణ వ్యవస్థలే ఊపిరులను పదేపదే కబళించడం అత్యంత ఆందోళనకరం. ముంబై నగర సమీప విరార్‌లోని విజయవల్లభ్ ఆసుపత్రి ఐసియులో శుక్రవారం నాడు సంభవించిన అగ్ని ప్రమాదంలో 14 మంది కరోనా రోగులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఇంతవరకు జరిగిన ఇటువంటి పెక్కు ఘోర విషాదాల నుంచి మనం బొత్తిగా గుణపాఠం నేర్చుకోలేదని చాటుతున్నది. దేశంలో కొవిడ్ 19 రెండవ దశ అమితంగా విజృంభిస్తున్న మహారాష్ట్రలో ఆసుపత్రి అగ్ని ప్రమాదాలు తరచూ సంభవిస్తున్నాయి. పదుల సంఖ్యలో కరోనా రోగులను బలి తీసుకుంటున్నాయి. గత ఏడాది కాలంలో ఇటువంటి దుర్ఘటనలు ఆ రాష్ట్రంలో అనేకం సంభవించాయి. గత నెలలోనే ముంబై నగరంలోని భాండుప్ ప్రాంతంలో గల ఒక మాల్ (అతి పెద్ద దుకాణ సముదాయ భవనం) నాలుగో అంతస్థులోని సన్‌రైజ్ ఆసుపత్రిలో మంటలు వ్యాపించి పది మంది కొవిడ్ రోగులు చనిపోయారు. మాల్‌లో కూడా ఆసుపత్రిని నడపడం పట్ల ముంబై మేయర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ మాసారంభంలో నాగ్‌పూర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రి అగ్ని ప్రమాదంలో ముగ్గురు సాధారణ రోగులు చనిపోయారు, అనేక మంది గాయపడ్డారు. ఐసియులోని ఎసి విభాగంలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ నెల 6న నాసిక్ జిల్లా చాంద్ వాద్ పట్టణంలోని ఒక ప్రైవేటు కొవిడ్ ఆసుపత్రి భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఇందులో ఎవరూ చనిపోలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో గత ఏడాది ఆగస్టులో స్వర్ణా ప్యాలెస్ అనే హోటల్‌లో తాత్కాలికంగా నడిపించిన కొవిడ్ ఆసుపత్రిలో మంటలు చెలరేగి 10 మంది రోగులు దుర్మరణం పాలయ్యారు, 20 మందికిపైగా గాయపడ్డారు. గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో ప్రైవేటు కొవిడ్ ఆసుపత్రిలో కూడా విద్యుదాఘాతం దాపురించి ఐదుగురు కరోనా రోగులు మృతి చెందారు. ఈ దుర్ఘటనను సుప్రీంకోర్టు తనంతతానుగా విచారణకు స్వీకరించింది.

ఇటువంటివి తరచూ జరుగుతున్నాయి. కాని వాటి నివారణకు రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర చర్యలు తీసుకుంటున్న జాడలు కనిపించడం లేదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సాధారణంగా ఆసుపత్రులు నెలకొల్పేటప్పుడు అగ్నిమాపక విభాగం అక్కడ గల విద్యుత్ ప్రసార వ్యవస్థను తనిఖీ చేసి ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం కలుగకుండా ఉండడానికి తగిన పర్యవేక్షణ జరుపుతూ ఉంటుంది. ఎయిర్ కండీషనర్లకు విరివిగా విద్యుత్ వినియోగించవలసి రావడంతో అక్కడున్న కెపాసిటీని మించి వాడకం జరిగితే ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్లనే ఈ దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నట్టు తరచూ రుజువవుతున్నది. స్వల్ప స్థాయిలో అడుగు పెట్టి కొద్ది కాలంలోనే ఊహించనలవికాని విధంగా విజృంభిస్తున్న కరోనా దెబ్బకు దేశంలోని ఆసుపత్రులు, చికిత్స సౌకర్యాలు, పరికరాలు బొత్తిగా చాలడం లేదు.

ఈ లోపం గత ఏడాది తొలిసారి కరోనా వ్యాపించినప్పుడూ బయటపడింది. ఇప్పుడు సెకండ్ వేవ్ విలయతాండవంలో అది మరింత భయానకంగా ఉంది. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాద నివారణ ఏర్పాట్లు తగినంతగా లేని ఓ మాదిరి ఆసుపత్రులు కూడా కరోనా చికిత్సాలయాలుగా మారిపోతున్నాయి. అవసరం అటువంటిది. ఆదాయం మార్గం కూడా చాలా విశాలమైనది. హోటళ్లు, మాల్స్‌ను సైతం ఆసుపత్రులుగా మార్చి కరోనా రోగులను చేర్చుకుంటున్నారంటే వైద్య వ్యాపారులకు ఈ మహమ్మారి అంటు రోగం ఎంతటి వరంగా మారిందో చెప్పనక్కర లేదు. రోగులు అత్యంత నిసహాయులు, అగ్ని జ్వాలలు చుట్టిముట్టినప్పుడు పడక మీది నుంచి లేచి పరుగు పరుగున పారిపోయి ప్రాణాపాయం నుంచి తప్పించుకోలేని శారీరక అసమర్థులు, అస్వస్థులు.

అటువంటివారికి చికిత్స అందిస్తున్న ఇన్‌టెన్సీవ్ కేర్ యూనిట్లు స్పెషల్ వార్డుల్లోనే షార్ట్ సరూట్లు సంభవించి మంటలు చెలరేగుతుంటే వారిని కాపాడే దిక్కెవరు? అప్పుడే పుట్టిన పిల్లలతో కళకళలాడే ప్రసూతి ఆసుపత్రుల్లోనూ అగ్ని ప్రమాదాలు సంభవించి వారిని కబళిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఆసుపత్రులన్నింటిలో గల అగ్నిమాపక వ్యవస్థలను తనిఖీ చేయించాలని సుప్రీంకోర్టు గత డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కరోనా రోగుల చికిత్స కోసమే అవతరించే ఆసుపత్రులు అగ్ని మాపక శాఖ నుంచి నాలుగు వారాల్లో నిరభ్యంతర అనుమతి పత్రాలను తీసుకోవాలని అందులో సూచించింది. ఈ పనులు ఇప్పటికి పూర్తి అయి ఉంటే ఈ ప్రమాదాల్లో కొన్నైనా తప్పిపోయి ఉండేవి. ఇకనైనా ఈ చర్యలను ఆయా ప్రభుత్వాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆసుపత్రులలో అజాగ్రత్త కరోనాకు మించిన ప్రమాదకరమైన జాడ్యమని గమనించాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News