Saturday, May 4, 2024

మోడీ ఆర్థిక విధానాలు

- Advertisement -
- Advertisement -

ముందు చూపులేని వ్యర్థ ఆర్థిక విధానాలు, జనాకర్షక పథకాలు పేదలకు హాని చేస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా ఒక ఆంగ్ల వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో హెచ్చరించారు. బతుకు బాధల్లోని పేదలకు మద్దతుగా నిలిచి వారికి అండగా వుండడానికి ప్రభుత్వాలు రూపొందించి అమలు చేసే సంక్షేమ పథకాలనే మోడీ జనాకర్షక తాయిలాలు అంటున్నారు. 2018లో కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనకు ముందు ఆయన ఒక టెలివిజన్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ ఏడాది బడ్జెట్ జనాకర్షక నిర్ణయాలకు చోటు కల్పించబోదని అన్నారు. పేదలు ప్రభుత్వాలిచ్చే చాక్లెట్ల వంటి పథకాల కోసం అర్రులు చాచబోరని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అప్పటి నుంచి ప్రధాని మోడీ వీలు చిక్కినప్పుడల్లా జనాకర్షక పథకాలంటూ విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు కూడా అదే పని చేశారు. అయితే ఓటర్లను ఆదుకోడానికి సంక్షేమ పథకాలను గుప్పించడంలో ప్రధాని మోడీ ప్రభుత్వం కూడా తక్కువేమీ తినలేదు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం గరీబ్ కల్యాన్ యోజన వంటి పథకాలను కేంద్రం కూడా లెక్కలేనన్ని ప్రవేశపెట్టింది.

కర్నాటక శాసన సభ ఎన్నికలకు బిజెపి విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి ఏడాదికి 3 వంటగ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని, ప్రతిరోజు అర లీటరు నందిని పాలను, ప్రతి నెలా 5 కిలోల బియ్యాన్ని సరఫరా చేస్తామని వాగ్దానం చేశారు. ఇవి ఉచితాలు కావందామా? నోటితో పలుకరించి నొసటితో వెక్కిరించే విద్యలో ఆరితేరిన వారే ఇలా చేయగలరు. చెప్పేదానికి, చేసేదానికి బొత్తిగా పొంతన లేనితనమే నేటి రాజకీయం. ముందు చూపు కలిగిన, ఆచరణలో రుజువయ్యే ఆర్థిక విధానాలనే పాటించాలని, లేని పక్షంలో అవి పేదలను కష్టాలు పాలు చేస్తాయని ప్రధాని చేసిన ఉద్బోధ హర్షించదగినది. ఏ దేశ ఆర్థిక విజయానికైనా, ప్రజాహితానికైనా అటువంటి విధానాలే కీలకం. అయితే ప్రధాని మోడీ తన తొమ్మిన్నరేళ్ల పాలనలో అటువంటి విధానాలను ఏమేరకు అమలు చేసి ప్రజలకు మేలు జరిపారు అని ప్రశ్నించుకుంటే గట్టిగా ఒకటి కూడా కనిపించదు. అందుకు విరుద్ధంగా ముందు చూపు కొరవడిన ఆర్థిక విధానాలకు ఆయన ప్రభుత్వం పెట్టింది పేరని రుజువవుతుంది.

2016లో వున్నట్టుండి ఒక రాత్రి వేళ ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించి అట్టహాసంగా ప్రవేశపెట్టిన పెద్ద నోట్ల రద్దు దేశానికి మేలు చేసిందో, కీడు చేసిందో ఇంకా ప్రజల జ్ఞాపకంలో మెదులుతూనే వుంది. ఈ చర్య వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలోని గుప్తధనమంతా బయటపడిపోతుందని, ఆర్థిక సౌష్టవం పెరుగుతుందని ప్రధాని నమ్మబలికారు. వాస్తవంలో ఆ డబ్బంతా సురక్షితంగా బ్యాంకులకు చేరుకొని సక్రమ ద్రవ్యంగా మారిపోయింది. ఈ రద్దును అగస్మాత్తుగా అమల్లోకి తేవడం వల్ల చెల్లే డబ్బు చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా అయిపోయి బ్యాంకుల వద్ద మైళ్ళ తరబడి క్యూలు ఏర్పడి అక్కడే అనేక మంది చనిపోయారు. రద్దు చేసిన నోట్ల స్థానంలో కొత్త వాటిని సకాలంలో ముద్రించి సరఫరా చేయలేక దేశ ఆర్థిక ఆరోగ్యాన్ని బలి తీసుకొన్నారు. కొత్త నోట్ల ముద్రణ కింద ఆర్థిక భారం అలవికానిదైపోయింది. వ్యాపారాలు నష్టపోయాయి. ముఖ్యంగా చిన్న, చితక వ్యాపారాలు, పారిశ్రామిక కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. ఎటిఎంలు అనేక మాసాల పాటు మూతబడ్డాయి.

విదేశీ ఖాతాల్లో మూలుగుతున్న గుప్తధనరాశులను వెనక్కు తెచ్చి పేదల బ్యాంకు అకౌంట్లలో రూ. 15 లక్షల వంతున జమ చేస్తామని చేసిన వాగ్దానమూ బూటకంగా నిరూపణ అయిపోయింది. అందుకోసం తెరిచిన జన్‌ధన్ ఖాతాలు ఎందుకూ పనిరాకుండా పోయాయి. పెద్ద నోట్ల రద్దు వల్ల దారుణంగా చితికిపోయిన చిన్న వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు వస్తు, సేవల పన్ను అవకతవక రూపకల్పన, అమలు వల్ల మరింతగా పాతాళానికి కుంగిపోయాయి. లెక్కలేనన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. రెడీమేడ్ దుస్తుల పరిశ్రమ వంటి రంగాల్లో పెట్టుబడి లభించక ఉద్యోగలును సగానికి తగ్గించుకొన్నారు. గుజరాత్‌లోని సూరత్‌లో జౌళి పరిశ్రమ నిరసనలతో మార్మోగిపోయింది. ఇంకొక వైపు కార్పొరేట్ రంగానికి మోడీ ప్రభుత్వం అపరిమితమైన అండదండలు కల్పించింది. మొదటి ఐదేళ్ళలోనే రూ. 4.3 లక్షల కోట్ల మేరకు పన్ను రాయితీలు ఇచ్చింది. ఒక్క 2019 సెప్టెంబర్‌లోనే రూ. 1.45 లక్షల కోట్ల కార్పొరేట్ పన్ను రాయితీని ప్రకటించింది.

పబ్లిక్ రంగ పరిశ్రమలను కారుచవకగా తనకిష్టమైన కార్పొరేట్ యజమానులకు కట్టబెట్టడంలో మోడీ ప్రభుత్వం అందెవేసిన చేయి అనిపించుకొన్నది.ప్రజలు కొవిడ్ కోరల్లో చిక్కుకొని వున్నప్పుడు ఈ పని చేసింది. ముందు చూపు కలిగిన, ఆచరణలో పేదలకు మేలు చేసే ఆర్థిక విధానాలంటే ఇవే అనుకోవాలా? అలాగే దేశంలో ఇప్పుడున్న ధరలు ఇంతకు ముందెప్పుడూ లేవంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో పేదలకు సంక్షేమం కంటే వేరే దారి ఏముంది? అది ఎందుకు జనాకర్షకం అవుతుంది?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News