Thursday, May 2, 2024

మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Former cricketer Chetan Chauhan Passes Away

న్యూఢిల్లీ: కొంతకాలంగా కరోనా మహమ్మరితో బాధపడుతున్న టీమిండియా మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ (73) ఆదివారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని వైద్యులు ధ్రువీకరించారు. చౌహాన్ కరోనా ఉన్నట్టు జులై 12న నిర్వహించిన వైద్య పరీక్షల్లో తేలింది. అప్పటి నుంచి ఆయన లక్నోలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో గుర్‌గావ్‌లోని ఓ కార్పోరేట్ హాస్పిటల్‌లో చికిత్స కోసం చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. కరోనా వల్ల చేతన్ చౌహాన్ అవయవాలన్ని పనిచేయడం మానేశాయని, దీంతో ఆయనను బతికించడానికి తాము చేసిన ప్రయత్నాలన్ని వృధా అయ్యాయని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

చేతన్ భారత అలనాటి మేటి క్రికెటర్లలో ఒకడిగా పేరుతెచ్చుకున్నారు. ఓపెనర్‌గా జట్టులో కీలక పాత్ర పోషించారు. సునీల్ గవాస్కర్‌తో కలిసి టెస్టుల్లో మంచి ఓపెనర్‌గా ఓ వెలుగు వెలిగారు. చౌహాన్ 40 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఇక చౌహాన్ క్రికెట్‌లోనే కాకుండా రాజకీయాల్లో కూడా ఓ వెలుగు వెలిగారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఆయన పని చేశారు. ఇక చౌహాన్ మృతిపై భారత క్రికెట్ బోర్డుతో పాటు పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి భారత క్రికెట్‌కు తీరని లోటని పేర్కొన్నారు.

Former cricketer Chetan Chauhan Passes Away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News