Saturday, May 11, 2024

నకిలీ కస్టమర్ కేర్‌తో బురిడీ

- Advertisement -
- Advertisement -

Fraud with fake customer care number on Google

 

ఇన్‌వర్టర్ కోసం గూగుల్‌లో సెర్చ్
బాధితురాలికి ఫోన్ చేసిని నిందితులు
యూపిఐ ఐడి పంపి కొట్టేశారు

మనతెలంగాణ, హైదరాబాద్ : గూగుల్‌లో నకిలీ కస్టమర్ కేర్ నంబర్ పెట్టి ఓ బాధితురాలి డబ్బులు కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన బాధితురాలు ఈ నెల 6వ తేదీన అమేజాన్. కామ్‌లో ఇన్‌వర్టర్ కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చింది. తర్వాత గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్ కోసం సెర్చ్ చేసింది. సైబర్ నేరస్థులు పెట్టిన నకిలీ కస్టమర్ కేర్ నంబర్ 9641463004కు ఫోన్ చేసింది. తర్వాత సైబర్ నేరస్థులు ఫోన్ చేసి వెంటనే రూ.10,000 చెల్లించాలని చెప్పారు. దీనికి అంగీకరించిన బాధితురాలు వారు పంపించిన యూపిఐ ఐడి 9818102636@rbl పంపించారు. గూగుల్ పే యాప్‌లో తాము పంపించిన యూపిఐ ఐడిని టైప్ చేయాల్సిందిగా చెప్పడంతో వారు చెప్పినట్లు చేసింది. అందులో బాధితురాలు మూడు సార్లు రూ.39,989, రూ.39,989,రూ.19,989 ఎంటర్ చేసి తన పిన్‌ను టైప్ చేయడంతో బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు నిందితులకు వెళ్లాయి. తర్వాత కొంత సేపటి తర్వాత బ్యాంక్ స్టేట్‌మెంట్ చూసుకోవడంతో రూ.99,967 విత్‌డ్రా అయినట్లు ఉంది. వెంటనే సైబర్ నేరస్థులు ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో తాను మోస పోయానని గ్రహించి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ముందుగానే యూపిఐ ఐడి….

ఐదు రోజుల క్రితమే సైబర్ నేరస్థులు తమ మొబైల్ నంబర్లను కస్టమర్ కేర్ నంబర్లుగా గూగుల్‌లో పెట్టారు. ముఖ్యంగా షాపింగ్, పేమెంట్ యాప్‌లు, కొరియర్, వెబ్‌సైట్లలో తమ నంబర్లను పెడుతున్నారు. వాటిని నిజమని నమ్మి ఫోన్ చేసిన వారికి కుచ్చుటోపి పెడుతున్నారు. గతంలో నిందితులు క్యూఆర్ కోడ్ పంపించి స్కాన్ చేయమని చెప్పేవారు. ఇప్పుడు ముందుగానే యూపిఐ ఐడి సృష్టించి బాధితులకు పంపింస్తున్నారు. వాటిని యాప్‌లలో టైప్ చేసిన వారి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. కొందరు సైబర్ నిందితులు లింక్‌లను పంపించి రిమోట్ ద్వారా డబ్బులు దోచుకుంటున్నారు. విచిత్రంగా బాధితుల మొబైల్ నంబర్‌తో యూపిఐ ఐడిని క్రియేట్ చేసి పంపిస్తున్నారు. వాటిని నిజమని నమ్ముతున్న బాధితులు డబ్బులు పోగొట్టుకుంటున్నారు.

గూగుల్‌లో సెర్చింగ్ వద్దు: సైబర్ క్రైం పోలీసులు

కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్‌లో సెర్చింగ్ చేయవద్దని సైబర్ క్రైం పోలీసులు కోరారు. గూగుల్‌లో సైబర్ నేరస్థులు నకిలీ కస్టమర్ కేర్ నంబర్లను పెడుతున్నారని, వాటిని నిజమని నమ్మి మోసపోవద్దని అన్నారు. బ్యాంక్ ఖాతాలకు లింక్ ఉన్న మొబైల్ నంబర్లను కస్టమర్ కేర్ కోసం ఉపయోగించి ఫోన్ చేయవద్దని, దాని ఆధారంగా బాధితుల వివరాలు తెలుసుకుని కొట్టేస్తున్నారని అన్నారు. నిజమైన కస్టమర్ కేర్ నంబర్లు ఆయా సంస్థకు చెందిన యాప్‌లో ఉంటాయని తెలిపారు. కస్టమర్ కేర్ సర్వీస్ వారితో ఛాటింగ్ లేదా మేయిల్ చేయాలని ఫోన్ చేయవద్దని అన్నారు. బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్‌ను ఎవరికి షేర్ చేయవద్దని, ఎస్‌ఎంఎస్ చేయవద్దని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News