Sunday, April 28, 2024

వాక్‌స్వాతంత్య్రం స్వేచ్ఛగా దుర్వినియోగం అవుతోంది

- Advertisement -
- Advertisement -

Freedom of speech is most abused says SC

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్య
తబ్లీగి జమాత్ ఘటనపై కేంద్రం అఫిడవిట్‌పై తీవ్ర అసంతృప్తి

న్యూఢిల్లీ: దేశంలో ఇటీవలి కాలంలో వాక్ స్వాతంత్య్రం అత్యంత స్వేచ్ఛగా దుర్వినియోగం అవుతోందని సుప్రీంకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఈ ఏడాది పారంభంలో జరిగిన తబ్లీగి జమాత్ ఘటనపై మీడియా సంస్థలు వ్యవహరించిన తీరుపై కేంద్రప్రభుత్వం అత్యంత ఉదాసీనంగా అఫిడవిట్ దాఖలు చేయడంపై కూడా సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. దేశంలో కొవిడ్19 మహమ్మారి ప్రారంభమైన సమయంలో జరిగిన తబ్లీగి జమాత్ సమావేశాలపై కొన్ని మీడియా సంస్థలు మత విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యవహరించాయని ఆరోపిస్తూ జమైత్ ఉలేమా ఇ హింద్, మరి కొందరు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఎ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. త్రిసభ్య ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎఎస్ బొపన్న, వి రామసుబ్రమణ్యం కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది దుష్యంత్ దవే మాట్లాడుతూ జమాత్ తబ్లీగి ఘటనపట్ల కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌ను వ్యతిరేకించారు.

దీనిపై సిజెఐ సందిస్తూ ఎవరు ఏమనుకుంటున్నారో అది వాళ్లు చెప్పుకునే అవకాశముందన్నారు. ‘మీరు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారో వారు కూడా అలాగే చెబుతారు. మీకో విషయం చెబుతున్నాను. ఇటీవలి కాలంలో వాక్‌స్వాతంత్య్రం అత్యంత దారుణంగా దుర్వినియోగం అయింది’ అని బాబ్డే వ్యాఖ్యానించారు. కాగా తబ్లీగి జమాత్ అంశంపై సమాచార, ప్రసారాల శాఖ కార్యదర్శి కాకుండా అదనపు కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేయడంపట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టును మీ ఇష్ట వచ్చినట్లుగా భావించరాదని, జూనియర్ అధికారిఅఫిడవిట్ దాఖలు చేయడం సరికాదని అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాపై చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి విచారణను బెంచ్ మరో రెండు వారాలకు వాయిదా వేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News