Wednesday, May 8, 2024

ఈసారి రికార్డు స్థాయిలో సరుకు లోడింగ్

- Advertisement -
- Advertisement -

Freight loading at a record level this time

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే, హైదరాబాద్ డివిజన్ ప్రస్తుత సంవత్సరం సరుకు లోడింగ్‌లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం కన్నా ఈ సారి సరుకు లోడింగ్‌లో అధిక వృద్ధిని నమోదు చేసింది. డిసెంబర్ 07, 2020 వరకు డివిజన్‌లో 1.06 మిలియన్ టన్ను సరుకు లోడింగ్ నమోదుకాగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో నమోదయిన సరుకు లోడింగ్ కన్నా ఇది 58 శాతం అధికమని రైల్వే అధికారులు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన మొత్తం సరుకు లోడింగ్ 1.05 మిలియన్ టన్నుల మార్కును హైదరాబాద్ డివిజన్ ఇప్పటికే అధిగమించింది.

ప్యాసింజర్ సర్వీసుల్లో తగ్గుదల, ట్రాక్ నిర్వహణ పనుల్లో మెరుగుదల, నిరంతర పర్యవేక్షణ వంటి చర్యలతో సరుకు రవాణా రైళ్ల వేగంలో పెంపుదలకు దోహదపడ్డాయి. గత సంవత్సరం సరుకు రవాణా రైళ్ల వేగం గంటకు 27 కి.మీలు కాగా, ఈ సంవత్సరం గంటకు 50 కి.మీలకు చేరింది. దీనికి అదనంగా నూతనంగా ఏర్పాటు చేయబడిన బిజినెస్ డెవప్‌మెంట్ యూనిట్ల నిరంతర మార్కెటింగ్ చొరవ, సరుకు రవాణా వినియోగదారుల ప్రయోజనార్థం ప్రవేశపెట్టిన పలు రకాల మినహాయింపు పథకాలు ప్రస్తుత సరుకు లోడింగ్‌లో వృద్ధి సరికొత్త లోడింగ్‌ను ఆకర్షించేందుకు ఉపకరించాయి. సరుకు లోడింగ్‌లో హైదరాబాద్ డివిజన్ ఇటీవలి కాంలో సాధించిన విజయాలు ఇలా ఉన్నాయి.

ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 0.435 మిలియన్ టన్నులు ఎక్కువ

ఈ సంవత్సరం నూతనంగా మెర్తి స్టేషన్ నుంచి ఐరన్ ఓర్, క్వారట్జ్ చిప్స్‌లు, నిజామాబాద్ స్టేషన్ నుంచి మొక్కజొన్న, కౌకుంట్ల నుంచి బాయిల్ రైస్ ఉత్పత్తులను లోడ్ చేస్తున్నారు. మొదటిసారిగా రాష్ట్రంలోని నిజామాబాద్ స్టేషన్ నుంచి బంగ్లాదేశ్ సరిహద్దు అవతలి వైపునకు పసుపును రైల్వే శాఖ రవాణా చేస్తోంది. ఈ సంవత్సరం 0.847 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను రవాణా చేయగా, గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ఇది దాదాపుగా (0.435 మి. టన్ను)ల రెట్టింపు అని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

రైల్వే పట్ల విశ్వాసాన్ని పెంపొందించాలి: జిఎం గజానన్ మాల్య

కౌకుంట్ల వద్ద కొత్తగా ప్రైవేటు సరుకు లోడింగ్ టర్మినల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలకు బియ్యాన్ని రవాణా చేస్తున్నారు. సరుకు రవాణా వినియోగదారుల ప్రయోజనార్థం 40 ఫుల్ వ్యాగన్లకు బదులుగా 20 వ్యాగన్లతో కూడిన మినీ రేక్ సౌకర్యాన్ని కల్పించారు. దీంతో మొక్కజొన్న పంట లోడింగ్ పెంపునకు సహకరించింది. మాఛేరి రోడ్, ఖరగ్‌పూర్, హుబ్లీలోని జెఎస్‌డబ్ల్యు స్టీల్ వంటి ప్రధాన ప్రాంతాలకు ఐరన్ ఓర్‌ను రవాణా చేస్తున్నారు. సరుకు లోడింగ్‌లో వృద్ధిని నమోదు చేయడంలో నిరంతర కృషి చేసిన హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు గజానన్ మాల్య ప్రశంసించారు. రైల్వేలో నూతన లోడింగ్‌ను ఆకర్షించే దిశగా ఇదే తరహా కృషిని కొనసాగించాలని, సరుకు రవాణాదారులతో నిరంతరం చర్చలు జరుపుతూ రైల్వే పట్ల విశ్వాసాన్ని పెంపొందించాలని ఆయన సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News