Wednesday, May 1, 2024

అపరిమిత కోటా?

- Advertisement -
- Advertisement -

Give full powers to states over Reservations

 

స్వాతంత్య్రానంతరం దేశ సామాజిక నిర్మాణంతో పెనవేసుకొని కొనసాగుతున్న రిజర్వేషన్ల వ్యవహారం మరో మలుపు తిరగబోతున్నదా? ఎస్‌సి, ఎస్‌టిలకు జనాభా దామషా ప్రకారం రాజ్యాంగంలో కల్పించిన కోటా గాని, ఇతర వెనుకబడిన తరగతులు (ఒబిసిలు) తదితర అణగారిన వర్గాలకు వారి సామాజిక విద్యా సంబంధమైన ప్రగతి శూన్యతను తొలగించడం కోసం ఉద్దేశించిన రిజర్వేషన్లు గాని, దేశ జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న ఈ వర్గాల పురోభివృద్ధికి ఇంత వరకు చెప్పుకోదగినంతంగా తోడ్పడలేదు. దేశంలోని మొత్తం పేదరికం, అవిద్య ఈ వర్గాల నట్టింటిలోనే కాపురం ఉంటున్నాయి. రిజర్వేషన్లకు తోడుగా ప్రభుత్వాలు అందిస్తున్న పలు సంక్షేమ పథకాలు సైతం వీరి ముఖాన వీసమెత్తు వెలుగును పులమలేకపోతున్నాయి. అయినప్పటికీ తమ జనాభా దామాషా మేరకు తమకు రిజర్వేషన్లు పెంచాలన్న డిమాండ్ వెనుకబడిన తరగతుల నుంచి, తమకు కూడా కోటా వర్తింపచేయాలన్న ఒత్తిడి అగ్రవర్ణాల్లోని పేదల నుంచి పెరుగుతూ సామాజిక అశాంతిని పెంచుతున్నాయి. 1992లో ఇంద్రా సహానీ కేసులో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఈ డిమాండ్లన్నింటికీ ప్రధాన అడ్డంకిగా ఉంది.

మొత్తం రిజర్వేషన్ల పరిమితి 50 శాతం మించరాదని, ఎస్‌సి, ఎస్‌టియేతర కోటా వర్గాలలో ఇప్పటికే పైకి వచ్చిన వారిని మినహాయించాలని ఈ తీర్పు స్పష్టమైన హద్దు రేఖలను గీచింది. దీనితో ఆయా వర్గాల డిమాండ్ మేరకు 50 శాతం పరిమితికి మించి కోటాను పెంచుతూ వివిధ రాష్ట్రాల శాసన సభలు తీసుకుంటున్న నిర్ణయాలు కోర్టుల్లో వీగిపోతున్నాయి. ప్రధాని మోడీ ప్రభుత్వం పార్లమెంటు చట్టం ద్వారా ఆర్థిక బలహీన వర్గాలకు (ఇడబ్లుఎస్) కల్పించిన 10 శాతం రిజర్వేషన్లను కూడా ఈ తీర్పు భయపెడుతున్నది. మన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చొరవతో తెలంగాణలో కూడా ఆర్థిక రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. ఎస్‌టిలకు, ముస్లింలకు సైతం కోటా పెంచవలసి ఉన్న దృష్టా 50 శాతం పరిమితిని ఎత్తి వేయాలని, రిజర్వేషన్లపై రాష్ట్రాలకు పూర్తి అధికారం ఇవ్వాలని కెసిఆర్ పదేపదే విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ఎస్‌టిల కోటాను 6 నుంచి 10 శాతానికి, ముస్లిం రిజర్వేషన్లను 4 నుంచి 12 శాతానికి పెంచాలని కోరుతూ శాసన సభలో తీర్మానాలు చేయించి కేంద్రానికి పంపించారు. రిజర్వేషన్లపై కాల వ్యవధిని విధించిన రాజ్యాంగం వాటిపై ఎటువంటి పరిమితిని పెట్టలేదు.

వాటిని పెంచకుండా హద్దు గీత విధించలేదు. దేశంలోని కఠోర సామాజిక వాస్తవ పరిస్థితుల దృష్టా పదేళ్లకొకసారి పార్లమెంటు ద్వారా కోటా కాల పరిమితిని పెంచుతున్నారు. అందుచేత అణగారిన అన్ని సామాజిక వర్గాల, అగ్రవర్ణాల్లోని పేదల అభ్యున్నతికి కోటాను పెంచడం, కొత్తగా వర్తింపచేయడం అనివార్యమవుతున్నది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాలకు కల్పించిన కోటా, 50 శాతం పరిమితి అంశాలను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని రిజర్వేషన్లపై రాష్ట్రాలకు సంపూర్ణ అధికారాలు ఇవ్వాలని, 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సుప్రీంకోర్టు ధర్మాసనానికి ప్రత్యేక లేఖ రాసినట్టు వెలువడిన సమాచారం ఎంతైనా హర్షించదగినది. ఇది దేశంలో సర్వసమగ్ర సామాజిక న్యాయ సాధన దిశగా మరింత ఉపయోగపడుతుంది. సకల వెనుకబడిన తరగతులు జనాభాలో గణనీయంగా ఉన్న తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి తీసుకున్న ఈ చొరవ ప్రశంసార్హమైనది.

తమిళనాడులో ఇప్పటికే 69 శాతం కోటా అమల్లో ఉన్నదని, ఈశాన్య రాష్ట్రాల్లో ఎస్‌టిలు 50 శాతానికి మించి ఉన్నారని వగైరా వాస్తవాలను ముఖ్యమంత్రి తన లేఖలో సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చినట్టు వార్తలు చెబుతున్నాయి. చట్టం ముందు అందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పిస్తున్న మన రాజ్యాంగం దేశంలో గల అత్యంత ఎగుడు దిగుడు సామాజిక పరిస్థితుల దృష్టా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక ద్వారాలను తెరవడానికి కూడా అవకాశం కల్పించింది. అందుకోసం సానుకూల వివక్ష మార్గాన్ని తెరిచింది.

ఈ రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికీ కటిక దారిద్య్రంలో సామాజిక అణచివేతలో రాజకీయ ఆర్థిక అవకాశాలకు బహు దూరంగా కడు హీనంగా బతుకుతున్న దాదాపు వంద కోట్ల మంది కింది వర్గాల జనాభా కోసం కోటా పై పరిమితిని తొలగించడం, ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి రిజర్వేషన్లను కల్పించే అధికారాలను అక్కడి ప్రభుత్వాలకు ఇవ్వడం ఎంతైనా అవసరం. అయితే దేశమంతా ప్రైవేటుపరమైపోయి ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఉద్యోగాలు, విద్యా వకాశాలు మాయమైపోతున్న వేళ రిజర్వేషన్లను పెంచినా, తుంచినా ఏమి ప్రయోజనం అనే నైరాశ్యం కింది సామాజిక వర్గాల మెడలపై సునిశిత ఖడ్గంగా వేలాడుతుంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News