Sunday, April 28, 2024

వాస్తవిక అంచనాలే

- Advertisement -
- Advertisement -

Budget Proposals

 

పిండిని బట్టే రొట్టె

రాష్ట్ర బడ్జెట్‌పై సాగుతున్న కసరత్తు

అభివృద్ధి, సంక్షేమ రంగాలకు వీలైనంత ఎక్కువగా కేటాయింపులు

హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌ను వాస్తవిక అంచనాలతో రూపొందిస్తున్నారు. ముఖ్యమైన పథకాలకు నిధుల ప్రతిపాదనలు స్పష్టంగా ఉండాలని, అనవసర ప్రతిపాదనలు శాఖలు చేయరాదని ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్థిక శాఖకు ఆదేశించినట్లు తెలిసింది. అందులో భాగంగానే సిఎస్ సోమేష్ కుమార్ అన్ని శాఖల అధిపతులతో జరిపిన సమావేశంలోనూ ప్రాధాన్య పథకాలకు నిధుల కేటాయింపుల ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని సూచించారు. ఆర్థిక మాంద్యం, కేంద్రం నుంచి పన్నుల రాబడి తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుని ప్రాధాన్యాంశాల వారీగా అంచనాలు సిద్ధం చేయనున్నట్లు సమాచారం.

ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్ర ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతుండటంతో రాబడిపై దృష్టి సారించడంతో పాటు నీటిపారుదల, వ్యవసాయ రంగాలతో పాటు ఆరోగ్య రంగానికి అలాగే గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి, సంక్షేమ రంగం, ఆసరా, కళ్యాణ లక్ష్మీ, స్కాలర్‌షిప్ కోసం నిధుల కేటాయింపులు అధికంగా ఉండనున్నట్లు తెలిసింది. ఇప్పటికే నీటిపారుదల శాఖ దాదాపు రూ.30 వేల కోట్లకు పైగా ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం. అదే సమయంలో వ్యవసాయ శాఖ రుణమాఫీ కోసం రూ.18 వేల కోట్లు, రైతుబీమాకు రూ.1000 కోట్లు, రైతుబంధుకు రూ.15 వేల కోట్ల వరకు నిధుల ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు సమర్పించినట్లు తెలిసింది. అయితే వీటిని ఉన్నతస్థాయి సమీక్షలో సిఎస్ ప్రతిపాదలపై శాఖ స్థాయిలో చర్చించి, మళ్లీ నివేదించాలని సూచించనట్లు సమాచారం.

ముఖ్యంగా నీటిపారుదల రంగానికి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పూర్తికి ప్రతి ఏడాది మాదిరి ఈసారి కూడా రూ.25 వేల కోట్ల వరకు కేటాయింపులు చేస్తే బాగుంటుందని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నప్పటికీ రూ.10 వేల కోట్ల లోపే ఉండవచ్చుననే సమాధానం ఆర్థిక శాఖ అధికారుల నుంచి వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఏకంగా 64 శాతం కోత పెట్టిన విషయం తెలిసిందే. జిఎస్‌టి వసూళ్లు కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ, పరిస్థితులు ఇంకా మెరుగు పడలేదని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఎక్సైజ్ ద్వారా ఆదాయం పెరిగినట్లు పేర్కొన్నారు. భూముల విక్రయాల ద్వారా దాదాపు రూ.10 వేల కోట్లు ఆదాయం సమకూర్చుకోవాలని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం భావించినప్పటికీ, ఇంతవరకు ఒక్క భూమి కూడా విక్రయించలేదు.

దీంతో ఈసారి కూడా స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద అందే మొత్తంలో కేటాయింపులు ఉండనున్నట్లు తెలిసింది. కొత్త పథకాలు ప్రవేశపెట్టేది ఏమి లేనప్పటికీ, ఉన్న వాటిలోనే ముఖ్యమైన ప్రాధాన్య పథకాలను సమర్థవంతంగా అమలు చేసుకునేలా బడ్జెట్ ఉండాలని ఆర్థిక శాఖకు సిఎం స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.46 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈసారి కూడా కాస్త అటు ఇటుగా రూ. 1.50 లక్షల కోట్ల వరకు బడ్జెట్ అంచనాలు ఉండే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వ పథకాలు, ఉద్యోగుల వేతనాలు, ప్రాజెక్టులు, మరమ్మతులు ఖర్చుల కింద అంచనాలు సిద్ధం చేస్తున్నారు. సంక్షేమం, మౌలిక సదుపాయాలు, పరిపాలన, ఉద్యోగ అవకాశాల కల్పన, ఆర్థిక సుస్థిరత, ఆర్థిక వృద్ధి, అసమానతలు తొలగించేలా ప్రతిపాదనలు పెట్టాలని ఆర్థిక శాఖ తెలిపింది. పెట్టుబడి వ్యయానికి సంబంధించి ఇప్పటికే ప్రారంభించిన పనులు, పురోగతి, పెండింగ్, మరమ్మతుల వివరాలు వేర్వేరుగా పంపించాలని సిఎస్ స్పష్టం చేశారు.

Government Departments preparing Budget Proposals
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News