Tuesday, April 30, 2024

తెలంగాణలో ఒకటో తేదీన జీతాలు…

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగుల సంతోషం
గత నెల 05వ తేదీన, ఈ నెల 01 తేదీన ఉద్యోగుల అకౌంట్‌లలో జమ ఛేసిన ప్రభుత్వం

మనతెలంగాణ/హైదరాబాద్:  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో గత నెల నుంచి ఉద్యోగులు జీతాలు ఠంచన్‌గా అందుతుండడంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత నెల 5వ తేదీన ఉద్యోగులకు జీతాలు వారి అకౌంట్‌లలో వేయించిన సిఎం రేవంత్, ఈనెల 01వ తేదీనే ఉద్యోగులకు జీతాలను ఇప్పించడంతో వారు తమ సంతోషాన్ని సోషల్‌మీడియా వేదికగా పంచుకుంటున్నారు. సిఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో తామంతా ధైర్యంగా ఉన్నామని, నెల నాడు కట్టే బ్యాంక్ లోన్‌లు, మిగతా ఖర్చులను చెల్లించుకుంటామని వారు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని సిఎం రేవంత్ రెడ్డి సిపిఆర్‌ఓ అయోధ్య రెడ్డికి ఓ ఉద్యోగి వాట్సాప్‌లో షేర్ చేశారు. సిఎం రేవంత్‌కు తామంతా రుణపడి ఉంటామని, చాలా ఏళ్లుగా గత ప్రభుత్వం ఆలస్యంగా తమకు జీతాలను చెల్లించడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామని, ఉద్యోగుల తరపున సిఎం రేవంత్‌కు ఆ ఉద్యోగి కృతజ్ఞతలు తెలుపుతూ సిపిఆర్‌ఓ అయోధ్యరెడ్డికి వాట్సప్‌లో తన సందేశాన్ని పంపించారు. ఇలా చాలామంది ఉద్యోగులు సోషల్‌మీడియా వేదికగా తమ సంతోషాన్ని పంచుకోవడం చర్చనీయాశంగా మారింది.
ఆర్థికశాఖ అధికారులతో సిఎం చేసిన సమీక్షతో…
గత ప్రభుత్వంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీతాలు ఎప్పుడు జమ అవుతాయో అని ఎదురుచూసేవారు. కానీ, ఈ నెలలో మాత్రం మొదటి తారీఖునే బ్యాంకు ఖాతాల్లో ట్రెజరీ నుంచి జీతాలు జమ కావడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు నమ్మకలేకపోయారు. చాలా జిల్లాల్లోని ప్రభుత్వ సిబ్బందికి జీతాలు జమ కావడంతో దీనిని వారిలో వారు ఒక వింతగా, ఒక వార్తగా చెప్పుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత నెలలో ఐదవ తేదీన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్ జమ అయ్యింది. దీనికి వచ్చిన స్పందనను పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జనవరి నెల చివరి రోజున ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులతో సమీక్ష జరిపారు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ప్రతి నెలా జీతాలు వేయాల్సిందే. రెండో వారంలో వేసినా, మొదటివారంలో వేసినా ప్రభుత్వానికి ఇది  తప్పనిసరి. కానీ, జీతం అందుకునే వారికి మాత్రం జీతం ఏ రోజు పడిందనేది చాలా ముఖ్యమైన అంశం అవుతుంది. జనవరిలో మనం ఐదో తేదీన వేశాం. ఈసారి మొదటి తారీఖునే ఎందుకు జమ చేయలేం. ఆలోచించి ట్రై చేయండి. ఎలాగూ ఏదో ఒక రోజు వేయాల్సిందే గదా. అది ఫస్ట్ రోజునే వేస్తే ఉద్యోగుల సంతోషం వేరేగా ఉంటుందని సిఎం ఆర్థిక శాఖ అధికారులతో వ్యాఖ్యానించడంతో గంటల వ్యవధిలోనే అది అమల్లోకి వచ్చింది. అందుకే ప్రభుత్వ సిబ్బందికి మొదటిరోజున జీతం పడడం తెలంగాణలో హాట్ టాఫిక్‌గా మారింది. ఇదే సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News